రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మిస్తేనే గేటు తీసెయ్యాలి

ABN , First Publish Date - 2020-11-27T04:16:55+05:30 IST

జిల్లా కేంద్రంలోని రైల్వే ట్రాక్‌పై ఓవర్‌ బ్రిడ్డి నిర్మాణం చేపడితేనే స్థానికంగా ఉన్న గేటును తొలగించాలని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు.

రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మిస్తేనే గేటు తీసెయ్యాలి
సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులు

మంచిర్యాల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని రైల్వే ట్రాక్‌పై ఓవర్‌ బ్రిడ్డి నిర్మాణం చేపడితేనే స్థానికంగా ఉన్న గేటును తొలగించాలని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్లోర్‌ లీడర్‌ రావుల ఉప్పలయ్య మాట్లాడారు. టౌన్‌-1, 2ల మధ్య రైల్వే ట్రాక్‌పై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ రాగా అది ఎందుకు రద్దయిందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం బీజేపీ నాయకులతోపాటు ఎమ్మెల్యే, ఎంపీలపై ఉందన్నారు. ఓవర్‌ బ్రిడ్జి స్థానంలో అండర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపడుతామని మున్సిపాలిటీ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ తీసుకున్నారని చెప్పారు. టూటౌన్‌కు వెళ్లే గేటును తొలగిస్తూ ధ్రువీకరణ పత్రం ఇస్తేనే తాము అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి సమ్మతిస్తామని రైల్వే అధికారులు స్పష్టం చేశారని తెలిపారు. గేటు తొలగించేందుకు నో ఆబ్జెక్షన్‌ ఇస్తే  తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. అండర్‌ బ్రిడ్జి నిర్మిస్తే లారీలు, అంబులెన్సులు, స్కూల్‌ బస్సులు వెళ్లడానికి ఆస్కారం ఉండదని, గేటు ఎప్పటిలాగే ఉంటే వాహనాలు వెళ్లేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.. ప్రజల కోరిక మేరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలన్నారు.  రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిని ఐబీ చౌరస్తా వరకు పొడిగించాలని డిమాండ్‌ చేశారు.  డిప్యూటీ ఫ్లోర్‌ మజీద్‌ మాట్లాడుతూ టూటౌన్‌లో రోడ్డు డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని కోరారు. డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ వేములపల్లి సంజీవ్‌, కౌన్సిలర్లు అంకం నరేష్‌, రామగిరి బానేష్‌, ప్రకాశ్‌నాయక్‌, సల్ల మహేష్‌, నాయకులు శ్రీనివాస్‌, జోగుల సదానందం పాల్గొన్నారు. 

అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి మార్గం సుగమం

- ఎమ్మెల్యే దివాకర్‌రావు

జిల్లా కేంద్రంలోని వన్‌ టౌన్‌, టూ టౌన్‌ ప్రాంతాలను కలిపేలా రైల్వే ట్రాక్‌ కింద నుంచి అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి మార్గం సుగమమైందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు తెలిపారు. గురువారం ఆయన హైదరాబాద్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడారు. రెండు నెలల్లో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుందని చెప్పారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా రెండు లేన్లలో రోడ్డును నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రైల్వే అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని చెప్పారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేతతో కలిసి తాను పలుమార్లు రైల్వే అధికారులకు విన్నవించడంతో ఎట్టకేలకు నిర్మాణానికి అనుమతులు లభించినట్లు తెలిపారు. 


Updated Date - 2020-11-27T04:16:55+05:30 IST