యువతులను మోసం చేసిన యువకులపై కేసు
ABN , First Publish Date - 2020-06-18T10:01:58+05:30 IST
పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి యువతులను మోసం చేసిన ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అమీర్‌పేట, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి యువతులను మోసం చేసిన ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి(25)నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చి సనత్‌నగర్ డివిజన్ బీకేగూడలో నివసిస్తూ గచ్చిబౌలిలోని ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తోంది. షాపునకు తరచూ వెళ్తున్న కాకినాడకు చెందిన వెంకటసురేష్ ఆమెను పరిచయం చేసుకున్నాడు.
అప్పుడప్పుడు ఆ యువతికి ఖరీదైన చీరలు ఇచ్చేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో నగలు, నగదు ఇచ్చింది. ఇద్దరూ ఎస్‌ఆర్‌నగర్‌లో ఉంటున్న అతడి బాబాయి ఇంట్లో తరచుగా కలుస్తూ ఉండేవారు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి చేయడంతో ముఖం చాటేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంకటసురేష్, అతడి బంధువులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమిస్తున్నానంటూ..
అమీర్‌పేట: ప్రేమిస్తున్నానని యువతిని మోసం చేసిన మరో యువకుడిపై ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా, మొవ్వమండలం, కూచిపూడి గ్రామానికి చెందిన యువతి(25) ఉద్యోగం కోసం నగరానికి వచ్చి మధురానగర్‌లో ఉంటోంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10కి చెందిన పండుగ ప్రవీణ్(27)ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేశాడు. తనను పెళ్లి చేసుకోమని బాధితురాలు నిలదీస్తే చెల్లి వివాహం అయిన తర్వాత చేసుకుంటానని చెప్పాడు. సోదరి పెళ్లి అయినా అతడు స్పందించకపోవడంతో నిలదీయగా.. చేసుకోనని.. తన వద్దకు వస్తే చంపుతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.