సడలుతున్న ఆంక్షలు
ABN , First Publish Date - 2020-04-25T09:31:26+05:30 IST
నిర్మల్ జిల్లాలో కరోనా ప్రభావిత లక్షణాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాలపై అధికారులు ఆంక్షలు సడలిస్తున్నారు.

జిల్లాలో ఏడు కట్టడి ప్రాంతాల ఎత్తివేత
నిర్మల్ పట్టణంలోని జోహార్‌నగర్, గాజులపేట్‌లపై తొలగిన నిబంధనలు
మరో మూడు గ్రామాలకు వర్తింపు
గాంధీ ఆసుపత్రి నుంచి మరో ఇద్దరి నెగెటివ్ రిపోర్టుతో డిశ్చార్జ్
సర్కారు క్వారంటైన్ నుంచి 24 మంది హోం క్వారంటైన్‌కు మార్పు
కొత్తగా 25 మంది రక్తం షాంపిళ్ల సేకరణ
వీరంతా హోం క్వారంటైన్ అబ్జర్వేషన్‌లోనే..
నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం కిరాణ తెరిచేందుకు అనుమతి
నిర్మల్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్ జిల్లాలో కరోనా ప్రభావిత లక్షణాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాలపై అధికారులు ఆంక్షలు సడలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు కంటైన్‌మెంట్ జోన్‌లపై ఆంక్షలను తొలగించారు. నిర్మల్ పట్టణంలోని జోహార్‌నగర్, గాజులపేట్ ప్రాంతాలను కట్టడి ప్రాంతాల పరిధి నుంచి తొలగించగా మరో మూడు గ్రామాలను కూడా ఇదే వర్తింపజేశారు.
అయితే ప్రజల అవసరాల దృష్ట్యా నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు కిరాణ దుకాణాలపై కొనసాగుతున్న ఆంక్షలను సైతం ఎత్తివేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కిరాణ దుకాణాలను తెరిచి ఉంచే విధంగా నిర్ణయించారు. కాగా గాంధీ ఆసుపత్రిలో పాజిటివ్ లక్షణాల కారణంగా చికిత్స పొందుతున్న మరో ఇద్దరికి నెగెటివ్ రిపోర్టు రావడంతో వారిని గాంధీ ఆసుపత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జి చేశారు. గురువారం స్థానిక బాగులవాడకు చెందిన ఓ యువకుడికి పాజిటివ్ రిపోర్టు రావడంతో ఆయన కుటుంబసభ్యులు, బంధువుల రక్తం షాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్‌కు గాంధీ ఆసుపత్రికి పంపారు. కాగా క్వారంటైన్ నుంచి మరి కొంత మందిని హోం క్వారంటైన్‌కు తరలించారు. అయితే లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు వెయ్యి వాహనాలను స్వాధీనం చేసుకొని వాటి యజమానులపై కేసులను నమోదు చేశారు. రోడ్లపై జనం రాకపోకలను కట్టడి చేస్తున్నారు. అయితే కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆంక్షలను సడలించే దిశగా అధికారులు దృష్టి సారిస్తున్నారు.
దీని కోసం గాను ఎప్పటికప్పుడు కట్టడి ప్రాంతాలలో పరిస్థితులను సమీక్షించి మరింత పకడ్బందీగా లాక్‌డౌన్‌తో పాటు అక్కడి ప్రజలంతా భౌతికదూరం పాటించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 23 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు సోకగా అందులో నుంచి ముగ్గురు కరోనా లక్షణాలతో మరణించారు. కాగా గాంధీ ఆసుపత్రిలో 20 మంది చికిత్సలు పొందుతుండగా అందులో నుంచి నలుగురికి నెగెటివ్ రిపోర్టులు రావడంతో వారిని డిచార్జ్‌చేశారు. దీంతో ప్రస్తుతం 16 మంది నిర్మల్ జిల్లాకు చెందిన వారు గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్సలు పొందుతున్నారు. అయితే ప్రస్తుతం జిల్లాలో ప్రైమరీ, సెకండరీ కేసులు లేకపోవడంతో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉన్న 24 మందిని డిశ్చార్జ్ చేసి హోం క్వారంటైన్ చేశారు. ఇదిలా ఉండగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని 44వ నంబర్ జాతీయ రహదారి గుండా ప్రతిరోజూ వందలాది మంది వలస కూలీలు కాలి నడకన వారి స్వస్థలాలకు వెళుతున్నారు. మహరాష్ట్ర, చత్తీస్‌ఘడ్, యూపీ, బీహార్, రాష్ర్టాలకు వీరు తమ చంటి పిల్లలతో మండుటెండలను సైతం లెక్క చేయకుండా నడుచుకుంటూ వెళుతుండడం కలిచివేస్తోంది. స్థానిక కొండాపూర్ వద్ద ఇలా హైవేపై వెళుతున్న వలస కూలీలందరికీ ఆ గ్రామసర్పంచ్ గంగాధర్‌తో పాటు మరికొంత మంది యువకులు వారి ఆహారం, మంచినీరు అందిస్తున్నారు.
ఏడు ప్రాంతాల్లో కట్టడి నుంచి తొలగింపు
కాగా కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడమే కాకుండా ఇతరులెవరికీ కూడా కరోనా లక్షణాలు సోకకపోవడంతో ఏడు ప్రాంతాల్లో కట్టడి తొలగించారు. ఇప్పటి వరకు 16 ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్‌ల పరిధిలో ఉంచిన అధికారులు ఆ ప్రాంతాలపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. అయితే పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నందున నిర్మల్ పట్టణంలోని జోహార్‌నగర్, గాజులపేట్ ప్రాంతాల్లో కట్టడి తొలగించారు. ఈ రెండు ప్రాంతాల్లో ప్రస్తుతం పూర్తి నిర్భంధం కొనసాగుతోంది. ఈ వీధుల నుంచి జనం బయటకు వెళ్ళకుండా భారీ కేడ్లతో గల్లీలను దిగ్బందించారు. అలాగే మరో మూడు గ్రామాల్లో కట్టడి తప్పించి ఆంక్షలను సడలింపజేశారు. దీంతో ప్రస్తుతం కేవలం 11 ప్రాంతాలు మాత్రమే కట్టడిలో ఉన్నాయి. ఇక్కడ కూడా క్రమంగా పరిస్థితులను సమీక్షించి ఆంక్షలను సడలించనున్నారు.
గాంధీ ఆసుపత్రి నుంచి మరో ఇద్దరి డిశ్చార్జ్
కాగా గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ లక్షణాలతో చికిత్సలు పొందుతున్న మరో ఇద్దరిని శుక్రవారం డిచార్జ్ చేశారు. వీరికి కరోనా నెగెటివ్ రిపోర్టులు రావడంతో వైద్య అధికారులు వీరిని డిశ్చార్జ్ చేస్తున్నట్లు వెల్లడించారు. గత రెండు రోజుల క్రితం కూడా ఇద్దరు పాజిటివ్ లక్షణాలతో చికిత్సలు పొందిన తరువాత నెగెటివ్ రిపోర్టులు రాగా వారు కూడా డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 20 మంది కరోనా పాజిటివ్ కేసులకు గాను నలుగురు నెగెటివ్ రిపోర్టులతో గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం మరో 16 మంది గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్సలు పొందుతున్నారు.
కిరాణ దుకాణాలను మినహాయింపు...
కాగా జిల్లా అంతటా కరోనా ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో అధికాౄరులు కొన్ని అత్యవసర వస్తువుల కొనుగోలుపై మినహాయింపులు ఇస్తున్నారు. మొన్నటి వరకు కూరగాయలను ఇండ్ల వద్దకే సరఫరా చేసిన అధికారులు రెండు రోజుల నుంచి వాటిని బహిరంగంగా విక్రయించేందుకు అనధికార అనుమతులు జారీ చేశారు. అలాగే నిత్యావసర వస్తువుల కోసం కిరాణ దుకాణాలపై కూడా ఆంక్షలు సడలిస్తున్నారు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కిరాణ దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చారు. దీంతో ప్రజలు ఉదయం నుంచి సాయం త్రం వరకు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు ప్రజలకు వెసులుబాటు లభించింది. ఇప్పటి వరకు అదికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
అయినప్పటికీ పకడ్బందీగా లాక్‌డౌన్
కరోనా ప్రభావం తగ్గుతున్నట్లే తగ్గి మళ్లీ అక్కడక్కడ పాజిటివ్ లక్షణాల తో బయట పడుతోంది. గత 13, 14 రోజుల క్రితం వరకు తగ్గుతున్నట్లు కనిపించిన కరోనావైరస్ మళ్లీ తానూర్‌లో ఓ వ్యక్తికి, నిర్మల్ పట్టణంలో మరో వ్యక్తికి సోకింది. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఓ వైపు ప్రభావం లేని ప్రాంతాలను ఆంక్షల నుంచి మినహాయింపు కల్పిస్తూ ప్రభావిత ప్రాంతాలపై కట్టుదిట్టంగా దృష్టి సారిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ముషారప్ ఆలీ, ఎస్పీ శశిధర్‌రాజులు లాక్‌డౌన్‌ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు.