జూలో ‘జోలాలి’
ABN , First Publish Date - 2020-05-09T10:42:50+05:30 IST
లాక్‌డౌన్ సమయంలో జూ పార్కులో కొన్ని చిన్న జంతువులు అడుగు పెట్టాయి.
14 కొత్త కూనల జననం
మదీన, మే 8 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్ సమయంలో జూ పార్కులో కొన్ని చిన్న జంతువులు అడుగు పెట్టాయి. మార్చి 23 నుంచి ఇప్పటి వరకు 14 జంతువులు జన్మించాయి. రెండు ఆఫ్రికన్ లయన్ పిల్లలు, మూడు రాయల్ బెంగాల్ టైగర్ పిల్లలు, ఆరు జాకల్ పిల్లలు, మూడు నిప్పుకోడి పిల్లలు జన్మించాయి. ప్రస్తుతం వాటిని వాటి తల్లుల సంరక్షణలో ఉంచి వెటర్నరీ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. లాక్‌డౌన్ పూర్తయి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత వాటిని సందర్శకులు తిలకించేందుకు వీలుగా ఎన్‌క్లోజర్లలో ఉంచనున్నారు.
రాయల్ బెంగాల్ టైగర్ పిల్లలు
మార్చి చివరి వారంలో మూడు రాయల్ బెంగాల్ టైగర్ కూనలు జన్మించాయి. ఆశా, ప్రభాస్ అనే పేర్లు గల జంటకు ఇవి జన్మించాయి. రాయల్ బెంగాల్ టైగర్లు సాధారణంగా ఒంటరిగా జీవిస్తుంటాయి. కలయిక జరిగే ప్రత్యేక కాలంలో ఆడ, మగ టైగర్లను ఒకేచోట ఉంచుతారు. వీటి జీవిత కాలం 18 ఏళ్లు. ఇవి ఒకేసారి 2 నుంచి 4 పిల్లలను జన్మనివ్వగలవు. గర్భధారణ సమయం 105 నుంచి 110 రోజులు. ప్రస్తుతం జూపార్కులో 12 రాయల్ బెంగాల్ టైగర్లు ఉన్నాయి. వీటికి రోజూ కిలో చికెన్, అర లీటరు పాలు, రెండు కోడిగుడ్లు, ఎనిమిది కిలోల ఎద్దు మాంసం అందిస్తారు.
ఆఫ్రికన్ లయన్ పిల్లలు
మార్చి చివరి వారంలో రెండు ఆఫ్రికన్ లయన్ పిల్లలు పుట్టాయి. వీటి తల్లి పేరు ఆదిషానా. దీన్ని 2013లో సౌదీ వైల్డ్ లైఫ్ అథారిటీ తరఫున మన జూకు బహుమతిగా అందజేశారు. నెహ్రూ జూలాజికల్ పార్కుకు వచ్చిన తర్వాత రెండు కాన్పుల్లో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం రెండు కూనలు పుట్టాయి.
ఆస్ట్రిచ్ పక్షి పిల్లలు
ఆస్ట్రిచ్ పక్షికి మూడు పిల్లలు పుట్టాయి. వీటిని తెలుగులో నిప్పు కోడి అంటారు. ఇది భూమిపై నివసించే పక్షుల్లో చాలా ఎత్తైనది. వేగంగా పరుగెత్తగలదు. పండ్లు, ధాన్యాలు, గింజలతోపాటు క్రిమికీటకాలను కూడా తింటుంది. గుడ్లు పెట్టి పిల్లలను కంటుంది. ఒక్కో గుడ్డు బరువు 1.4 కిలోలు ఉంటుంది. గుడ్లు పెట్టి 60 నుంచి 145 రోజుల్లో పొదుగుతుంది. పెద్దజంతువు ఎదురైనప్పుడు తనను వేటాడుతుందని భావించినప్పుడు ఆకుల చాటున, బండరాళ్ల మధ్యన దాక్కుంటుంది. కాళ్లు దృఢంగా ఉంటాయి. అడవుల్లో సంచరించేటప్పుడు అడ్డు వచ్చిన జంతువులను కాళ్లతో బలంగా తన్నుతుంది.
జాకల్ పిల్లలు
నక్క జాతికి చెందిన ఆరు జాకల్ పిల్లలు జన్మించాయి. వీటి జీవిత కాలం 15 ఏళ్లు. ఇవి ఒక కాన్పులో 4 నుంచి 6 పిల్లలకు జన్మనిస్తాయి. ఇవి రోజుకు రెండు కిలోల ఎద్దు మాంసం తింటాయి.