ప్రాణాలు పోతున్నా పట్టదా..!

ABN , First Publish Date - 2020-10-24T10:05:13+05:30 IST

భారీ వర్షాల నేపథ్యంలో.. వరదలు, శిథిల భవనాలే కాదు.. కొత్త నిర్మాణాల కోసం తవ్విన సెల్లార్‌లూ పౌరులను బలి తీసుకుంటున్నాయి. కొన్నాళ్ల క్రితం మాదాపూర్‌లో ఓ సెల్లార్‌లో పడి బాలుడు మృతి చెందగా..

ప్రాణాలు పోతున్నా పట్టదా..!

పట్టణ ప్రణాళికా విభాగం తీరుపై విమర్శలు

సెల్లార్‌ తవ్వకాలు పట్టని వైనం

అధికారుల నిర్లక్ష్యానికి నాలుగేళ్ల బాలుడి మృతి

ఆ జోన్లలో కొందరు అధికారులు అంతే


హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 23 (ఆంధ్రజ్యోతి) : 

భారీ వర్షాల నేపథ్యంలో.. వరదలు, శిథిల భవనాలే కాదు.. కొత్త నిర్మాణాల కోసం తవ్విన సెల్లార్‌లూ పౌరులను బలి తీసుకుంటున్నాయి. కొన్నాళ్ల క్రితం మాదాపూర్‌లో ఓ సెల్లార్‌లో పడి బాలుడు మృతి చెందగా.. గత ఆదివారం బంజారాహిల్స్‌లో మరో ఘటన జరిగింది. ఆడుకుంటూ వెళ్లిన నాలుగేళ్ల్ల బాలుడు బహుళ అంతస్తుల భవనం కోసం తవ్విన సెల్లార్‌ గుంతలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఈ ప్రమాదాలకు కచ్చితంగా జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం నిర్లక్ష్యమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భవన నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నాయన్నది జోనల్‌, సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు తెలుసు. సెల్లార్‌ ఎక్కడ తవ్వారు..? ఏ భవనాల వద్ద తవ్వే అవకాశం ఉందన్న సమాచారం వారి వద్ద ఉంటుంది. దాని ఆధారంగా ఆయా సైట్లకు వెళ్లి తవ్విన సెల్లార్‌ల వద్ద జాగ్రత్తలు తీసుకునేలా, కొత్త సెల్లార్‌లు తవ్వకుండా చర్యలు తీసుకునే అవకాశముంది. అయినా అధికారులు అదేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. బంజారాహిల్స్‌లో ప్రమాదం జరిగిన సైట్‌ వద్ద సెల్లార్‌ చుట్టూ కనీసం బారీ కేడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఇదే బాలుడు సెల్లార్‌లోని నీటిలో పడేందుకు కారణమని చెబుతున్నారు.


ఆ జోన్లలో అంతే...

జీహెచ్‌ఎంసీలోని ఖైరతాబాద్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లలో పట్టణ ప్రణాళికా విభాగం తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో గుడ్డిగా అనుమతులివ్వడమే కాకుండా.. అక్రమ నిర్మాణాలనూ పట్టించుకోరనే అపవాదు ఉంది. బహుళ అంతస్తుల భవన నిర్మాణంలో ఉల్లంఘనలు జరుగుతున్నా కనీసం నిలువరించే ప్రయత్నం చేయరు. ఉన్నత స్థాయి ఒత్తిళ్లతోపాటు కొందరు అధికారుల అవినీతి ఇందుకు కారణంగా తెలుస్తోంది. బంజారాహిల్స్‌లోని ప్రముఖ పాఠశాల లేన్‌లో బహుళ అంతస్తుల భవన నిర్మాణం జరుగుతోంది. నిర్మాణదారులు సెట్‌బ్యాక్‌లు వదలకుండా రోడ్డు వరకు సెల్లార్‌ తవ్వారు. దీంతో రహదారి కూలిపోయే ప్రమాదం నెలకొంది. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. 

Updated Date - 2020-10-24T10:05:13+05:30 IST