కథ కంచికేనా ?

ABN , First Publish Date - 2020-11-27T05:29:29+05:30 IST

జిల్లాలో మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణ పరిస్థితి సందిగ్ధంగా మారింది. నిర్మల్‌ పట్టణంలోని ధర్మసాగర్‌ చెరువు అలాగే భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌ రిజర్వాయర్‌పై దాదాపు రూ.6 కోట్లను ఖర్చు చేసి రెండు మినీ ట్యాంక్‌బండ్‌లను నిర్మించాలని తలపెట్టారు.

కథ కంచికేనా ?
నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణ పనుల దృశ్యాలు

మినీ ట్యాంక్‌బండ్‌ పనులు పూర్తి  కాకుండానే మున్సిపాలిటీలకు  అప్పగించిన ఇరిగేషన్‌శాఖ

గందరగోళంగా ధర్మసాగర్‌ 

అయోమయంగా గడ్డెన్న..గట్టు

జిల్లాలో రూ. 6కోట్లు ఖర్చు చేసినా  కాగితాలకే పరిమితవుతున్న పర్యాటకం 

నిర్మల్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణ పరిస్థితి సందిగ్ధంగా మారింది. నిర్మల్‌ పట్టణంలోని ధర్మసాగర్‌ చెరువు అలాగే భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌ రిజర్వాయర్‌పై దాదాపు రూ.6 కోట్లను ఖర్చు చేసి రెండు మినీ ట్యాంక్‌బండ్‌లను నిర్మించాలని తలపెట్టారు. అయితే మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్దరణతో పాటు ఈ మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణాలను నిర్మించేందుకు దానికి అను గుణంగా అంచనాలను రూపొందించారు. మిషన్‌ కాకతీయ కింద చెరువుల పనులు పూర్తయినప్పటికీ ఈ రెండు ట్యాంక్‌బండ్‌ల నిర్మాణ పనులు మాత్రం గందరగోళంగా తయారయ్యాయి. దీని కారణంగా ప్రస్తుతం ఈ మినీట్యాంక్‌ బండ్‌ల భవితవ్యం సందిగ్దతకు దారి తీస్తోంది. నిర్మల్‌లోని ధర్మాసాగర్‌ మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణ, అభివృద్ధి పనుల కోసం రూ. 4.20 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు ఇరిగేషన్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే భైంసాలోని గడ్డెన్నవాగు రిజర్వాయర్‌లు మినీట్యాంక్‌ బండ్‌ నిర్మాణం కోసం దాదాపు రూ. 2 కోట్లను వ్యయం చేసినట్లు లెక్కలు చూపుతున్న ఇరిగేషన్‌ అధికారులు ఇటీవలే ఈ రెండు మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్వహణ బాధ్యతలను ఆయా మున్సిపాలిటీలకు అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇప్పటి వరకు ఈ రెండు మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణ పనులన్నీ అస్తవ్యస్థంగా ఉన్న క్రమంలోనే వాటిని మున్సిపాలిటీలకు అప్పగించడం వెనక ఉన్న అసలు మతలబు అంతుపట్టడం లేదంటున్నారు. ఇరిగేషన్‌ అధికారులు మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణాలు పూర్తి కాకుండానే మున్సిపాలిటీలకు అప్పగించడం పట్ల అంత ర్యమేంటన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కాగా ఇప్పటికీ నిర్మల్‌లోని మినీ ట్యాంక్‌బండ్‌ పనులు పూర్తికాక ఆ చెరువు ప్రాంతమంతా అందవిహీనంగా కనబడుతున్నట్లు చెబుతున్నారు. చెరువు మొత్తం గుర్రపుడెక్కతో నిండిపోయింది. అలాగే చెరువుకట్ట కూడా ఆఽధునీకరణకు నోచుకోలేదు. భైంసాలోని గడ్డెన్నవాగు రిజర్వాయర్‌ మినీ ట్యాంక్‌బండ్‌ పరిస్థితి కూడా ఇదే తీరులో ఉండడం గమనార్హం. ఇలా మిషన్‌ కాకతీయ కింద చేపట్టిన రెండు మినీ ట్యాంక్‌బండ్‌లు పూర్తిస్థాయిలో ఆధునీకరణకు నోచుకోకుండానే ఇరిగేషన్‌ శాఖ నుంచి మున్సిపాలిటీకి బదలాయింపు జరగడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. నిర్మల్‌లోని మినీ ట్యాంక్‌బండ్‌కు దాదాపు రూ.4.50కోట్లు, భైంసాలోని మినీ ట్యాంక్‌బండ్‌కు దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్న లెక్కలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి పట్టణ ప్రాంతాల్లో స్థానికులు ఆహ్లాదకరమైన వాతావరణం అందించే లక్ష్యంతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన మినీ ట్యాంక్‌బండ్‌లు యేళ్లు గడుస్తున్నప్పటికీ సందిగ్దతకు గురవుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మున్సిపాలిటీలకు బదలాయింపు వెనక అంతర్యమేంటీ ?

కాగా నిర్మల్‌ , భైంసా పట్టణాల్లోని మిని ట్యాంక్‌బండ్‌ల నిర్మాణ పనులు పూర్తిస్తాయిలో ముగియకుండానే వాటి నిర్వహణ భాధ్యతలపై ఇరిగేషన్‌ చేతులేత్తేయడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. దాదాపు రూ. 6 కోట్లు వ్యయం చేసి నిర్మించిన ఈ  రెండు మినీ ట్యాంక్‌బండ్‌లను ఇరిగేషన్‌శాఖ పూర్తి చేసి అన్ని అభ్యంతరాలను అధిగమించిన తరువాతనే నిర్వహణ కోసం మున్సిపాలిటీలకు అప్పజెప్పాలి. అయితే ఇరిగేషన్‌ అధికారులు ఇప్పటి వరకు పనుల్లో తీవ్ర జాప్యం చేసి ఆ పనులు పూర్తి కాకుండానే మున్సిపాలిటీలకు అప్పగించడం వెనక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ రెండు ట్యాంక్‌బండ్‌లను మున్సిపాలిటీలకు అప్పగించడంతో ఇక మిగిలిపోయిన పనులు ఏ శాఖ చేపట్టనుందోనన్న అంశం సందిగ్ధతకు దారి తీస్తోంది.  ఇంత భారీ మొత్తంలో నిధులను వ్యయం చేసినప్పటికి వీటి పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ధర్మాసాగర్‌ పరిస్థితి మరీ ఘోరంగా మారింది. చెరువులో చుక్క నీరు కనిపించకుండా మొత్తం గుర్రపు డెక్క నిండిపోయింది. దీంతో ఆ చెరువు ప్రస్తుతం మైదానంలో కనిపిస్తోంది. అలాగే చెరువుకట్టపై ప్రైవేటు వాహనాలను పార్కింగ్‌ చేస్తుండడంతో అక్కడి పరిస్థితి గందరగోళంగా మారింది.  మొత్తానికి కోట్ల రూపాయలు వ్యయం చేసిన మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణం పనులు ఇప్పటి వరకు పూర్తికాకపోవడం పట్ల నిర్మల్‌, భైంసా పట్టణాల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

పనులు పూర్తి చేసి మున్సిపాలిటీకు అప్పగించాం

ఈ విషయమై ఇరిగేషన్‌ శాఖ ఈఈ మల్లికార్జున్‌ రావును సంప్రదించగా జిల్లాలో నిర్మల్‌ , భైంసాలో మిని ట్యాంక్‌బండ్‌ల నిర్మాణ పనులను పూర్తి చేసి మున్సిపాలిటీలకు అప్పగించామన్నారు.  

Updated Date - 2020-11-27T05:29:29+05:30 IST