ఆర్టీసీ గట్టెక్కేదెలా?

ABN , First Publish Date - 2020-05-11T10:43:01+05:30 IST

మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంలా మారింది ఆర్టీసి పరిస్థితి. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాక్‌డౌన్‌తో మరింత కష్టాల్లో కూరుకు పోయింది.

ఆర్టీసీ గట్టెక్కేదెలా?

ఫిబ్రవరి నాటికే రూ.4.5 కోట్ల నష్టాల్లో ఆసిఫాబాద్‌ డిపో

లాక్‌డౌన్‌తో మరో మూడు కోట్ల అదనపు భారం

ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో 50 శాతం జీతాలే చెల్లింపు


కలెక్టరేట్‌, మే10: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంలా మారింది ఆర్టీసి పరిస్థితి. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాక్‌డౌన్‌తో మరింత కష్టాల్లో కూరుకు పోయింది. లాక్‌డౌన్‌తో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. సాధారణంగా ప్రతి నెల ఆసిఫాబాద్‌ ఆర్టీసీ డిపోకు రూ.3.30 కోట్ల ఆదాయం వచ్చేది. లాక్‌డౌన్‌తో ఆదాయం రాకపోగా ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.1.44 కోట్లు అదనపు భారంగా మారాయి. ఇప్పటికే రూ.4.5 కోట్ల నష్టంతో నెట్టుకొస్తున్న ఆసిఫాబాద్‌ డిపో  కరోనా నేపథ్యంలో మరో రూ.3కోట్ల నష్టాన్ని భరించాల్సి వస్తుంది. ఆసిఫాబాద్‌ డిపోలో ప్రస్తుతం 62 ఆర్టీసీ బస్సులు, 20 ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. ఇవి 26 రూట్లలో నిత్యం 30 వేల కిలోమీటర్లు తిరుగుతూ 15వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. ఈ లెక్కన రోజుకు బస్సు డిపోకు రూ.11 లక్షల ఆదాయం సమకూరుతుంది.


మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించిన ప్రభుత్వం తాజాగా దానిని మే 29 వరకు పొడిగించింది. దీంతో అప్పటి వరకు బస్సులు రోడ్డెక్కే అవకాశం లేకుండా పోయింది. అంతేకాకుండా కార్మికులకు సంస్థ మార్చి, ఏప్రిల్‌ మాసాలకు సంబంధించి సగం వేతనాలను వారి అకౌంట్లలో జమ చేసింది. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేం దుకు ఈమధ్యనే బస్సు చార్జీలు పెంచినా ఫలితం లేకుండా పోయింది. 


నష్టాల ఊబిలో ఆసిఫాబాద్‌ డిపో

ఆసిఫాబాద్‌ డిపోలో 149 డ్రైవర్లు, 129 మంది కండక్టర్లు, 43 మంది మెకానిక్‌ సిబ్బంది, 23 మంది ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 350 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికి నెలకు రూ.1.45 కోట్లు వేతనాల రూపంలో సంస్థ చెల్లిస్తుంది. ఆసిఫాబాద్‌ డిపోకు నెలకు రూ.3.30 కోట్ల ఆదాయం వస్తుంది. కాగా వేసవికాలం, పెళ్ళిళ్ల సమయంలో నెలకు రూ.3.60 కోట్ల వరకు ఆదాయం సమకూరేది. కాగా ఫిబ్రవరి నెలాఖరు వరకే ఆసిఫాబాద్‌ డిపో రూ.4.5 కోట్ల నష్టంలో కూరుకుపోయింది. లాక్‌డౌన్‌తో మరో రూ.3 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే లాక్‌డౌన్‌ సమయంలో ఎమర్జెన్సీలో నడిపిం చేందుకు 8బస్సులను, 16మంది డ్రైవర్లు, 16మంది కండక్టర్లు రోజూ విధులకు హాజరవుతున్నట్లు అధికా రులు పేర్కొన్నారు.


ఈనెల 8 నుంచి డిపో సిబ్బంది మొత్తం  విధులకు హాజరు కావాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందినట్లు డిపో మేనేజర్‌ కృష్ణమూర్తి పేర్కొన్నారు. లాక్‌డౌన్‌తో బస్సులు బయట తిరగకున్నా నిత్యం వాటి మెయుంటనెన్స్‌ చూడాల్సిందే. రోజుల తరబడి బస్సులు నిలిచి ఉండడంతో టైర్లలో గాలి, ఇంజన్లలో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండడంతో ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు, మెకానిక్‌లు నిత్యం వాటిని పరిశీలిస్తున్నారు. 


ప్రయాణికుల ఇబ్బందులు 

48 రోజులుగా బస్సులు నడవక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రైవేటు వాహనదారులు అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. కొన్ని రోజులుగా కరోనా కేసులు నమోదు కాకపోవడంతో జిల్లా పరిధిలోనైనా బస్సులు నడిపించేందుకు అనుమతి ఇవ్వాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. 


ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే బస్సులు నడిపిస్తాం .. కృష్ణమూర్తి, డిపో మేనేజర్‌

ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందగానే బస్సులను యథావిధిగా నడిపిస్తాం. ఇప్పటికే లాక్‌డౌన్‌ నేపథ్యంలో డిపోకు రూ.3 కోట్ల నష్టం వచ్చింది. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి దీంతో మరింత భారం పెరిగింది.  

Updated Date - 2020-05-11T10:43:01+05:30 IST