కరోనా లక్షణాలున్నాయని వదిలేసి వెళ్ళిన బంధువులు

ABN , First Publish Date - 2020-08-16T10:46:20+05:30 IST

కరోనా లక్షణాలున్నాయని మహిళను ఆమె బంధువులు వదిలేసి వెళ్ళగా పోలీసులు ఆసుపత్రికి తరలించిన ఘటన శనివారం మంచిర్యాల జిల్లా

కరోనా లక్షణాలున్నాయని వదిలేసి వెళ్ళిన బంధువులు

బాధితురాలిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు 


కోటపల్లి, ఆగస్టు 15 : కరోనా లక్షణాలున్నాయని మహిళను ఆమె బంధువులు వదిలేసి వెళ్ళగా పోలీసులు ఆసుపత్రికి తరలించిన ఘటన శనివారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో పంగిడిసోమారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అలస బాలక్కకు భర్త మృతి చెందగా పిల్లలు ఎవరూ లేరు. పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకురాలిగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. పాఠశాలలు తెరచుకోకపోవడంతో బెజ్జూరులో ఉన్న సోదరుల వరుస అయ్యే బంధువుల ఇంటికి పది రోజుల క్రితం వెళ్ళింది. అక్కడ ఆమె అనారోగ్యానికి గురికావడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళగా అక్కడి వైద్యులు పరీక్షించి ఆమెకు కరోనా లక్షణాలున్నాయని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళాలని సూచించారు.


శుక్రవారం రాత్రి మహిళను ఆమె బంధువులు ఆటోలో పంగిడిసోమారానికి తీసుకొచ్చి ఇంట్లో వదిలివెళ్ళారు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రూరల్‌ సీఐ నాగరాజు, ఎస్సై రవికుమార్‌, ఏఎస్సై నసీర్‌ అహ్మద్‌లు పంగిడిసోమారంకు వెళ్ళి బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకొని 108 అంబులెన్స్‌లో మంచిర్యాల ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. అక్కడ నుంచి వైద్యుల సూచన మేరకు బెల్లంపల్లిలోని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు.

Updated Date - 2020-08-16T10:46:20+05:30 IST