హైదరాబాద్ : ఈ క్లబ్‌లో వెయ్యి రూపాయిల మద్యం బాటిల్ 7 వేలు!

ABN , First Publish Date - 2020-05-17T15:32:19+05:30 IST

మారేడుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న న్యూక్లబ్‌ లాక్‌డౌన్‌తో మూసి వేయాల్సి ఉండగా..

హైదరాబాద్ : ఈ క్లబ్‌లో వెయ్యి రూపాయిల మద్యం బాటిల్ 7 వేలు!

  • మారేడుపల్లి న్యూ క్లబ్‌లో అసలేం జరిగింది?
  • లాక్‌డౌన్‌లో రూ.లక్షల మద్యం విక్రయాలు    
  • రూ.1000 బాటిల్‌కు 7 వేలు 

హైదరాబాద్/అడ్డగుట్ట : మారేడుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న న్యూక్లబ్‌ లాక్‌డౌన్‌తో మూసి వేయాల్సి ఉండగా చాటుమాటుగా మద్యం అమ్మకాలు జరిపారు. క్లబ్‌ కమిటీ సభ్యులే గ్రూపుగా ఏర్పడి స్టీరింగ్‌ కమిటీ వేసుకొని రూ.1000 బాటిల్‌ను 7 వేలకు విక్రయించారు. క్లబ్‌లో ఉన్న 90 శాతం మద్యం స్టాక్‌ విక్రయాలు జరిపారు. ఇరవై రోజుల్లో రూ.80 లక్షల వ్యాపారం సాగింది. క్లబ్‌ వాచ్‌మన్‌ సహాయంతో మధ్యరాత్రి కారులో ప్రతి రోజూ గంట వ్యవధిలో ఐదుగురు వచ్చి మద్యం కొనుగోలు చేసి వెళ్లిపోయారు. ఇలా ఇరవై రోజుల్లో స్టాక్‌ను మొత్తం అమ్మేశారు. ఈ వ్యవహారంలో కార్ఖానా ఎక్సైజ్‌ పోలీసులు చక్రం తిప్పారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్లబ్‌లో బ్లాక్‌లో విక్రయించిన సొమ్ములో కొంత పక్కదారి పట్టినట్లు విశ్వసనీయ సమాచారం.


క్లబ్‌ కమిటీ సభ్యులను విచారిస్తున్న ఎక్సైజ్‌ పోలీసులు

లాక్‌డౌన్‌లో అక్రమంగా మద్యం విక్రయించిన కమిటీ సభ్యులను ఒక్కొక్కరిని ఎక్సైజ్‌ పోలీసులు విచారిస్తున్నారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అప్పటికప్పుడు కమిటీ సభ్యులపై కేసులు నమోదు చేస్తున్నట్లు సమాచారం. 


విశ్వసనీయ సమాచారం : టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకృష్ణ 

మారేడుపల్లి న్యూ క్లబ్‌లో లాక్‌డౌన్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని ఆలస్యంగా సమాచారం వచ్చింది. తాము వెళ్లేసరికి సరుకు లేదు. ఇక్కడ బ్లాక్‌లో మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలిసింది. వెంటనే ఎక్సైజ్‌ సీఐకి ఫోన్‌చేసి క్లబ్‌ను ఎందుకు సీజ్‌ చేయలేదని అడిగాం. లాక్‌డౌన్‌లో ఎవరు మద్యం విక్రయించినా పట్టుకుని ఆయా పోలీస్‌ స్టేషన్లకు అప్పగిస్తాం.


కేసు నమెదు చేస్తున్నాం : ఎక్పైజ్‌ సీఐ నవనీత 

లాక్‌డౌన్‌ రోజుల్లో న్యూక్లబ్‌లో మద్యం అమ్మకాలు జరిగాయని తెలిసింది. తమకు ఫిర్యాదు వస్తే వెళ్లి చూశాం. స్టాక్‌ ఉందా లేదా అని పరిశీలించాం. కొంత మంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు న్యూ క్లబ్‌పై కేసులు నమోదు చేస్తున్నాం. మరిన్ని విషయాలు చెప్పేందుకు సీఐ నిరాకరించారు.

Updated Date - 2020-05-17T15:32:19+05:30 IST