హరితహారానికి సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2020-06-25T10:38:26+05:30 IST

జిల్లాలో ఆరో విడత హరితహారంలో భాగంగా గురు వారం నుంచి మొక్కలు నాటేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

హరితహారానికి సర్వం సిద్ధం

నేటి నుంచి ఆరో విడత మొక్కలు నాటే కార్యక్రమం 

జిల్లాలో లక్ష్యం 52.12 లక్షలు

మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు


(ఆంధ్రజ్యోతి ఆసిఫాబాద్‌)

జిల్లాలో ఆరో విడత హరితహారంలో భాగంగా గురు వారం నుంచి మొక్కలు నాటేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ దఫా గ్రామ ప్రణాళికల ద్వారా నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.   ఈసారి ఉపయుక్తమైన వృక్ష జాతి మొక్కలని నాటాలని నిర్ణయించారు. ఇందుకు తగ్గట్టుగానే గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలలో మొక్కలను పెంచారు. గురువారం నుంచి గ్రామాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలతో పాటు అటవీ ప్రాంతంలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటనున్నారు. హరితహారంలో భాగంగా ఐదేళ్లలో జిల్లాలోని 15 మండలాల్లో ఏటా కోటి మొక్కల చొప్పున నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇందులో 60-70 శాతం లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందన్న ఆరోపణలున్నాయి. వాస్తవ పరిస్ధితులకు విరుద్ధంగా టార్గెట్లు విదించడం వల్లే ఆశించిన లక్ష్యం నెరవేరలేదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా జిల్లాలోని 335 పంచాయతీలలో గ్రామానికొకటి చొప్పున 335 నర్సరీలలో మొక్కలను పెంచారు. 


ఇదీ ఈ ఏడాది లక్ష్యం

జిల్లాలో ఈ ఏడాది హరితహారంలో భాగంగా మొత్తం  52.12 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలోని 15 మండలాలో డీఆర్‌డీఏ ద్వారా గ్రామానికొకటి చొప్పున 335 నర్సరీలను ఏర్పాటు చేయగా ఇందులో 47 లక్షలు, అటవీ శాఖకు చెందిన 16 నర్సరీల్లో 18 లక్షల అటవీ జాతి మొక్కలను పెంచుతున్నారు. సగటున ఒక్కో నర్సరీలో 20-28 వేల మొక్కలను పెంచుతున్నారు. నర్సరీలలో పెంచిన మొత్తం 65 లక్షల మొక్కల్లో కనీసం 52.12లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు.


శాఖల వారీగా టార్గెట్‌

హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం శాఖల వారీగా లక్ష్యాలను నిర్ణయించింది. జిల్లాకు చెందిన మొత్తం 48 శాఖలకు సంబంధించి 52 లక్షల 12 వేల 800 మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందులో అటవీ శాఖ ద్వారా 10 లక్షలు, ఆర్‌అండ్‌బీ 5 వేలు, ఆర్టీసీ 5వేలు, పంచాయతీరాజ్‌ 5 వేలు, ఎంపీడీఓలు 34లక్షలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ 2500, నీటి పారుదల శాఖ 20 వేలు, వ్యవసాయ శాఖ 50 వేలు, మార్కెటింగ్‌ 1000,  హార్టికల్చర్‌/సెరికల్చర్‌ 20 వేలు, సహకార శాఖ 3000, రెవెన్యూ 10 వేలు, అబ్కారి 50 వేలు, దేవాదయ శాఖ 1000 మొక్కలు, మున్సిపాలిటీ 3 లక్ష ల 74 వేల 300 మొక్కలు, పోలీస్‌ 10 వేలు, విద్యా శాఖ 5 వేలు, పశు సంవర్ధక శాఖ 5 వేలు మొక్కలు నాటేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. అదేవిధంగా ఫిషరీస్‌ 5 వేలు, పరిశ్రమల శాఖ 5 వేలు, మైన్స్‌, జియోలజి 1500, వైద్య ఆరోగ్య శాఖ 5 వేలు, విద్యుత్‌ 4 వేలు 300, సింగరేణి 2 లక్షలు, మహిళా శిశు సంక్షేమం 5 వేలు, షెడ్యూల్డ్‌ కులాల విభాగం 3 వేలు, బీసీ సంక్షేమం 2 వేలు, గిరిజన సంక్షేమ 5 వేలు, మైనారిటీ సంక్షేమ శాఖ 2 వేలు, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ 2 వేలు, సివిల్‌ సప్లై 1000, కార్మిక శాఖ 100, ఇతరులు 5 వేల100 మొక్కల చొప్పున నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. 


మండలాల వారీగా అందుబాటులో ఉన్న మొక్కలు

ఆసిఆబాద్‌ మండలంలో 27 నర్సరీలు 3.80 లక్షలు, రెబ్బెనలో 24 నర్సరీలు 3.50 లక్షలు, తిర్యాణిలో 29 నర్సరీలు 4.05 లక్షలు, వాంకిడిలో 28 నర్సరీలు 3.15 లక్షలు, జైనూరులో 26 నర్సరీలు 2.01 లక్షలు, కెరమెరి 31 నర్సరీలు 3.74 లక్షల మొక్కలు అదనంగా అటవీ శాఖ లక్ష మొక్కలు, కాగజ్‌నగర్‌లో 28 నర్సరీలు 4 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. సిర్పూర్‌(టి)లో 16 నర్సరీలు 4.5 లక్షలు, కౌటాలలో 20 నర్సరీలు  2.80 లక్షలు, చింతల మానేపల్లిలో 19 నర్సరీలు 2 లక్షలు, పెంచికలపేటలో 12 నర్సరీలు 1.5 లక్షలు, బెజ్జూరులో 22 నర్సరీలు 3.5  లక్షలు, దహెగాంలో 24 నర్సరీలు 3.42 లక్షలు, సిర్పూర్‌(యూ)లో 4 లక్షలు, లింగాపూర్‌లో 14 నర్సరీలు 2 లక్షలు, మొత్తం 65 లక్షల మొక్కలు పెంచుతున్నారు. 


సంరక్షణే కీలకం

కోట్లాది రూపాయలు వెచ్చించి పెద్ద ఎత్తున చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో నాటిన  మొక్కలను సంరక్షించడమే కీలకమని చెప్పాలి. తూతూమంత్రంగా మొక్కలు నాటి వదిలేస్తుండడం వల్ల రెండు నెలల లోపే మొక్కలు అదృశ్యమైపోతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా ఈసారి మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పశువులు, మేకల వంటి జంతువుల నుంచి మొక్కలను కాపాడేందుకు కంచె ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు ఇటీవల మొక్కల సంరక్షణకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రతినిధులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే చాలా గ్రామాలు పంచాయతీల అవసరాల కోసం కొనుగోలు చేసిన ట్రాక్టర్లకు అనుబంధంగా నీటి ట్యాంకర్లను కూడా సమకూర్చుకున్నాయని చెబుతున్నారు. అలాగే ఇటీవల పొరుగున ఉన్న మహారాష్ట్రలో మిడతల దండు విధ్వంసం కారణంగా చెట్లు, మొక్కలు దెబ్బతిన్నట్లు గుర్తించడంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 

Updated Date - 2020-06-25T10:38:26+05:30 IST