ఆవుపై పెద్దపులి దాడి

ABN , First Publish Date - 2020-11-19T05:52:56+05:30 IST

బెజ్జూరు మండలం గబ్బాయి గ్రామ సమీపంలోని వాగు వద్ద బుధవారం పెద్దపులి ఆవుపై దాడి చేసింది.

ఆవుపై పెద్దపులి దాడి
బెజ్జూరు మండలం హేటిగూడలో రైతుల నుంచి పెద్దపులి వివరాలు తెలుసుకుంటున్న అటవీ శాఖ అధికారులు

-బెజ్జూరు మండలంలో సంచారం 

బెజ్జూరు, నవంబరు18: బెజ్జూరు మండలం గబ్బాయి గ్రామ సమీపంలోని వాగు వద్ద బుధవారం పెద్దపులి  ఆవుపై దాడి చేసింది. మొదట పెద్దపులి బెజ్జూరు మండలం హేటిగూడ గ్రామ సమీపంలోని ప్రధాన రోడ్డుకు పక్కన గల పత్తి చేనులో కనిపించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. పెంచికలపేట మండలం నందిగాం గ్రామానికి చెందిన ఆలం బానయ్య, సిడాం కేశవయ్య ద్విచక్ర వాహనంపై బెజ్జూరుకు వస్తుండగా హేటిగూడ వంతెన వద్ద  పంట చేనులో పెద్ద పులి కనిపించింది. దీంతో బానయ్య ద్విచక్ర వాహనాన్ని వెనక్కి మళ్లించగా భయంతో సిడాం కేశవయ్య కిందకు దిగాడు. అనంతరం కేశవయ్య ప్రాణభయంతో సమీపంలోని చెట్టుపైకి ఎక్కాడు. కొద్దిసేపటి తర్వాత ఈ మార్గంలో మరికొన్ని ద్విచక్ర వాహనాలు రావడంతో పెద్దపులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం బెజ్జూరు మండలం గబ్బాయి సమీపంలోని వాగు వద్ద ఆవుపై పులి దాడి చేసింది. ఈ విషయాన్ని కొందరు రైతులు గ్రామస్థులకు తెలపడంతో వారు పెద్దగా శబ్దాలు చేస్తూ ఆ ప్రాంతానికి రావడంతో పులి అక్కడి నుంచి పారిపోయింది.  

భయం గుప్పిట్లో గ్రామాలు

బెజ్జూరు మండలం హేటిగూడ వద్ద పెద్దపులి కనిపించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల దహెగాం మండలం దిగిడ గ్రామంలో యువకుడిపై పెద్ద పులి దాడి చేసి హతమార్చడం, తాజాగా హేటిగూడ వద్ద పులి బాటసార్లకు కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు. కాగా బెజ్జూరు రేంజ్‌ అధికారి దయాకర్‌, డిప్యూటీ రేంజ్‌ అధికారి శీలానంద్‌, ఎఫ్‌బీఓలు సంఘదీప్‌, అనితలు సంఘటన స్థలానికి చేరుకుని రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

ప్రాణభయంతో చెట్టెక్కా

-కేశవయ్య, నందిగాం

పని నిమిత్తం బెజ్జూరు మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా హేటిగూడ సమీపంలోని వంతెన వద్ద పెద్దపులి కనిపించింది. దీంతో పరుగెత్తుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కా. కొద్దిసేపటికి పలువురు ప్రయాణికులు ద్విచక్ర వాహనాలపై రావడంతో అక్కడి నుంచి పులి వెళ్లిపోయింది. దీంతో వారితో పాటు బెజ్జూరు మండల కేంద్రానికి చేరుకున్నా. 

Updated Date - 2020-11-19T05:52:56+05:30 IST