ముస్తాబవుతున్న వాంకిడి శివాలయం

ABN , First Publish Date - 2020-02-17T11:33:02+05:30 IST

ముస్తాబవుతున్న వాంకిడి శివాలయం

ముస్తాబవుతున్న వాంకిడి శివాలయం

కాకతీయుల కాలంలో ఆలయ నిర్మాణం

పట్టించుకోని దేవాదాయశాఖ

అభివృద్ధి చేయాలని భక్తుల వినతి

రెండు రోజుల పాటు మహాశివరాత్రి జాతర


వాంకిడి, ఫిబ్రవరి 13: కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని చిక్లీ నదీ తీరాన కాకతీయుల కాలంలో నిర్మించిన శివకేశవాలయం చరిత్రకు చిహ్నంగా నిలుస్తోంది. ఈ ఆలయాన్ని కాకతీయులు తమ విజయానికి సూచికగా ఇక్కడ నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. ఆలయంలో శివకేశవులతో పాటు, రేణుకామాత విగ్రహాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణం పరిశీలిస్తే ఆనాటి శిల్పకళ వైభవం ఉట్టిపడుతుంది. పాలకుల నిర్లక్ష్య వైఖరి మూలంగా ఆలయం నిరాదరణకు గురవడంతో శిథిలావస్థకు చేరుకునే సమయంలో గ్రామస్థులు ముందుకు వచ్చి మరమత్తులు చేపట్టారు. ఏటా మహాశివరాత్రి రోజున ఆలయ ప్రాంగణంలోని చికిలీ నదీ తీరాన జాతర, రథోత్సవం నిర్వహిస్తారు.  


ఆలయ చరిత్ర

కాకతీయుల కాలంలో రుద్రమదేవి ఎదుర్కొన్న దండయాత్రలన్నింటిలో మరాఠా ప్రాంతమైన (మహారాష్ట్ర) దేవగిరి యాదవరాజు దండయాత్ర కీలకమైనదని చరిత్రకారులు చెబుతారు. దేవగిరి యాదవరాజు మహాదేవుడు లక్షలాది సైన్యంతో ఓరుగల్లు సామ్రాజ్యంపై దండయాత్ర చేయగా రుద్రమదేవి 10 రోజులకు పైగా భీకర పోరాటం చేసి అతడిని మట్టి కరిపించిందని చెబుతారు. ప్రత్యర్థుల సైన్యాన్ని మరాఠా ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌, ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాంకిడి వరకు తరిమి కొట్టింది. రుద్రమదేవి తమ విజయానికి సూచికగా మరాఠా సరిహద్దున ఛత్తీస్‌గడ్‌ వరకు ఆలయాలను నిర్మించిందని పూర్వీకులు చెబుతారు. విజయానికి సూచికగా రుద్రమదేవి నిర్మించిన ఆలయాల్లో మిగతావి కాలగర్భంగా కలిసిపోగా ప్రస్తుతం వాంకిడి చిక్లీ నదీ తీరంలో నిర్మించిన శివకేశవాలయం నేటికీ భక్తుల ఇలవేల్పుగా నిలిచింది. శివకేశవాలయం ఒకప్పుటి  ఓరుగల్లు ప్రస్తుత హన్మకొండలోని వేయి స్తంభాల గుడిని పోలి ఉంది. వేయిస్తంభాల గుడి ముందు ఉన్న నంది విగ్రహం లాగా వాంకిడి శివాలయం ముందు నంది విగ్రహం ఉంటుంది. ఆలయంలోని స్తంభాలు వేయి స్తంబాల గుడిలో ఉన్న వాటిని పోలి ఉన్నాయి. ఆలయ గోడలపై స్త్రీల నృత్య భంగిమలతో చెక్కిన శిల్పాలు కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. ఆలయానికి మూడు గోపురాలు ఉన్నాయి. 


అభివృద్ధిని పట్టించుకోని పాలకులు

కాకతీయుల కాలం నాటినుంచి భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్న శివకేశవాలయం శిథిలావస్థకు చేరుకుంటున్నా దేవాదాయ శాఖ  పట్టించుకోవడం లేదు. ఆలయం పక్కనే గల చిక్లీ వాగు ప్రవాహానికి ఆలయం ఉత్తర భాగం పూర్తిగా కోతకు గురికాగా గ్రామస్థులు ముందుకు వచ్చి చందాల రూపేణా రూ.40లక్షలు పోగు చేసి మరమ్మతులు చేపట్టారు. నది ప్రవాహానికి కోతకు గురికాకుండా చుట్టూ భారీ ప్రహరీ నిర్మించి ఆలయాన్ని రక్షించుకున్నారు. అతి పురాతనమైన ఈ ఆలంయంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన జిల్లా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని హామీలు ఇచ్చినా ఆచరణకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం శివాలయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.  


శివరాత్రి పర్వదినాన రథోత్సవం

మహాశివరాత్రి పర్వదినాన ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు వాంకిడి నుంచే కాకుండా చుట్టుపక్కల మండలాలైన కెరమెరి, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌తో పాటు మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి శివకేశవులను దర్శించుకుంటారు. మహాశివరాత్రి పర్వదినాన సాయంత్రం ఐదు గంటలకు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి చిక్లీ నది తీరంలో రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ సమీపంలోని చిక్లీ నదీ తీరాన రెండు రోజుల పాటు జాతర జరుగుతుంది.  

Updated Date - 2020-02-17T11:33:02+05:30 IST