గర్భిణికి అండగా డయల్ 100
ABN , First Publish Date - 2020-04-07T09:26:06+05:30 IST
పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు డయల్ 100 అండగా నిలిచింది.

కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు డయల్ 100 అండగా నిలిచింది. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి వాజ్‌పేయినగర్‌లో నివాసముంటున్న మాధవ్ భార్య లక్ష్మికి సోమవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించగా అంబులెన్స్ సిబ్బంది ప్రస్తుతం అందుబాటులో లేరని, కొంత సమయం పడుతుందని తెలిపారు. మహిళకు పురిటినొప్పులు ఎక్కువ అవుతుండడం, లాక్‌డౌన్ నేపథ్యంలో వాహనాలు అందుబాటులో లేకపోవడంతో వారు ఆందోళన పడుతూ స్థానికులను ఆశ్రయించారు. దీంతో చొరవ చూపిన టీఆర్‌ఎస్ కార్యకర్త జెలిగం రాకేష్ డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.
స్పందించిన పోలీస్ అధికారులు పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని పెట్రోలింగ్ వాహనంలో కుత్బుల్లాపూర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. యూపీహెచ్‌సీలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు పరిస్థితి కొంత విషయంగా ఉండడం వల్ల మెరుగైన వైద్యం కోసం సుల్తాన్‌బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. అనంతరం మహిళకు ఆపరేషన్ చేయడంతో మగ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సకాలంలో స్పందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.