ఐదు రోజులు.. 59 భవనాల కూల్చివేత..!
ABN , First Publish Date - 2020-10-19T21:08:16+05:30 IST
వర్షాల నేపథ్యంలో గత ఏడు రోజుల్లో 59 శిథిల భవనాలు కూల్చివేసినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకే్‌షకుమార్ తెలిపారు. వరదలు, వరుస వానల దృష్ట్యా.. పురాతన భవనాలు కూలే అవకాశం ఉందని, 33 శిథిల భవనాల్లో ఉన్న 140 మందిని ఖాళీ చేయించామన్నారు. మూసీ తీరంలో

హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): వర్షాల నేపథ్యంలో గత ఏడు రోజుల్లో 59 శిథిల భవనాలు కూల్చివేసినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకే్‌షకుమార్ తెలిపారు. వరదలు, వరుస వానల దృష్ట్యా.. పురాతన భవనాలు కూలే అవకాశం ఉందని, 33 శిథిల భవనాల్లో ఉన్న 140 మందిని ఖాళీ చేయించామన్నారు. మూసీ తీరంలో మంగళ్ హాట్‌లో నివసించే 35 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. ప్రమాదకరంగా మారిన భవనాలను సీల్ చేయడంతోపాటు చుట్టూ బారికేడింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ యేడాది ఇప్పటి వరకు 545 భవనాలు శిథిలావస్థలో ఉన్నట్టు గుర్తించామని, వాటిలో 187 కూల్చివేయగా.. 127 భవనాలకు మరమ్మతు చేయించామన్నారు. ఇంకా ఎక్కడైనా శిథిల భవనాల్లో ప్రజలు ఉంటే గుర్తించి ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలూ సహకరించాలని కమిషనర్ కోరారు.
శనివారం నాటి వర్షానికి
ఎల్‌బీనగర్, చైతన్యపురి, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, ప్రకాష్‌నగర్, బ్రాహ్మణ్‌వాడీ, చాదర్‌ఘాట్, హయత్‌నగర్‌లో వరద పోవడం లేదు. శనివారం 87.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రకృతి ప్రకోపంతో ఆయా ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది.
ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జిపై గొయ్యి
భారీ వర్షాలకు పాతబస్తీ ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జిపైన ఆరడుగుల గొయ్యి ఏర్పడింది. దీంతో పోలీసులు ఆ రూట్‌ను పూర్తిగా మూసివేశారు. ఈ బ్రిడ్జి మూసివేయడంతో ఓ రకంగా చెప్పాలంటే పాతబస్తీలోని పలు ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో లింకు కట్ అయినట్లే.
కేటీఆర్‌కు హైస్కూల్ గురువు ట్వీట్.. వెంటనే స్పందించిన కేటీఆర్
భారీ వర్షాలకు అడిక్‌మెట్ డివిజన్ లలితానగర్‌లో డ్రైనేజీ ఓవర్ ఫ్లో అవుతోంది. వరద నీరు పోటెత్తుతోంది. ఈ సమస్యపై మంత్రి కేటీఆర్‌కు ఆయన హైస్కూల్ రువు, లలితానగర్ అడిక్‌మెట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన సత్యనారాయణ ట్విటర్ ద్వారా శనివారం రాత్రి తెలిపారు. వెంటనే స్పందించిన కేటీఆర్ ఆ సమస్యను పరిష్కరించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే గోపాల్‌కు సూచించారు. ఆయన అధికారులతో కలిసి వెళ్లి సమస్యను పరిశీలించారు. పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించారు.
భారీ వాహనాలకు నో ఎంట్రీ
గగన్‌పహాడ్ పాత కర్నూల్ రోడ్డు వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ట్రాఫిక్ పోలీసులు ఆ రోడ్డును వన్‌వేగా మార్చారు. అప్పచెరువు కట్ట తెగడంతో వచ్చిన వరదకు పాతకర్నూల్ రోడ్డు ప్రాంతంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పూర్తిగా దెబ్బతింది. బ్రిడ్జి పక్కన పెద్ద గొయ్యి ఏర్పడి బస్సు అందులో పడిపోయింది. పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ట్రాఫిక్ పోలీసులు పాత కర్నూల్ రోడ్డు వద్ద వన్‌వే ఏర్పాటు చేశారు. భారీ వాహనాలకు నో ఎంట్రీ అని చెప్పారు.