రెడ్‌ జోన్‌..

ABN , First Publish Date - 2020-04-14T12:27:58+05:30 IST

నిర్మల్‌ జిల్లాలో కరోనావైరస్‌ వ్యాప్తి ప్రభావం తీవ్రంగా ఉండడంతో వందశాతం లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు

రెడ్‌ జోన్‌..

కరోనా తీవ్రత కారణంగా ఈ నెల 30 వరకు 100శాతం లాక్‌డౌన్‌ 

కూరగాయలు, నిత్యావసర సరఫరాకు ప్రత్యేక వలంటీర్ల నియామకం 

కంటైన్‌మెంట్‌ జోన్‌లలో వైద్య బృందాలతో థర్మల్‌ స్కానింగ్‌ టెస్ట్‌లు 


నిర్మల్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్‌ జిల్లాలో కరోనావైరస్‌ వ్యాప్తి ప్రభావం తీవ్రంగా ఉండడంతో వందశాతం లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడగించారు. మంగళవారం నాటితో ఐదు రోజుల పాటు వందశాతం లాక్‌డౌన్‌ గడువు ముగిసిపోతున్న క్రమంలో జిల్లా కలెక్టర్‌ ముషారప్‌ ఆలీ ఈ పొడగింపు నిర్ణయం తీసుకున్నారు. జిల్లా లో 19 మందికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు వెలుగు చూడడం అలాగే ఈ లక్షణాలతో ఒకరు మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జిల్లాను రెడ్‌జోన్‌గా ప్రకటించింది. ఈ రెడ్‌జోన్‌ పరిధిలోకి జిల్లా చేరడంతో దాని మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపడుతోంది.


నిర్మల్‌ జిల్లాలోని మొత్తం 14 కంటైన్‌మెంట్‌ జోన్‌లలో సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారి చేస్తున్నారు. అలాగే వైరస్‌ మరింత విస్తరించకుండా దానిని అడ్డుకునే చర్యలు మొదలుపెట్టారు. నిర్మల్‌లోని ఆరు ప్రాంతాలు, భైంసాలోని రెండు ప్రాంతాలతో పాటు లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్‌, రాచాపూర్‌, మామడ మండలంలోని న్యూ లింగంపల్లి, పెంబి మండలంలోని రాయధారి, నర్సాపూర్‌ మండలంలోని చాక్‌పల్లి గ్రామాల్లో ప్రత్యేక వైద్య బృందాలు ఇప్పటికే ఇంటింటి ఆరోగ్యసర్వే నిర్వహించినప్పటికీ మరింత పకడ్బందీ చర్యల్లో భాగంగా ఽథర్మల్‌ స్కానింగ్‌టెస్ట్‌లు చేపట్టబోతున్నారు. రెడ్‌జోన్‌ పరిధిలోకి జిల్లాను చేర్చడంతో యంత్రాంగమంతా అప్రమత్తమవుతోంది. కొందరికి పాజిటివ్‌ లక్షణాలు బయట పడడంతో వీరితో ఎంతమంది కాంటాక్ట్‌ అయ్యారోననే అంశం అందరిని భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 30 మందికి పైగా వ్యక్తులను క్వారంటైన్‌కు అబ్జర్వేషన్‌ కోసం తరలించారు. ఇలాం టి పరిణామాల తీవ్రత కారణంగా వందశాతం లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడగించేందుకు అధికారులు నిర్ణయించారు. 


పకడ్బందీగా లాక్‌డౌన్‌

వందశాతం లాక్‌డౌన్‌ను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే వందశాతం లాక్‌డౌన్‌ను నాలుగు రోజుల పాటు అమలు చేసిన యంత్రాంగం పరిస్థితి తీవ్రత దృష్ట్యా దీనిని 30 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. కాగా ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకుల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టింది. దీని కోసం గాను ప్రతి 20-25 మందికి ఒక వాలంటీర్లను నియమించబోతున్నారు.


ఈ వలంటీర్లకు అధికారులు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీచేయనున్నారు. జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మార్కెట్ల నుంచి వీరు రోజు విడిచిరోజు కూరగాయలను కొనుగోలు చేసి పంపిణీ చేయాల్సి ఉంటుంది. అలాగే దీని కోసం గాను ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపునివ్వబోతున్నారు. ఇప్పటికే పోలీసులు లాక్‌డౌన్‌ విషయంలో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. రోడ్లపై వాహనాల రాకపోకలను పూర్తిగా అడ్డుకుంటున్నారు. మొత్తం కంటైన్‌మెంట్‌ జోన్‌లను దిగ్బందించారు. ఇండ్ల నుంచి ఎవరు కూడా బయటకు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. 


కంటైన్‌మెంట్‌ జోన్‌లలో థర్మల్‌ స్కానింగ్‌ టెస్ట్‌లు

కాగా నిర్మల్‌ జిల్లాలోని 14 ప్రాంతాలను ఇప్పటికే కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా ప్రకటించారు. ఈ కంటైన్‌మెంట్‌ జోన్‌లలో ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అయితే పరిస్థితి తీవ్రత దృష్ట్యా మరోసారి ఈ ప్రాంతాల్లోని ప్రజలందరికి థర్మల్‌ స్కానింగ్‌ టెస్ట్‌లను నిర్వహించబోతున్నారు.


దీని కోసం గాను మంగళవారం నుంచి ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ను అమలు చేయబోతున్నారు. ఇప్పటికే నిర్మల్‌ జిల్లా రెడ్‌జోన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభావిత ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని అంతటా పిచ్‌కారి చేస్తున్నారు. మొత్తానికి ఈ నెల 30 వరకు అదికారులు ఓ వైపు ఆరోగ్య పరీక్షలతో పాటు భౌతికదూరం, లాక్‌డౌన్‌ అమలు చేయడంలో నిమగ్నం కాబోతున్నారు. 

Updated Date - 2020-04-14T12:27:58+05:30 IST