వాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2020-10-04T09:55:52+05:30 IST

మండల సర్వ సభ్య సమావేశానికి పలువురు అధికారులు హాజరు కాకపోవడంపై పాలకవర్గ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు

వాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం

బెజ్జూరు, అక్టోబరు3: మండల సర్వ సభ్య సమావేశానికి పలువురు అధికారులు హాజరు కాకపోవడంపై పాలకవర్గ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బెజ్జూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ డోకె రోజారమణి అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం జరిగింది.   సమావేశానికి అధికారులు హాజరు కాకుంటే ఎలా అంటూ సభ్యులు ప్రశ్నించారు. ఇక నుంచి ప్రతి సమావేశానికి అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటామంటూ ఎంపీపీ రోజారమణి సభకు సమాధానం ఇచ్చారు. గ్రామాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు ఐసీడీఎస్‌ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదంటూ ఎంపీటీసీలు శ్రీనివాస్‌, పర్వీన్‌ సుల్తానాలు అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. గ్రామంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని బెజ్జూరు సర్పంచ్‌ అన్సార్‌ హుస్సేన్‌ కోరారు. బెజ్జూరు ఆశ్రమ బాలికల పాఠశాలలో మహిళా ప్రధానోపాధ్యాయురాళ్లను నియమించాలని పీఏసీఎస్‌ చైర్మన్‌ హర్షద్‌ హుస్సేన్‌ కోరారు.


ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని కాగజ్‌నగర్‌ ఏటీడీఓ నీలిమా అన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న పల్లె ప్రకృతి వనాల విషయంలో అటవీ అధికారులు అడ్డుతగులుతున్నారని సర్పంచ్‌లు అన్సార్‌ హుస్సేన్‌, తిరుపతి సభ దృష్టికి తీసుకువచ్చారు. నిబంధనల ప్రకారం వెళ్తున్నామని ఎలాంటి ఇబ్బందులు కలిగించడం లేదంటూ రేంజ్‌ అధికారి దయాకర్‌ సభ దృష్టికి తీసుకు వచ్చారు. అంబగట్టు శివారులో 20 మంది రైతులకు పట్టాలు లేవని సర్పంచ్‌ తిరుపతి కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ రవీందర్‌ తెలిపారు. అడవి పందుల వల్ల రైతులు సాగు చేస్తున్న పంటలు నష్టాల పాలవుతున్నాయని ఈ విషయంలో అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ అన్సార్‌ హుస్సేన్‌ కోరగా నష్ట పోయిన పంటల బాధిత రైతులు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఉన్నతాధికారులకు నివేధిస్తామన్నారు. 


బెజ్జూరు మండల కేంద్రంలో కోతులతో ఇబ్బందులు పడుతున్నామని ఎంపీటీసీ పర్వీన్‌ సుల్తానా అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదని సర్పంచ్‌లు హన్మంతు, లలిత, ఎంపీటీసీ వెంకన్నలు అధికారుల దృష్టికి తీసుకు పోగా డిసెంబర్‌ నాటికి అన్ని గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఏఈ అభిలాష్‌ తెలిపారు. అనంతరం వ్యవసా యాధికారి రాజుల నాయుడు మాట్లాడుతూ ప్రాణహిత తీర ప్రాంతాల్లో 1400 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లగా ఇప్పటికే సర్వేలు నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపించామన్నారు. రేంజ్‌ అధికారి దయాకర్‌ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తు న్నాయని వాటికి ఎలాంటి హాని తలపెట్టవద్దన్నారు. మహా రాష్ట్ర కారిడార్‌ నుంచి పెద్ద పులుల రాక పోకలు కొనసాగి స్తున్నాయని వివిద గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మాంతయ్య, జడ్పీటీసీ పుష్పలత, ఎంపీడీఓ రాజేందర్‌, జడ్పీ ఏఓ తోటాజీ, వైద్యాధికారి డాక్టర్‌ రుషి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ హేమలత, ఏపీఓ రామకృష్ణ, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-10-04T09:55:52+05:30 IST