పులి సంచారంపై వదంతులు సృష్టిస్తే చర్యలు

ABN , First Publish Date - 2020-11-22T04:29:32+05:30 IST

కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతంలో పులి సంచారంపై వదంతులు సృష్టించి ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో విజయ్‌ కుమార్‌ అన్నారు.

పులి సంచారంపై వదంతులు సృష్టిస్తే చర్యలు
మాట్లాడుతున్నమాట్లాడుతున్న కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో విజయ్‌కుమార్‌

కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో విజయ్‌ కుమార్‌ 

కాగజ్‌నగర్‌ టౌన్‌, నవంబరు21: కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతంలో పులి సంచారంపై వదంతులు సృష్టించి ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో విజయ్‌ కుమార్‌ అన్నారు. శనివారం కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొద్ది రోజులుగా డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో పులి సంచారం ఉన్నట్లు ప్రతీ రోజు సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దన్నారు. డివిజన్‌ పరిఽధిలో ప్రస్తుతం 7 పులులున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. కానీ అవి మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాణహిత, పెద్దవాగు నదులు దాటి ప్రయాణం చేస్తున్నాయన్నారు. పులుల సంచారం ఉన్నప్పటికీ అవి అటవీ ప్రాంతంలోనే ఉంటాయి తప్ప గ్రామాల్లోకి రావన్నారు. రెండు రోజుల క్రితం బెజ్జూరు మండలంలోని అంబగట్ట ప్రాంతంలో పులి కనిపించిందని కొంత మంది పుకార్లు చేశారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కొంత మంది వైరల్‌ చేశారన్నారు. ఈ వీడియో మహారాష్ట్రలోని యావత్‌మల్‌ జిల్లా పాండ్రకావడా తహశీల్‌ పరిధిలోని అంజన్‌వాడీ గ్రామ అటవీ ప్రాంతంలో గత 3 నెలల క్రితం తీసిందన్నారు. నెల రోజులుగా ఈ వీడియో వైరల్‌ అవుతూ ఉండగా, కొంత మంది యువకులు స్థానికంగా పులి వెంబడించినట్లు ప్రచారం చేయడం జరిగిందన్నారు. గత కొన్ని రోజులుగా పులి సంచారంపై భయాందోళనకు గురిచేసే వదంతులు, సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారం చేసినట్లయితే కేసులు నమోదు చేస్తామన్నారు. అలాగే దహెగాం మండలంలోని దిగడ అటవీ ప్రాంతంలో దాడి చేసిన పులిని గుర్తించేందుకు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ పులికి సంబంధించి ఇప్పటికరకు ఏ కెమెరాల్లో కానీ పగ్‌ మార్క్‌ కానీ, ఆనవాల్లు కానీ లభ్యం కాలేదన్నారు. మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్లిపోయి ఉంటుందని భావిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ సమావేశంలో పెంచికలపేట, కర్జెల్లి రేంజి అధికారులు వేణుగోపాల్‌, రాజేందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-22T04:29:32+05:30 IST