ఖాళీ స్థలాల్లో చెత్తకుప్పలు

ABN , First Publish Date - 2020-09-14T10:23:18+05:30 IST

గ్రేడ్‌-1 మున్సిపాలిటీ అయిన మంచిర్యాలలో దశాబ్దాల కాలంగా డంప్‌ యార్డు సమస్యకు పరిష్కారం లభించడం లేదు. జిల్లా కేంద్రంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నా డంప్‌యార్డు ఏర్పాటు విషయమై

ఖాళీ స్థలాల్లో చెత్తకుప్పలు

పేరుకే డీఆర్సీ సెంటర్‌...!

కాలనీల్లోనే దర్శనమిస్తున్న చెత్త  

నిరుపయోగంగా మారిన డంప్‌ యార్డు

మరో చోటికి తరలించాలంటున్న కాలనీవాసులు


మంచిర్యాల, సెప్టెంబరు 13: గ్రేడ్‌-1 మున్సిపాలిటీ అయిన మంచిర్యాలలో దశాబ్దాల కాలంగా డంప్‌ యార్డు సమస్యకు పరిష్కారం లభించడం లేదు. జిల్లా కేంద్రంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నా డంప్‌యార్డు ఏర్పాటు విషయమై అడుగు ముందుకు పడటం లేదు. అధికారులు అనేక సార్లు స్థలాలను పరిశీలించినా అది కార్యరూపం దాల్చడం లేదు. ఫలితంగా మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బంది ఇండ్ల నుంచి సేకరించిన వ్యర్థ పదార్థాలు, చెత్తను రోడ్ల వెంట, వీధులు, వాగులు, చెరువుల్లో పారవేస్తుండగా దుర్వాసన కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మున్సిపల్‌ అధికారులు గతంలో అండాళమ్మ కాలనీ సమీపంలోని క్వారీ గుట్ట వద్ద తాత్కాలిక డంప్‌ యార్డు ఏర్పాటు చేశారు. అక్కడ వేసిన చెత్తను మున్సిపల్‌ సిబ్బంది కాల్చడం వల్ల నల్లని, దట్టమైన పొగలు వ్యాపించడంతో అండాళమ్మ కాలనీ వాసులు పలు మార్లు ఆందోళనకు దిగారు. పొగ కారణంగా తాము  అనారోగ్యాలకు గురవుతున్నామని పేర్కొంటూ మున్సిపల్‌ వాహనాలను అడ్డగించారు. 


డంప్‌ యార్డుగా డీఆర్సీ సెంటర్‌...

ప్రజలు ఆందోళనకు దిగడంతో మున్సిపల్‌ అధికా రులు అండాళమ్మ కాలనీ సమీపంలోని పొడి వనరుల సేకరణ కేంద్రం (డ్రై రిసోర్స్‌ కలెక్షన్‌ సెంటర్‌)ను తాత్కాలిక డంప్‌ యార్డుగా ఉపయోగిస్తున్నారు. పట్టణంలో సేకరించిన చెత్తను సిబ్బంది డీఆర్సీకి తరలిస్తున్నారు. సెంటర్‌ ఆవరణ సరిపోకపోవడంతో సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో వేస్తున్నారు. ఇదిలా ఉండగా డీఆర్సీ సెంటర్‌ ఆవరణ చెత్తతో నిండిపోగా రెండు రోజులుగా మున్సిపల్‌ సిబ్బంది దాన్ని తొలగిం చే పనిలో నిమగ్నమయ్యారు. నెలల తరబడి పేరుకు పోయిన చెత్తను ఎక్స్‌కావేటర్‌ సహాయంతో తొలగిస్తూ ఖాళీ స్థలంలో వేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతోంది. డీఆర్సీ సెంటర్‌ లో ఉన్న చెత్తను కాలనీ సమీపంలో వేయవద్దని, మరోచోటుకి తరలించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అధికారులు స్పందించని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనలకు పూనుకునేందుకు సిద్ధపడుతున్నారు. 


నిలిచిపోయిన రీ సైక్లింగ్‌...

డీఆర్సీ సెంటర్‌ ఆవరణ మొత్తం చెత్తతో నిండిపోవ డంతో రీసైక్లింగ్‌ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివే శారు. పారిశుధ్య సిబ్బంది ఇండ్ల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను డీఆర్సీ సెంటర్‌లో ఎండబెట్టి రీ సైక్లింగ్‌ పద్ధతుల ద్వారా వేరు చేయాల్సి ఉంటుంది. అలా వేరు చేసిన చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసి మొక్కల పెంపకానికి ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ కోసం ఉద్దేశించిన డీఆర్సీ సెంటర్‌ ప్రస్తు తం తాత్కాలిక డంప్‌ యార్డుగా మారింది. డీఆర్సీ సెంటర్‌ ఆవరణంతా చెత్తతో నిండిపోవడంతో ఎక్స్‌కావేటర్‌ సహాయంతో తొలగించి బహిరంగ ప్రదేశంలో వేస్తుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


దుర్వాసన వస్తోంది..యేముల వెంకటమ్మ, అండాళమ్మ కాలనీ

మున్సిపల్‌ చెత్త ఇండ్ల సమీపంలో వేస్తుండటంతో తీవ్రమైన దుర్వాసన వస్తోంది. ఇంటిల్లిపాది అనారో గ్యాల బారిన పడుతున్నాం. ఎంత చెప్పినా అధికారు లు పట్టించుకుంట లేరు. వర్షం పడినప్పుడు వాసనతో అన్నం కూడా తినబుద్ది కావడం లేదు. ఊరి చెత్తంతా ఇక్కన్నే వేస్తున్నారు. 


అధికారులు స్పందించాలి....ఎస్కే టబ్బు, అండాళమ్మ కాలనీ

మున్సిపల్‌ చెత్తను కాలనీ సమీపంలో వేయవద్దని కలెక్టర్‌తోపాటు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదు. దుర్వాసన భరించలేక గతంలో మున్సి పల్‌ చెత్త వాహనాలను అడ్డుకున్నాం. అధికారులు వచ్చి డంప్‌ యార్డులో వేస్తామన్నారు. మళ్లీ ఇప్పుడు బయటనే పడవేస్తున్నారు. డంప్‌ యార్డును ఇక్కడ నుంచి తొలగించని పక్షంలో ఆందోళన చేస్తాం.


పరిశీలిస్తున్నాం....మున్సిపల్‌ కమిషనర్‌ స్వరూపారాణి

డంప్‌ యార్డు కోసం స్థల పరిశీలన జరుపుతు న్నాం. స్థలం ఎంపిక చేసి చెత్తను అక్కడికి తరలి స్తాం. నస్పూర్‌, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల డంప్‌ యార్డులు వాడుకొనేందుకు కలెక్టర్‌ అనుమతి ఇచ్చారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నది వాస్త వమే. త్వరలోనే చెత్తను మరో చోట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. 

Updated Date - 2020-09-14T10:23:18+05:30 IST