సెర్వ్‌ సైన్యం

ABN , First Publish Date - 2020-04-28T11:02:21+05:30 IST

కరోనా మనసును కల్లోల పరుస్తోంది. వైరస్‌ తాలుకా భయం.. దాని బారిన పడకుండా ఉండాలన్న జాగ్రత్తల

సెర్వ్‌ సైన్యం

మానసిక రుగ్మతలపై పోరులో 130 మంది నిపుణులు

 వైద్య సేవల కోసం 99850 10680 నంబర్‌లో సంప్రదించవచ్చు 


కల్చరల్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): కరోనా మనసును కల్లోల పరుస్తోంది. వైరస్‌ తాలుకా భయం.. దాని బారిన పడకుండా ఉండాలన్న జాగ్రత్తల పాటింపులో రకరకాల సంకోచాలు ఇంటింటా చికాకులు పెంచుతున్నాయి. అవి మానసిక కుంగుబాటుకు కారణమవుతున్నాయి. అలాంటి వారు ఎలాంటి వ్యయప్రయాసలకు లోనుకాకుండానే సంపూర్ణ స్వస్థత పొందేందుకు హెల్త్‌ సైకాలజీ కౌన్సిల్‌ బాసటగా నిలుస్తోంది. మనసుకి కష్టంగా, బరువుగా, గుండెదడగా అనిపించే చాలా సమస్యలకు సులువైన, అనువైన సలహా, సూచనలతో సాంత్వన చేకూర్చే కౌన్సెలింగ్‌ నిపుణులు అన్నివేళలా సిద్ధంగా ఉంటున్నారు. ఒకరు.. ఇద్దరు కాదు.. హైదరాబాద్‌ కేంద్రంగా ఏకంగా 130 మంది నిపుణులు మానసిక ధారుడ్య వైద్యసేవలను అందించేందుకు అందుబాటులో ఉన్నారు. 99850 10680కు ఫోన్‌ చేస్తే చాలు సమస్త సమస్యలకూ పరిష్కారం చూపుతున్నారు. ఈ బృందానికి సమన్వయకర్త, సెంట్రల్‌ యూనివర్సిటీ హెల్త్‌ సైకాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ మీనా హరిహరన్‌ సెర్వ్‌ సేవలను ఆంధ్రజ్యోతికి వివరించారు.


ఆ సంగతులు క్లుప్తంగా ఆవిడ మాటల్లోనే...

సెర్వ్‌ బృందం రోజురోజుకి సేవల్ని విస్తరిస్తోంది. సపోర్ట్‌ ఫర్‌ ఎమోషనల్‌ రిహాబిలిటేషన్‌ ఆఫ్‌ వైరస్‌ విక్టిమ్స్‌ పేరుతో అసోసియేషన్‌ ఆఫ్‌ హెల్త్‌ సైకాలజి్‌స్ట్సకి అనుబంధంగా ఆరు సంస్థలు, పలువురు ప్రముఖులు సెర్వ్‌ని ప్రజా ప్రయోజనాలకు అనువుగా అందుబాటులోకి తెచ్చారు. ఫోన్‌తో పాటు ఫేస్‌బుక్‌లో కౌన్సెలింగ్‌, కరోనా పేరుతో అన్ని సేవలూ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వారి ఆరోగ్యసేతుతో సహా పలు ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో అవసరమైన వారికి తగిన సూచనలు, వసతుల కల్పనకు తోడ్పడుతున్నాం.


కొవిడ్‌ బాధితులు, ప్రజారోగ్య కార్యకలాపాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, ఆశా వర్కర్‌లు, వైద్యులు, వారి కుటుంబాల వారు, నర్స్‌లు రకరకాల సమస్యలు, సందేహాలతో మా బృందాన్ని సంప్రదిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు మా కౌన్సెలింగ్‌ కోరుకుంటున్నారు. గతంలో ఎన్నడూ ఇప్పుడున్న తరహాలో ఇంటిపట్టున ఉండని, ఇమడని కుటుంబసభ్యులు తమను తాము అర్థం చేసుకోవటం కోసం కూడా మాతో సంభాషణలు పెంచుతున్నారు. పిల్లల పెంపకంపై అనుమానాల నివృత్తికి మా కేంద్రాన్ని సంప్రదిస్తున్నారు. కరోనా ఇబ్బందులకు ముందుకాలంలో మానసిక స్థితి సరిగాలేని రోగులు తగిన మందులు, వైద్యులతో సంప్రదింపులులేక ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు.


వారి వల్ల కుటుంబంలో కలతలు పెరుగుతున్నాయి. నగరంలో కన్నా గ్రామాలలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కొందరు  ఆకలి బాధలు మాకు ఫోన్‌ ద్వారా వినిపిస్తున్నారు. వలస కార్మికులు స్వస్థలాలపై బెంగని మాతో చెప్పుకుని ఇంటికెళ్లే దారి చూపించమని విలపిస్తున్నారు. మా బృందం వారి ఇబ్బందులను ప్రభుత్వశాఖలు, పోలీసులకు చెప్పి తగిన పరిష్కారం కోసం ప్రయత్నిస్తోంది. మొన్ననే మిజోరాంకి చెందిన 700మందికి పరిష్కారం చూపించాం. కొందరికి భాష సమస్య కూడా. ఐదు రాష్ట్రాలలో మా సెర్వ్‌ సేవలు ఇప్పుడు చురుకుగా సాగుతున్నాయి. సమస్య ఏదైనా, ఎలాంటి వివరాలు కావాలన్నా.. మమ్మల్ని నిస్సంకోచంగా సంప్రదించవచ్చు.

Updated Date - 2020-04-28T11:02:21+05:30 IST