మూగజీవాల రోదన.. ఆగని వన్య ప్రాణుల వేట...

ABN , First Publish Date - 2020-12-11T04:25:46+05:30 IST

వేటగాళ్ళు, ఊరకుక్కలతో వన్య ప్రాణులు మృతి చెందుతున్నాయి. అటవీ యంత్రాంగం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక మూల అటవీ జంతువులు బలవుతూనే ఉన్నాయి.

మూగజీవాల రోదన.. ఆగని వన్య ప్రాణుల వేట...
ప్రాణహిత కృష్ణ జింకల అభయారణ్యం


మరో వైపు ఊరకుక్కల దాడి 

బలవుతున్న వన్య ప్రాణులు 


కోటపల్లి, డిసెంబరు 10: వేటగాళ్ళు, ఊరకుక్కలతో వన్య ప్రాణులు మృతి చెందుతున్నాయి. అటవీ యంత్రాంగం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక మూల అటవీ జంతువులు బలవుతూనే ఉన్నాయి. వేటగాళ్ల చెరలో పడకుండా తప్పించుకున్నా దారి తప్పి గ్రామాల్లోకి రావడంతో ఊరకుక్కలు వెంటపడి దాడులు చేస్తున్నాయి. కోటపల్లి మండలంలో దట్టమైన అటవీ ప్రాంతం, మరో వైపు ప్రాణహిత పరివాహక ప్రాంతం ఉండడంతో ఇది వన్య ప్రాణులకు ఆవాసమైంది. ప్రాణహిత పరివాహక ప్రాంతమంతా కృష్ణ జింకల అభయారణ్యంగా పేరొందగా వేటగాళ్లు, ఊరకుక్కలతో ఇక్కడ వన్య ప్రాణుల రక్షణ సవాల్‌గా మారుతున్నాయి. 


అటవీ సరిహద్దు గ్రామాల్లో....

మండలంలోని అటవీ సరిహద్దు గ్రామాల్లో వేట సాగుతోంది. మండలంలోని ఎసన్‌వాయి, ఎడగట్ట, పిన్నారం, నక్కలపల్లి, పంగిడిసోమారం, బొప్పారం, అన్నారం, రాజారాం, నాగంపేట, ఏదులబంధం, రొయ్యలపల్లి తదితర గ్రామాల్లో వేటగాళ్లతో పాటు ఊరకుక్కలతో వన్యప్రాణులకు ముంపు పొంచి ఉంది. వన్యప్రాణులు మేత కోసం, దాహం తీర్చుకునేందుకు గ్రామాల పొలిమేరల్లోకి వస్తుండగా వీటిని చూసి ఊరకుక్కలు వెంటపడి తరమడంతో అవి గాయాలపాలవుతున్నాయి. కొందరు వేటగాళ్లు  కుప్పకూలిన వన్య ప్రాణులను హతమారుస్తున్నారు. ఇదంతా గుట్టుగా సాగుతుండగా కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నెల రోజుల క్రితం ప్రాణహిత పరివాహక ప్రాంతంలో ఓ చుక్కల దుప్పి కుక్కల బారి నుంచి తప్పించుకునే క్రమంలో మృత్యువాత పడింది. కానీ అటవీ అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో పాటు పశువైద్యాధికారితో పంచనామా చేయించకుండానే ఖననం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. రెండు నెలల క్రితం మల్లంపేట గ్రామ సమీపంలోకి వచ్చిన చుక్కల దుప్పిని వేటగాళ్లు హతమార్చి మాంసం విక్రయిస్తుండగా అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అలాగే అర్జునగుట్ట ప్రాంతంలో కొండగొర్రెను హతమార్చిన మరో వేటగాన్ని అదుపులోకి తీసుకుని చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు.  


పొంచి ఉన్న ప్రమాదం...

అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు విద్యుత్‌ తీగలతో వేట సాగించడం వల్ల మనుషుల ప్రాణాలకు సైతం ప్రమాదం పొంచి ఉంది. ఈ నెల 10న ఎసన్‌వాయి అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అజ్మీర తిరుపతి, పసుల భీమయ్యలు తీగలతో వేట సాగిస్తుండగా అటవీ అధికారులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు. అయితే ఇక్కడ రిజర్వు అటవీ ప్రాంతంలో వేటగాళ్లు పెట్టిన విద్యుత్‌ తీగల నుంచి బీట్‌ అధికారి ప్రాణాల నుంచి బయటపడ్డాడు.   నాలుగు సంవత్సరాల క్రితం పిన్నారం అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలకు తగిలి పెద్దపులి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించగా అప్పటి నుంచి అటవీ అధికారులు వేటగాళ్లపై ఉక్కుపాదం మోపారు. దాదాపు 3 సంవత్సరాలపాటు వేటగాళ్లు అడవుల వైపు చూడలేదు. తాజాగా మరో మారు వేటగాళ్ల ఉనికి కనబడుతుండడం, పలు సంఘటనలు వెలుగు చూస్తుండడంతో వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్ధకంగా మిగిలనుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించి వన్య ప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-11T04:25:46+05:30 IST