కరోనాపై టెక్నికల్‌ ఆపరేషన్‌

ABN , First Publish Date - 2020-04-21T09:14:40+05:30 IST

గత నెల రోజుల నుంచి కరోనా వైరస్‌ మహమ్మారి ఇటు జనాన్ని అటు యంత్రాంగాన్ని కంటికి కనుకు లేకుండా

కరోనాపై టెక్నికల్‌ ఆపరేషన్‌

కొత్తయాప్‌లతో నిర్మల్‌ పోలీసుల వినూత్నవ్యూహం 

జిల్లా యంత్రాంగం కృషిపై సర్కారుకితాబు 

పకడ్బందీ లాక్‌డౌన్‌  అమలుకు సోషల్‌ మీడియా ద్వారా విసృత ప్రచారం 

తప్పుడు ప్రచారంపై స్పెషల్‌ ఫోకస్‌ 

సైబర్‌ల్యాబ్‌ ద్వారా విస్తృతనిఘా 

ఇప్పటికే ఏడుగురిపై తప్పుడు ప్రచారం కేసులు 

అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వందలాది మందిపైనా

బారీకేడ్లతో గల్లీలన్నీ లాక్‌ 

పకడ్బందీ లాక్‌డౌన్‌తో కరోనా కాంటాక్ట్‌ కేసులకు చెక్‌ 


నిర్మల్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి)  : గత నెల రోజుల నుంచి కరోనా వైరస్‌ మహమ్మారి ఇటు జనాన్ని అటు యంత్రాంగాన్ని కంటికి కనుకు లేకుండా చేస్తున్న తరుణంలో పోలీసులు నిర్వహిస్తున్న పాత్రపై సర్వ త్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నిర్మల్‌ జిల్లా పోలీసులు తమకున్న సాంకేతిక పరిజ్ఞానంతో సాగిస్తున్న టెక్నికల్‌ ఆపరేషన్‌ రాష్ట్రస్థాయిలో మన్ననలు అందుకుంటోంది. కరోనావైరస్‌ వ్యాప్తి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు సోషల్‌డిస్టెన్స్‌ పాటించాలని అలాగే లాక్‌డౌన్‌కు అందరూ సహకరించేందు కోసం ఇంటి నుంచి ఎవరు కూడా బయటకు రావద్దంటూ పోలీసులు పెద్దఎత్తున ప్రచా రం నిర్వహిస్తున్నారు.


అలాగే కీలకమైన సోషల్‌ మీడియాను పోలీసులు ప్రధాన అస్త్రంగా మలుచుకొని తప్పుడు ప్రచారాలు వైరల్‌కాకుండా కట్టడి చేస్తున్నారు. దీంతో పాటు జిల్లా కేంద్రంలోని సైబర్‌ల్యాబ్‌ను అస్త్రంగా మలుచుకుంటున్నారు. సైబర్‌ల్యాబ్‌ ఆధారంగా సోషల్‌మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జరుగుతున్న ప్రచారంపై ఉక్కుపాదం మోపుతున్నారు. కరోనావైరస్‌ వ్యాప్తిపై తప్పుడు ప్రచారం, ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేసిన ఏడుగురు వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై ఇష్టారాజ్యంగా తిరుగుతున్న వాహనాలపైనా, అలా గే వాటి యజమానులపైనా కేసులు నమోదు చేశారు. అలాగే పోలీసుల కళ్లుగప్పి రోడ్లపై తిరిగే వారిని పట్టుకునేందుకు సిటిజన్‌ ట్రాకింగ్‌ యాప్‌ ఫర్‌ కోవిడ్‌ - 19 పేరిట ఓ ప్రత్యేకయాప్‌ను రూపొందించారు. జిల్లావ్యాప్తంగా గుర్తించిన 14 కరోనా కట్టడి ప్రాంతాల్లో జనసంచారాన్ని అడ్డుకునేందుకు అలాగే లాక్‌డౌన్‌ మరింత కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.


ఈ సీసీ కెమెరాలను జిల్లా కేంద్రంలోని సైబర్‌ల్యాబ్‌కు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అలాగే జిల్లాకు కేటాయించిన రెండు డ్రోన్‌ కెమెరాలతో పకడ్బందీ నిఘాను సైతం కొనసాగిస్తున్నారు. ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో పోలీసులు ఈ టెక్నికల్‌ వార్‌ను కరోనా కట్టడికోసం కొనసాగిస్తుండడంతో కాంటాక్ట్‌కేసులు తగ్గుముఖం పట్టా యి. జిల్లాలో ఇప్పటి వరకు 19 మందికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు సోకడంతో పోలీసు యంత్రాంగం దీనిపై సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించి తమకున్న సాంకేతిక పరిజ్ఙానాన్ని తెరపైకి తెచ్చింది. ఇదిలా ఉండగా లాక్‌డౌన్‌ విషయంలో కట్టడి ప్రాంతాలకు ఆనుకొని ఉన్న గల్లీల్లో కొంతమంది జనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో పోలీసులు దృష్టి సారించారు.


దీని కోసం గాను జనసంచారం జరుగుతున్న గల్లీలన్నింటినీ భారీకేడ్లతో లాక్‌ చేసేశారు. జనం ఇంటి నుంచే కాకుండా ప్రస్తుతం తమ గల్లీని దాటే పరిస్థితి లేకుండా చేశారు. ఇలాంటి చర్యల కారణంగా లాక్‌డౌన్‌ మరిం త పకడ్బందీగా అమలయ్యే అవకాశం ఏర్పడింది. లాక్‌డౌన్‌ సక్సెస్‌ అయితే సోషల్‌ డిస్టెన్స్‌ దానికదే అమలవుతుందన్నది బహిరంగ రహస్యమే. ప్రస్తుతం నిర్మల్‌ జిల్లా పోలీసులు అమలు చేస్తున్న ఈ సరికొత్త టెక్నికల్‌ వ్యూహం క్రమంగా జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావం తగ్గేందుకు దోహదపడుతుందంటున్నారు. 


పోలీసుల టెక్నికల్‌ ఆపరేషన్‌కు సర్కారు కితాబు

నిర్మల్‌ పోలీసులు కరోనావైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ క్రమంగా ఫలితమిస్తోంది. ప్రస్తుతం క్వారంటైన్‌లో చేరే వారి సంఖ్య తగ్గిపోవడమే కాకుండా మొదటిమాదిరిగా కేసులు కూడా తగ్గిపోయాయి. దీనికి తోడు కొత్తగా ప్రైమరీ కాంటాక్ట్‌ కేసులు కూడా నమోదు కావడం లేదు. పోలీసులు గత కొద్దిరోజుల నుంచి కొనసాగిస్తున్న టెక్నికల్‌ వార్‌ కారణంగానే ఈ ఫలితాలు కనిపిస్తున్నాయన్న విషయాన్ని ఇంటలిజెన్స్‌ వర్గాలు సర్కారుకు నివేదించాయి. సీసీ కెమెరాలు, సిటిజన్‌ ట్రాకింగ్‌ యాఫ్‌ ఫర్‌ కోవిడ్‌ - 19, సీసీటీఎన్‌ఎస్‌తో అనుసంధానం, సైబర్‌ల్యాబ్‌ ఆపరేషన్‌ లాంటి అస్ర్తాల తో నిర్మల్‌ పోలీసులు చేపట్టిన టెక్నికల్‌వార్‌కు రాష్ట్ర ప్రభుత్వం కితాబునిచ్చింది.


జిల్లాలో అమలవుతున్న టెక్నికల్‌ పోలీసింగ్‌ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా సర్కారుకు నివేదించారు. దీంతో ఇక్కడి పోలీసుల పనితీరు సర్కారు ప్రశంసలకు నోచుకుంది. ముఖ్యంగా ప్రజల్లో కరోనాపై అవగాహన పెంచేందుకే కాకుండా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజల్లో విద్వేషాలు రాకుండా తీసుకునేందుకు చేపట్టిన చర్యలు ఫలితాన్నిచ్చాయి. వీటి కారణంగా కరోనా వైరస్‌ విస్తరణకు బ్రేక్‌ పడిందంటున్నారు. 


రోడ్లపై తిరిగే వ్యక్తులు, వాహనాల కోసం ప్రత్యేకయాప్‌ రూపకల్పన

కాగా ప్రభుత్వం సీరియస్‌గా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఉల్లం ఘించే వారి కోసం నిర్మల్‌ పోలీసులు ప్రత్యేక యాఫ్‌ను రూపొందించి నిఘా సారించారు. సిటిజన్‌ ట్రాకింగ్‌ యాఫ్‌ ఫర్‌ కోవిడ్‌ - 19 పేరిటా రూపొందించిన ఈ యాఫ్‌ ఆధారంగా రోడ్లపై అనవసరంగా తిరిగే వాహనాలు, వ్యక్తులను గుర్తిస్తున్నారు. తమ ఇండ్ల నుంచి మూడు కిలో మీటర్లు దాటి ప్రయాణించే వారందరిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. సిటిజన్‌ ట్రాకింగ్‌యాఫ్‌ ద్వారా నిఘా మరింత విస్తృతం చేస్తున్నారు. ఈ యాప్‌ను పోలీసుసిబ్బంది తమ సెల్‌ఫోన్‌లలో ఇన్‌ స్టాల్‌ చేసుకొని చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ పోలీసుల కళ్లుగప్పి వెళ్ళే వాహనాలను ఈ యాఫ్‌ ద్వారా వెలుగులోకి తెచ్చి మరో ప్రాంతంలో గస్తీ కాస్తున్న పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. ఓ వైపు అన్‌లైన్‌లోనే కేసులు నమోదు చేస్తున్నప్పటికి వాహనాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. 


డ్రోన్‌ కెమెరాతో మరింత పకడ్బందీ గస్తీ

కాగా నిర్మల్‌, భైంసా పట్టణాల్లోని కరోనా ప్రభావిత ప్రాంతాలు, అలాగే వాటిని సమీప ప్రాంతాలపై పోలీసులు డ్రోన్‌ కెమెరాల సహకారంతో గస్తీ కాస్తున్నారు. ఎస్పీ శశిధర్‌రాజు స్వయంగా డ్రోన్‌ కెమెరాల నిఘాను పర్యవేక్షిస్తున్నారు. నిర్మల్‌ పట్టణంలోని జోహార్‌నగర్‌, గాజులపేట్‌, చిక్కడ్‌పల్లి, గుల్జార్‌ మార్కెట్‌ , బాగులవాడ , ద్యాగవాడ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ జనం నిబంధనలు అతిక్రమించి తిరుగుతుండడం పట్ల పోలీసులు సీరియస్‌గా స్పందిస్తున్నారు. డ్రోన్‌కెమెరాల ద్వారా చిత్రీకరించిన అంశాలను అప్పటికప్పుడే విశ్లేషించి ఆయా ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్‌ చేపడుతున్నారు. అనుమానిత వ్యక్తులను గుర్తించి వారిని ఆదుపులోకి తీసుకుంటున్నారు. 


కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు

కరోనావైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సీరియస్‌గా పాలు పంచుకుంటున్నాము. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలచేస్తున్నాము. జిల్లాలోని ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో పాటు పోలీసుసిబ్బంది షిఫ్ట్‌ల వారిగా విధులు నిర్వహిస్తూ లాక్‌డౌన్‌ అమలుకు చర్యలు తీసుకుంటు న్నాము. 

                        - శశిధర్‌రాజు, నిర్మల్‌ జిల్లా ఎస్పీ 

Updated Date - 2020-04-21T09:14:40+05:30 IST