గ్రేటర్‌లో 37 మందికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-05-13T07:36:55+05:30 IST
కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. వైరస్ బారిన పడిన పలువురిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు

ఆబిడ్స్/ఉప్పల్/అల్వాల్/అఫ్జల్‌గంజ్/చాదర్‌ఘాట్/కవాడిగూడ/సరూర్‌నగర్/హైదరాబాద్ సిటీ, మే 12 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. వైరస్ బారిన పడిన పలువురిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. గ్రేటర్‌లో మంగళవారం 37 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కింగ్‌కోఠిలో 15 కేసులు
కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలో 15కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అక్కడ 45 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వీరిలో ఇద్దరు గతంలో పాజిటివ్ వచ్చిన రోగులు, తాజాగా నమోదైన వారితో కలిపి 17 మంది పాజిటివ్ రోగులు ఉన్నారు. మిగిలిన 28 మంది కరోనా అనుమానితులు. వీరి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు.
కరోనా పరీక్ష కోసం ఆస్పత్రుల చుట్టూ..
ఉప్పల్ భరత్‌నగర్‌కు చెందిన వ్యక్తి 15 రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా అతడికి చెస్ట్ ఆస్పత్రిలో పరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి తల్లి, భార్య, ఇద్దరు కుమారులను బేగంపేట్‌లోని నేచర్‌క్యూర్ ఆస్పత్రి క్వారంటైన్‌లో ఉంచారు. మొదటి అతడు గాంధీకి వెళ్లగా కింగ్‌కోఠి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. వైద్యులు పరీక్షించగా టీబీ లక్షణాలు ఉండటంతో చెస్ట్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. చివరకు కరోనా పరీక్షలు చేసి పాజిటివ్‌గా నిర్ధారించారు.
తల్లికి సపర్యల కోసం వెళ్లి..
టీబీ సమస్యతో బాధపడుతున్న తల్లిని మలక్‌పేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పర్యవేక్షణ చూస్తున్న కుమారుడు ఆస్పత్రికి ప్రతిరోజూ వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో అతడు అనారోగ్యానికి గురయ్యాడు. సోమాజిగూడ, పేట్‌బషీరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. తగ్గకపోవడంతో సికింద్రాబాద్‌లోని మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆయన భార్య(43), కుమారుడు(13), కుమార్తె(17)తో పాటు ఇంట్లో పనిచేసే సర్వెంట్(60)ను అమీర్‌పేట్‌లోని నేచర్‌క్యూర్ ఆస్పత్రికి తరలించామని అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ప్రసన్నలక్ష్మి, అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ యాదయ్య తెలిపారు.
మాదన్నపేటలో 11 నెలల చిన్నారికి పాజిటివ్
మాదన్నపేట వినాయకవీధిలో నివసిస్తున్న వ్యక్తికి రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ రాగా అతడి కుటుంబంలో 11 నెలల చిన్నారికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు.
డబీర్‌పురాలో మరొకరికి..
డబీర్‌పురా నివాసికి పాజిటివ్ వచ్చింది. ఇంటి యజమాని(65) ఢిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన తర్వాత ఏప్రిల్ 26న కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.
భాగ్యలక్ష్మినగర్‌లో మరో మహిళకు..
కవాడిగూడ భాగ్యలక్ష్మినగర్‌లో మరో మహిళ(46)కు పాజిటివ్ వచ్చింది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న మహబూబ్‌నగర్ జిల్లా వాసి(31), అతడి బంధువు సంగారెడ్డి నివాసి యువతి(23), మరో యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం విదితమే. వీరు నివసిస్తున్న ఇంటి యజమానులతోపాటు 13 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఇంటి యజమాని భార్య(46)కు పాజిటివ్ వచ్చింది.
స్వీపర్, ఆమె భర్తకు..
మీర్‌పేట్-అల్మా్‌సగూడ రోడ్డులోని సిర్లాహిల్స్ కాలనీకి చెందిన మహిళ(48) జీహెచ్‌ఎంసీ భరత్‌నగర్ డివిజన్‌లో స్వీపర్‌గా పని చేస్తున్నారు. ఆమె సోమవారం అస్వస్థతకు గురవడంతో మలక్‌పేట్ ప్రభుత్వ ఆస్పత్రికి... అక్కడి నుంచి కింగ్‌కోఠి ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు నమూనాలు సేకరించి గాంధీ ఆస్పత్రికి పంపించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెను కింగ్ కోఠి ఆస్పత్రి నుంచి గాంధీకి తరలించారు. ఆమె భర్త(54) స్వల్ప అస్వస్థతకు గురికాగా కింగ్ కోఠి ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అతడికి పరీక్షలు చేయగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని బాలాపూర్ పీహెచ్‌సీ హెల్త్ సూపర్‌వైజర్ గోవింద్‌రెడ్డి తెలిపారు. వారి ఇద్దరు కుమారులను హోం క్వారంటైన్ చేశారు.
జియాగూడలో వృద్ధుడి మృతి
జియాగూడ ఇందిరానగర్‌బస్తీకి చెందిన వ్యక్తి(65) కరోనా వైర్‌సతో చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రిలో మృతి చెందాడు. అతడి ఇద్దరు కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు, ఆరుగురు పనిమనుషులను ప్రకృతి చికిత్సాలయంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. వారి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పంపించారు.