పాములతో జర భద్రం

ABN , First Publish Date - 2020-06-18T10:43:16+05:30 IST

వర్షాకాలం ప్రారంభమై వానలు కురుస్తుండడంతో రైతులు పొలం పనుల్లో బిజీ అయ్యారు.

పాములతో జర భద్రం

వర్షాకాలంలో రైతులు అప్రమత్తతంగా ఉండాలం టున్న నిపుణులు

పొలం పనుల్లో జాగ్రత్తలు తప్పనిసరి

నాటు వైద్యంతో ప్రాణాలకు ముప్పని వైద్యుల హెచ్చరిక 


ఆసిఫాబాద్‌, జూన్‌17: వర్షాకాలం ప్రారంభమై వానలు కురుస్తుండడంతో రైతులు పొలం పనుల్లో బిజీ అయ్యారు. వర్షాకాలంలో పాముల బెడద అధికంగా ఉంటుంది. జూన్‌, జూలై నెలల్లో పాములు తమ ఆవాసాలను విడిచి బయటకు వస్తుంటాయి. బొరియల్లో ఉండే పాములు ఆహారం కోసం పొలం గట్లు, పొదల వెంట సంచరిస్తుంటాయి. వీటిని గమనించక పలువురు పాము కాటుకు గురవుతుంటారు. వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న సమయంలో పాములు బయటకు రావడంతో రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏటా పాముకాటుకు గురై ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాత్రి వేళల్లో నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ ఇండ్లలోకి ప్రవేశిస్తాయి. జిల్లాలో విష సర్పాల సంఖ్య చాలా తక్కువ. కాటు వేసిన పాము విష పూరితమైందో కాదో తెలుసుకోవాలి. 


కట్ల పాము కాటేసిన క్షణాల్లో విషం రక్తంలోకి ప్రవేశించి మృతి చెందే ప్రమాదం ఉంటుంది. పాము కాటుకు గురైన వ్యక్తిని వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లాలి. నాగు పాము కాటేసిన 15 నిమిషాల్లో విషం ఎక్కుతుంది. రక్తపింజర కాటేసిన రెండు గంటల తరువాత విషం ఎక్కుతుంది. జెర్రిపోతు, సిరుకట్ల పాము కాటేసినా విషం ఉండదు. అయితే కాటేసిన చోట చికిత్స చేయడానికి ఆసుపత్రులకు తీసుకువెళ్లాలి. జిల్లాలోని ఆసుపత్రుల్లో పాము కాటుకు మందులు అందుబాటులో ఉన్నాయి. 


అందుబాటులో మందులు 

జిల్లాలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాము కాటుకు మందులు అందుబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్రంతో పాటు సిర్పూర్‌(టి) సామాజిక ఆసుపత్రులు, కాగజ్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం   మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రాథమిక చికిత్స చేసి అవసరమైతే ఏరియా ఆసుపత్రులకు తరలిస్తే బాధితుడిని బతికించే అవకావం ఉంటుంది. ఆందోళనకు గురై ఆలస్యం చేస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. 


విష సర్పాలు రెండు రకాలు 

మొదటిది న్యూరోటాక్సిల్‌ రకం నాగు పాము, కట్ల పాము, రెండో రకం హిమోటాక్సిన్‌ అంటే రక్తపింజర పాము. న్యూరోటాక్సిల్‌తో నోటి ద్వారా నురుగు వచ్చి శ్వాస ఆడక మృతి చెందే ప్రమాదం ఉంది. ఇది గుండెపై ప్రభావం చూపి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. హిమోటాక్సిన్‌తో రక్తనాళాల కణాల్లో కణజాలం నశించి కాటు పడిన భాగంలో వాపు వస్తుంది. కాటేసింది ఎలాంటి పాము తెలుసుకుంటే చికిత్స చాలా సులభం. పక్క పక్కన రెండు దంతాలతో కాటే వేస్తే అది కచ్చితంగా విష సర్పమే. ఎటువంటి పాము కాటే సినా ఆసుపత్రుల్లో చికిత్సలు అందిస్తారు. తీవ్రతను బట్టి ఇంజక్షన్‌ వేస్తారు. యాంటీ స్నేక్‌ వీనం, యాంటీ పాలి వీనం అనే రెండు రకాల మందులు ఉంటాయి.  


ఆందోళన అవసరం లేదు 

పాము కాటుకు గురైనప్పుడు ఆందోళనకు గురి కావద్దు. ఇది గుండెపోటుకు దారి తీస్తుంది. ప్రాథమిక చర్యగా కాటు వేసిన ప్రదేశం పై భాగంలో కట్టు కట్టాలి. ఆ వెంటనే చికిత్స కోసం వెళ్లాలి. పాము కాటుకు గురైన వారు ఆసుపత్రికి వెళ్లి స్పష్టంగా చెప్తే దానికి సంబంధించిన చికిత్స చేస్తారు. అక్కడ యాంటీ స్నేక్‌ వీనం ఇంజక్షన్లు అందుబాటులో ఉంటాయి. రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంటే దానికి ఈ ఇంజక్షన్‌ పని చేస్తుంది. గుండెపోటు రాకుండా ఈ మందు ఉపకరిస్తుంది.  


జాగ్రత్తలు

సాధ్యమైనంత వరకు పాములు, విష కీటకాల బాఽరిన పడకుండా ఉండాలి. రాత్రి పూట పొలాలకు వెళ్లే వారు కర్ర, టార్చ్‌లైటు తీసుకెళ్లాలి. కప్పలు, ఎలుకలు ఉన్న చోట పాములు సంచరిస్తుంటాయి. ఇంటి ఆవరణలో కంప చెట్లు, పిచ్చి మొక్కలు, రంధ్రాలు, నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇళ్లలో ఎలుకలు ఉంటే పాములు వస్తాయి. చిన్నారులు రాళ్లు, చెట్ల పొదల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. రాత్రి పూట పొలాలకు వెళ్లే వారు సాధ్యమైనంత వరకు పొడవాటి బూట్లు ధరించడం ఎంతో మంచిది.  


నాటువైద్యాన్ని ఆశ్రయించొద్దు 

గ్రామీణ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు ఎక్కువ. దీంతో కొంత మంది బాధితులు వైద్యులను సంప్రదించకుండా మంత్రగాళ్లను, నాటు వైద్యులను ఆశ్రయిస్తుంటారు. విషసర్పం కాటేసినప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నాటు వైద్యుడిని ఆశ్రయిస్తే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. విషం లేని పాములు కాటుకు గురైన వారు ప్రాణాలతో బయట పడితే మంత్రగాళ్ల మహిమ అని పలువురు నమ్ముతుంటారు. ఇదే బాధితుల పాలిట ముప్పుగా మారుతుంది. సకాలంలో వైద్యం అందక ఎంతో మంది మృత్యువాత పడుతుంటారు.  


పాము కాటు లక్షణాలు 

వ్యక్తిని విషపూరితమైన పాము కాటేస్తే శరీరమంతా నీలం రంగుగా మారుతుంది. రక్తపోటు ఉంటే స్పృహ కోల్పోతారు. కరిచిన చోట నొప్పి, వాపు ఉంటుంది. కొందరిలో దద్దుర్లు కనిపిస్తాయి. నోటి నుంచి నురగా వస్తుంది. చెమటలు పట్టి సాధారణ స్థాయి కంటే రెట్టింపు స్థాయిలో గుండె కొట్టుకుంటుంది. పాము కాటుకు గురైన వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్తే 99 శాం బతికించే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు. 


మూఢ నమ్మకాలతో ప్రాణాపాయం-కుంరంబాలు, జిల్లా వైద్యాధికారి 

పాముకాటుకు గురైన వ్యక్తులను నేరుగా ఆసుపత్రులకు తరలించాలి. మూఢ నమ్మకాలతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. జిల్లాలోని 18 పీహెచ్‌సీలతో పాటు రెండు సీహెచ్‌సీలలో పాము కాటుకు సంబంధించిన ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ పనుల చేసే సమయంలో రైతులు, కూలీలు  అప్రమత్తంగా ఉండాలి. 

Updated Date - 2020-06-18T10:43:16+05:30 IST