విగ్రహాల తయారీదారులకు విఘ్నాలు

ABN , First Publish Date - 2020-08-16T10:43:33+05:30 IST

వినాయక విగ్రహాల తయారీదారులకు విఘ్నాలు మొదలయ్యాయి. మందమర్రి పట్టణంలో వినాయకులను తయారు చేసి

విగ్రహాల తయారీదారులకు విఘ్నాలు

ఈనెల 22న వినాయక చవితి

మండపాలు ఏర్పాటు చేయవద్దన్న ప్రభుత్వం

కొవిడ్‌ నిబంధనలతో మారిన బతుకు చిత్రం 

కొనుగోళ్లు లేక నిల్వ ఉన్న వినాయక విగ్రహాలు 


కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో ఈ ఏడాది వినాయక చవితిని ఘనంగా నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. యేటా గణేశుడి పండుగ వస్తుందటే చాలు చిన్న, పెద్ద, పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అందరూ ఉత్సహంగా మండపాలు ఏర్పాటు చేసుకునే వారు. పోటాపోటీగా విగ్రహాలను ప్రతిష్ఠించేవారు.  ఈ ఏడాది ఆ పరిస్థితులు లేకపోవడంతో తయారీదారులు తమ కుటుంబాలను పోషించుకునేదెలా అని ఆందోళన చెందుతున్నారు. 


మందమర్రిటౌన్‌, ఆగస్టు 15: వినాయక విగ్రహాల తయారీదారులకు విఘ్నాలు మొదలయ్యాయి. మందమర్రి పట్టణంలో వినాయకులను తయారు చేసి విక్రయిస్తుంటారు. 20 ఏళ్ల క్రితం రాజస్ధాన్‌ నుంచి  వచ్చిన వీరు వినాయక చవితికి గణపతి విగ్రహాలు, దసరాకు కనకదుర్గ విగ్రహాలను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం వీరి పరిస్థితి దయనీయంగా మారింది. విఘ్నాలు తొలగించే వినాయకులను తయారు చేసే తమ బతుకుల్లో విఘ్నాలు మొదలయ్యాయని పేర్కొంటున్నారు. మందమర్రి రాష్ట్రీయ రహదారి పక్కన విగ్రహాల తయారీదారులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి విగ్రహాలను తీసుకువచ్చి విక్రయిస్తుంటారు.  ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కాలనీల్లో మండపాలు ఏర్పాటు చేయవద్దని, ఇళ్లల్లోనే పూజలు నిర్వహించుకోవాలని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఈసారి వినాయక విగ్రహాల దుకాణాలను ఎవరు నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదు.


దుర్గామాత విగ్రహాలను తయారు చేసేందుకు తీసుకువచ్చిన ముడిసరుకు కూడా నిల్వ ఉండడంతో తయారీదారులు ఆందోళన చెందుతున్నారు. వినాయక విగ్రహాలను ఐదు అడుగులకు మించి తయారు చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో విగ్రహాల తయారీదారులకు ముడిసరుకుల కొనుగోలుకు తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి. యేటా వినాయకుల నిమజ్జనం పూర్తయిన తర్వాత 2 నెలల అనంతరం మళ్లీ విగ్రహాల తయారీ ప్రారంభిస్తారు.  కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో అప్పటికే తయారు చేసిన పెద్ద వినాయక విగ్రహాలను పక్కన పెట్టేశారు. ప్రస్తుతం నిబంధనలకు అనుగుణంగా 2 నుంచి 5  అడుగుల లోపు విగ్రహాలను తయారు చేశారు. ప్రస్తుతం గిరాకీలు లేక తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 22న వినాయక చవితి పండుగ ఉన్న దృష్య్టా తయారు చేసిన విగ్రహాలు అమ్ముడుపోతాయా లేదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  విగ్రహాలు అమ్ముడుపోతేనే తమ కడుపులు నిండుతాయని పేర్కొంటున్నారు. 


వడ్డీలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం..ధర్మాజీ, తయారీదారుడు

రాజస్ధాన్‌ నుంచి మందమర్రికి వచ్చి 20 ఏళ్లు అవుతోంది. విగ్రహాలను తయారు చేస్తూ జీవిస్తున్నాం. కరోనా వైరస్‌తో మార్చి నుంచి విగ్రహాలను తయారు చేయడం ఆపివేశాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విగ్రహాలను తయారు  చేసినా ఎవరు కొనడం లేదు. చేసిన విగ్రహాలన్నీ షెడ్డులోనే నిల్వ ఉన్నాయి. విగ్రహాలు అమ్ముడుపోకపోతే తప్ప మేము తీసుకువచ్చిన కూలీలకు డబ్బులు చెల్లించలేము. ప్రభుత్వం మమ్మలను ఆదుకోవాలి. బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. 


గిరాకీలు లేవు..అశోక్‌, తయారీదారుడు 

గత సంవత్సరం ఇప్పటికే వందలాది విగ్రహాలను అమ్మేవాళ్లం. కరోనా వైరస్‌తో ఈసారి ఒక్క విగ్రహానికి కూడా అడ్వాన్సు రాలేదు. కరోనా నిబంధనలకు అనుగుణంగా విగ్రహాలను తయారు చేశాం.  ఎలాగైనా అమ్ముడుపోతాయని అప్పులు చేసి విగ్రహాలు తయారు చేశాం. ఇప్పుడు కరోనా వైరస్‌తో తమ పరిస్థితి అధ్వానంగా తయారైంది. విగ్రహాలు అమ్ముడుపోక పోతే మాకు పూట గడవం కూడా కష్టంగా ఉంటుంది.  ప్రభుత్వం మాకు ఆర్థికంగా సాయం అందించాలి.

Updated Date - 2020-08-16T10:43:33+05:30 IST