స్థిరాస్తి వ్యాపారం కుదేలు
ABN , First Publish Date - 2020-11-28T03:44:08+05:30 IST
కరోనా, ఎల్‌ఆర్‌ఎస్‌ల దెబ్బకు రియల్‌ఎస్టేట్ రంగం కుప్పకూలింది.

-కరోనా, ఎల్‌ఆర్‌ఎస్‌ల ప్రభావమేనంటున్న రియల ్టర్లు
-పడిపోతున్న భూముల ధరలు
-మార్చికి ముందు పెద్దఎత్తున సాగిన లావాదేవీలు
(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్)
కరోనా, ఎల్‌ఆర్‌ఎస్‌ల దెబ్బకు రియల్‌ఎస్టేట్ రంగం కుప్పకూలింది. జిల్లాలో అంతంతమాత్రంగా ఉన్న భూ సంబంధిత వ్యాపార కార్యకలాపాలు ప్రస్తుతం స్తంభించిపోయాయి. ఫలితంగా ప్రభుత్వానికి రిజిష్ట్రేషన్ల ద్వారా లభించే ఆదాయం తగ్గిపోయింది. 2016లో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేసిన తరువాత ఇక్కడ భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా రెండు సంవత్సరాల క్రితం మంచిర్యాల-చంద్రాపూర్ రాష్ట్ర రహదారిని అప్‌గ్రేడ్ చేస్తూ 363వ నంబర్ జాతీయ రహదారిగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల-చంద్రాపూర్ రహదారి వెంట పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలన్న యోచన ఉన్నట్లు ప్రకటించడంతో ఈ ప్రాంతంలోని భూముల ధరలకు మరింత ఊపు లభించింది. అప్పటివరకు రహదారికి ఇరువైపులా ఎకరాకు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల ధర పలికిన భూములకు ఈ ఏడాది జనవరి నాటికి ఎకరా కోటి నుంచి కోటిన్నరకు పెరిగాయి. అలాగే ఆసిఫాబాద్, బెల్లంపల్లి పట్టణాల మధ్య వ్యవసాయ భూములకు కూడా రోడ్డు పక్కన రూ.70లక్షల నుంచి 80 లక్షలు, కాస్త లోపలికయితే రూ.25-35లక్షల మధ్య ధర పలుకుతున్నాయి. ఇక ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ వంటి పట్టణాల్లో గజం రూ.18 వేల నుంచి 20 వేలు ధర పలికేది. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ కరోనా మహమ్మారి విజృంభించడంతో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలింది. మూడు నెలల పాటు కొనసాగిన లాక్‌డౌన్ కారణంగా ప్రజల ఆర్థిక పరపతి పూర్తిగా సన్నగిల్లడం కూడా రియల్‌ఎస్టేట్ వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని చెబుతున్నారు. లాక్‌డౌన్‌కు ముందు పట్టణాల్లో ఇంటి స్థలాలు, గ్రామాల్లో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు జోరుగా సాగేవి. గతంలో ఆసిఫాబాద్ కార్యాలయంలో సగటున ప్రతీరోజు 30-40 రిజిష్ట్రేషన్లు జరిగేవి. కాస్త కరోనా నుంచి తేరుకుంటున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తేవడంతో పాటు ఎల్‌ఆర్‌ఎస్‌ను తప్పనిసరి చేయడంతో రియల్ ఎస్టేట్ రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడటంతో రియల్ వ్యాపారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
మరికొంత కాలం ఇదే పరిస్థితి..
కరోనా కారణంగా సుదీర్ఘ కాలం పాటు లాక్‌డౌన్ విధించడంతో జిల్లాలో అన్నిరకాల కార్యకలాపాలు స్తంభించిపోయి ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది. కరోనా, ఎల్‌ఆర్‌ఎస్‌ల ప్రభావంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్నిరంగాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్నిరంగాలు ఆర్థికంగా కోలుకుంటే తప్ప రియల్‌ఎస్టేట్ వ్యాపారం పూర్వ వైభవాన్ని సంతరించుకునే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. రియల్‌ఎస్టేట్‌కు సంబంధించి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్థితి ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం భూములను ఎక్కువగా కొనుగోలు చేసేది దిగువ, ఎగువ మధ్య తరగతి వర్గాలతో పాటు సింగరేణి వంటి ప్రభుత్వ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులే . వీరి తరువాత స్థానంలో ప్రభుత్వ ఉద్యోగులు భూములపై ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తాము సంపాదించిన మొత్తాన్ని భూములపై పెట్టుబడిగా పెడితే భవిష్యత్తులో రెండు, మూడు రేట్లు అధిక ఆదాయం లభిస్తుందన్న ఆశ ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రభుత్వం రైతాంగానికి రైతుబంధు కింద పెట్టుబడి సాయం రూపంలో ఒక్కో ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున అందిస్తోండడంతో భూములు కొనుగోలుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకుల్లో డి పాజిట్లపై అతితక్కువ వడ్డీ చెల్లిస్తుండటం కూడా మరో కారణమని నిపుణులు చెబుతున్నారు.
పొరుగు రాష్ట్రాలకు బ్రోకర్ల పరుగు
కరోనా పంజాకు కుదేలైన వ్యాపారాలతో పాటు భూముల ధరలు భారీగా పడిపోతున్నట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులుల చెబుతున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎకరా రూ.5 లక్షల కంటే తక్కువగా ఎక్కడా దొరక్కపోవడంతో చాలా మంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మహారాష్ట్ర వైపు పరుగులు పెడుతున్నారు. అక్కడ ఎకరా ధర రెండున్నర లక్షల రూపాయల నుంచి నాలుగు లక్షల లోపే ఉండటంతో బ్రోకర్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు ఆంధ్రా ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చి భూములను కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర గ్రామాల్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చక్కర్లు కొడుతున్నారు.
ఫఎల్‌ఆర్‌ఎస్ నిబంధనతో ఇబ్బందులు
-దాగాం దిలీప్, రియల్‌ఎస్టేట్ వ్యాపారి, కాగజ్‌నగర్
కరోనా కారణంగా ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో అందరినీ నష్టాలకు గురిచేస్తోంది. మేము గతంలో పలు భూములు క్రయ విక్రయాలు చేసేం దుకు అడ్వాన్స్‌గా కొంత డబ్బులిచ్చాం. ఎల్‌ఆర్‌ఎస్‌తో ఇప్పుడు సమస్యలు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్ డబ్బులు ఓనర్ కట్టడం లేదు. దీంతో మాపై అదనపు భారం పడింది. దీంతో కొన్ని లావాదేవీలను రద్దు చేసు కున్నాం. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తి గా కుదేలైంది.
ఫకొనుగోలుదారులు ముందుకు రావడం లేదు
-డోంగ్రి అరుణ్, రియల్‌ఎస్టేట్ వ్యాపారి, కాగజ్‌నగర్
ప్రభుత్వ నిర్ణయం ఏ మాత్రం బాగా లేదు. చాలా సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియతో అనేక సమస్యలు ఉత్పన్నం అవు తున్నాయి. భూములు కొనుగోలు చేసుకునేందుకు గతంలో ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌తో మాపై రూ.50వేల అదనపు భారం పడుతోంది. కొనుగోలుదారులు ముందుకు రావటం లేదు.