లక్ష్యం వైపు అడుగులు
ABN , First Publish Date - 2020-07-27T11:48:06+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం జిల్లాలో లక్ష్యం వైపు అడుగులు వేస్తోంది.

పల్లె ప్రగతిలో పనులపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
మండలాల వారీగా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష
నిర్లక్ష్యం వహించే సర్పంచులు, కార్యదర్శులపై కొరడా
ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్న అధికారులు
మంచిర్యాల టౌన్, జూలై 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం జిల్లాలో లక్ష్యం వైపు అడుగులు వేస్తోంది. కలెక్టర్ భారతిహోళికేరి ప్రత్యేక దృష్టి సారించడంతో సర్పంచులు, అధికారులు పనుల్లో వేగం పెంచారు. పల్లె ప్రగతిలో భాగంగా జిల్లా లోని 311 గ్రామ పంచాయతీల్లో ఇంకుడు గుంతలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డు(కంపోస్ట్ షెడ్)ల నిర్మాణాలు ఆగస్టు నెలాఖరు వరకు నూరు శాతం పూర్తి చేసి లక్ష్యాన్ని చేరుకొనే విధంగా అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఆయా పనుల్లో ఇప్పటి వరకు 60 నుంచి 80 శాతం మేర పనులు పూర్తికాగా మరింత వేగం పెంచేలా కలెక్టర్ మండలాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను సమాయత్తం చేస్తున్నారు.
వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు...
వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్డుల నిర్మాణం లక్ష్యానికి చేరువలో ఉంది. జిల్లాకు 311 వైకుంఠ ధామాలు మం జూరు కాగా 303 నిర్మాణాలు పైకప్పు లెవల్లో, 8 నిర్మాణాలు పూర్తయ్యాయి. అలాగే డంపింగ్ యార్డుల్లో 308 నిర్మాణాలు ప్రారంభం కాగా, 196 పైకప్పు స్థాయిలో ఉన్నాయి. వీటిలో 112 నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటికి సంబంధించి ఆగస్టు 10వ తేదీలోపు అన్ని నిర్మాణాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నారు.
నిర్లక్ష్యం వహించే వారిపై కొరడా
పల్లె ప్రగతిలో భాగంగా అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించిన సర్పంచులు, కార్యదర్శులపై కలెక్టర్ కొరడా ఝళిపిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీ అధికారి వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలో 51 మంది సర్పంచులకు షోకాజ్ నోటీసులు జారీ కాగా నెన్నెల మండలంలో 10 మంది, భీమినిలో 2, జన్నారంలో 2, బెల్లంపల్లిలో 8, తాండూరులో 7, భీమారంలో 1, చెన్నూరులో 3, జైపూర్‌లో 4, హాజీపూర్‌లో 1, కాసిపేటలో 8, కోటపల్లిలో 1, మందమర్రిలో 4 గురు సర్పంచులకు నోటీసులు జారీ అయ్యాయి. అలాగే విధుల్లో నిర్ల క్ష్యం వహించిన 8 మంది పంచాయతీ కార్యదర్శులకు సైతం అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. భీమిని మండలం బిట్టూర్‌పల్లి కార్యదర్శితోపాటు జన్నా రం మండలం కవ్వాల్, జైపూర్ మండలం కిష్టాపూర్, పెగడపల్లి, నెన్నెల మండలం జోగాపూర్, కుశనపల్లి, మైలారం, ఘన్‌పూర్ కార్యదర్శులకు నోటీసులు జారీ అయ్యాయి.
లక్ష్యం చేరుకుంటాం..జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య
పల్లె ప్రగతిలో అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి లక్ష్యం చేరుకుంటాం. కలెక్టర్ ప్రత్యేక చొరవతో సర్పంచులు మొదలుకొని ఇంజనీర్లదాకా ప్రతి ఒక్కరిని పనుల్లో నిమగ్నం చేశారు. ఆగస్టు 31లోపు వంద శాతం లక్ష్యాలు సాధించేలా ఎంపీడీలు, ఎంపీఓలు, ఈఈలు, మండల ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
వేగం పుంజుకున్న ఇంకుడు గుంతల నిర్మాణం
జిల్లాలోని 16 మండలాల్లో ఇంకుడు గుంతల నిర్మా ణాల్లో వేగం పుంజుకొంది. జిల్లాలోని 311 గ్రామాల్లో 64, 469 ఇంకుడు గుంతలను నిర్మించాలని లక్ష్యంకాగా ఇప్పటివరకు 34,730 నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 27,271 పనులు అభివృద్ది దశలో ఉన్నాయి. మిగతా 2,458కి సంబంధించి లబ్ధిదారుల పేర్లు రెండు సార్లు నమోదు కావడంతో వాటిని నిలిపివేశారు.
మండలాల వారీగా పనుల ప్రగతి
మండలం మంజూరు పూర్తిఅయినవి నిర్మాణదశలో
బెల్లంపల్లి 4,699 2.513 1,974
భీమిని 2,417 767 1,598
భీమారం 2,365 1,195 1,089
చెన్నూర్ 5,384 3,630 1,611
దండేపల్లి 4,518 2,387 1,970
హాజీపూర్ 3,082 3,036 42
జైపూర్ 4,457 3,457 740
జన్నారం 5,462 2,563 2,885
కన్నేపల్లి 3,662 853 2,717
కాసిపేట 3,997 2,581 1,259
కోటపల్లి 5,938 2,955 2,916
లక్షెట్టిపేట 4,594 1,776 2,460
మందమర్రి 2,365 1,930 387
నెన్నెల 3,818 1,804 1,524
తాండూరు 4,043 2,039 1,981
వేమనపల్లి 3,648 1,244 2,118