ఒత్తిడిని జయించాలి

ABN , First Publish Date - 2020-03-18T11:36:53+05:30 IST

పదో తరగతి వార్షిక పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. విద్యార్ధులు వార్షిక పరీక్షపై టెన్షన్‌ పడకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలి. మొదటి సారి బోర్డు పరీక్షలకు హాజరు కానున్న నేపథ్యంలో విద్యార్ధుల్లో ఒకింత ఆందోళన ఉండడం సహజమే.

ఒత్తిడిని జయించాలి

రేపటి నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షలు...

గంట ముందే  పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి...

ఒకరోజు ముందే పరీక్షా కేంద్రాన్ని చూసి రావడం మంచింది...

రవాణా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి...

ఓఎంఆర్‌ షీట్‌ను నింపడంలో విద్యార్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి..

విద్యార్ధులు ఈ సూచనలు పాటించండి...

 

దండేపల్లి/వాంకిడి, మార్చి 17: పదో తరగతి వార్షిక పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. విద్యార్ధులు వార్షిక పరీక్షపై టెన్షన్‌ పడకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలి. మొదటి సారి బోర్డు పరీక్షలకు హాజరు కానున్న నేపథ్యంలో విద్యార్ధుల్లో ఒకింత ఆందోళన ఉండడం సహజమే. పరీక్ష అనగానే ఏదో తెలియని భయం. బోర్డు పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఈ సూచనలు పాటించాలి.


పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి..

ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. హిందీ పరీక్షకు మాత్రం అదనంగా 30 నిమిషాల సమయాన్ని కేటాయించారు. 8:45 గంటల నుంచి విద్యార్ధులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 9:35 తర్వాత కేంద్రంలోకి అనుమతించారు.  గంట ముందే విద్యార్ధులు పరీక్షా కేంద్రానికి చేరుకోవడం మంచింది..


పరీక్ష కేంద్రంలో ఇవి నిషేధం..

పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధి తప్పని సరిగా బ్లూ లేదా బాల్‌ పాయింట్‌ పెన్‌  తీసకెళ్లాలి. అదనంగా మరో పెన్ను తీసుకువెళ్లడం మంచిది. సెల్‌ఫోన్‌, కాలిక్యూలేటర్‌ సహా ఏ ఇతర ఎలకా్ట్రనిక్‌ వస్తువులను పరీక్ష కేంద్రంలోని అనుమతించారు. మాస్‌ కాపియింగ్‌కు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు.


ఓఎంఆర్‌ షీట్‌ను ఇలా నింపాలి...

పరీక్ష సమయం కాగానే ఓఎంఆర్‌ షీట్‌, 3 అంకెలతో కూడిన ప్రధాన జవాబు పత్రాన్ని ఇన్విజిలెటర్‌ అందజేస్తారు. ఓఎంఆర్‌ షీట్‌లోని వివరాలు సరి చూసుకోవాలి. ఏదైనా తప్పులు ఉంటే ఇన్విజిలెటర్‌ దృష్టికి తీసుకెళ్లాలి. పేరు, మీడియం, ఫొటో సక్రమంగా  ఉన్నాయా లేదా పరిశీలించాలి. ప్రధాన జవాబు పత్రంలో పైభాగంలో సూచించిన 3 అంకెల నంబరును ఓఎంఆర్‌ షీట్‌లో రాయాలి. ఇన్విజిలేటర్‌ సూచనలకు అనుగుణంగా పేపరు కోడ్‌ను ఓఎంఆర్‌ షీట్‌లో నమోదు చేయాలి. అదే షీట్‌లో విద్యార్ధి సంతకం  చేయాలి. అందులోనే ఇన్విజిలేటర్‌ సంతకం తీసుకోవాలి. పరీక్ష  రాయడం పూర్తయ్యాక తాను తీసుకున్న అదనపు సమాధానం పత్రాలను లెక్కించాలి. ఓఎంఆర్‌ షీట్‌లో సూచించిన గడుల్లో (పార్ట్‌ 1, పార్ట్‌ 2  రెండు చోట్ల ) ఆ నంబర్‌ వేయాలి. 


సమాధానాలు రాసేటప్పుడు..

ప్రశ్నపత్రం పేపరును క్షుణ్ణంగా చదివి బాగా రాయగలిగే  ప్రశ్నలను నోట్‌  చేసుకోవాలి. వాటికి సమాధానాలు రాసిన తర్వాత మిగతా వాటిని పూర్తి చేయాలి. సాధ్యమైనంత వరకు అన్ని ప్రశ్నలకు జవాబు రాసేందుకు ప్రయత్నించాలి.  రాత గుండ్రంగా చక్కగా అందంగా ఉండేలా చూసుకోవాలి. 


హాల్‌ టికెట్‌ సరి చూసుకోవాలి..

విద్యార్థులు హాల్‌ టికెట్‌ను సరి చూసుకోవాలి. పరీక్ష కేంద్రం ఎక్కడుంది? ఇంటి నుంచి అక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందనే విషయాన్ని  పరిశీలించుకోవాలి. దానికి అనుగుణంగా రవాణా సాధనాలను ముందుగానే  ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల పరీక్షల రోజున టెన్షన్‌ ఉండదు. పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వెళ్తే  ఆందోళనకు గురయ్యే ప్రమాదముంది. పరీక్షా రాయడంపై ప్రభావం చూపుతుంది. సమయానికి బస్సులు ,ఆటోలు దొరక్కపోతే ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది.  పరీక్షకు వెళ్లే  రోజుల్లో ఆహారం మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా నూనే పదార్ధాలకు దూరంగా ఉండాలి.


విద్యార్థులు చదవడానికి కొన్ని చిట్కాలు...:


టీవీలలో సినిమాలు, సీరియల్స్‌, గేమ్‌ షోలను చూడకుండా నియంత్రించాలి.


పిల్లలు ఏ సబ్జెక్టు కష్టమని భావిస్తారో తొలుత దాన్నే చదివించాలి. 


పరీక్షల టైంటేబుల్‌ ఆధారంగా సబ్జెక్టులకు సమయం కేటాయించాలి. 


గణితం చేయడం వచ్చని నిర్లక్ష్యం చేయకూడదు. రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌ చేయాలి. అలాగే సైన్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో ధియరీలను ప్రాక్టీస్‌ చేయాలి. 


చదివించే సమయంలో పిల్లల్ని ఇంటరిగా వదిలేయకుండా అమ్మ, నాన్న ఎవరో ఒకరు వారితో పాటు కూర్చోవాలి.  


ఇంట్లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉన్నా తీసేయాలి. చదువుకు అవసరమైన అంశాలకు తప్ప ఇతరాలకు కంప్యూటర్‌ వినియోగంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్మార్ట్‌ ఫోన్లను విద్యార్థుల చేతికి ఇవ్వకూడదు. 


రాత్రి పది గంటల వరకు చదివస్తే సరిపోతుంది. అంతకు మించి మెలకువగా ఉంచితే పిల్లలు నిద్రలేమితో బాధపడతారు. 


రోజుకు కనీసం ఆరు నుంచి ఏదు గంటలు నిద్ర పోయేలా చూడాలి. 


ఉదయం 20 నిమిషాలు మెడిటేషన్‌ లేదా యోగా చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. 


సాయంత్రం ఒక గంట సేపు వారిని ఫ్రీగా వదిలేయాలి. వారికి నచ్చినట్లు ఆ సమయం గడుపుకొనే అవకాశం ఇవ్వాలి.


ప్రణాళికతో పరీక్షలకు హాజరుకావాలి: మనుకుమార్‌, ఎంఈఓ 

విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివి పరీక్షలకు హాజరు అయితే ఉత్తమ ఫలితాలు సాధించడానికి వీలవుతుంది. పరీక్షలు సమీపించడంతో సమయాన్ని వృథా చేయకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలి. కఠినమైన సబ్జెక్టులను నివృత్తి చేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదువుకొని సమాధానాలు రాసి విజయాన్ని సాధించాలి. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో హాజరుకావాలి. 

Updated Date - 2020-03-18T11:36:53+05:30 IST