రక్షణ కవచం

ABN , First Publish Date - 2020-09-05T07:01:40+05:30 IST

గత కొన్ని సంవత్సరాల నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ అదనపు ముంపు భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైన సంగతి

రక్షణ కవచం

ప్రాజెక్ట్‌ ఆక్రమిత ముంపు భూముల  చుట్టూ ట్రెంచ్‌ల ఏర్పాటు 

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో 2వేల ఆక్రమిత భూముల గుర్తింపు 

రూ. 5కోట్లతో తాజాగా ప్రతిపాదనలు 

పకడ్బందీ రక్షణ చర్యలకు కలెక్టర్‌ యాక్షన్‌ ప్లాన్‌ 

ఆక్రమణదారుల నుంచి ఇప్పటికే భూములు స్వాధీనం 


నిర్మల్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : గత కొన్ని సంవత్సరాల నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ అదనపు ముంపు భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైన సంగతి తెలిసిందే. సంబంధితశాఖలోని లోపాలు, లొసుగులను ఆసరాగా చేసుకున్న ఆక్రమణదారులు పథకం ప్రకారం రికార్డులను తారుమారు చేసి ఈ కబ్జాపర్వాన్ని కొనసాగించారు. ఇలా జిల్లాలో దాదాపు 4వేల ఎకరాల ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌భూమి ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలున్నాయి. అప్పట్లో భూములు విక్రయించిన రైతులు ఇరిగేషన్‌ శాఖకు రిజిస్ర్టేషన్‌ చేసి ఇచ్చారు. ఆ భూములన్నీ మ్యూటేషన్‌లు కాకపోవడంతో రికార్డుల్లో రైతుల పేర్లే మొన్నటి వరకు వచ్చాయి. దీనిని ఆసరాగా చేసుకున్న ఆక్రమణదారులు ఇష్టారాజ్యంగా రికార్డులను తారుమారు చేసి సంబంధిత రైతుల ద్వారా భూములను కొల్లగొట్టారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ రంగంలోకి దిగి విచారణ జరిపించారు. ఈ విచారణలో దాదాపు 2 వేల ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించారు.


ఈ భూములన్నింటినీ స్వాధీనం చేసుకొని రికార్డులను సరిచేసే పనిలో ప్రస్తుతం అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఆక్రమణకు గురైన భూములను రక్షించేందుకు కలెక్టర్‌ సరికొత్త యాక్షన్‌ప్లాన్‌ను రూపొందించారు. ఈ భూముల చుట్టూ భారీగా ట్రెంచ్‌లు ఏర్పాటు చేసి ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టబోతున్నారు. దీని కోసం గాను దాదాపు రూ. 5 కోట్లతో కలెక్టర్‌ ప్రతిపాదనలు రూపొందించారు. ఈ నిధులు మంజూరు కాగానే 2వేల ఎకరాల చుట్టూ ట్రెంచ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ భూములకు పక్కా రక్షణ ఏర్పడనుందంటున్నారు.


ఇలా ఆక్రమణల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్న 2వేల ఎకరాల భూమిని ప్రభుత్వ పరమైన అవసరాల కోసం వినియోగించుకునేందుకు కూడా కార్యాచరణ మొదలుపెట్టారు. దీని కోసం గాను దాదాపు 700 ఎకరాల్లో సెజ్‌ (స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌)ను ఏర్పాటు చేసే దిశగా కూడా కలెక్టర్‌ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కోట్ల రూపాయల ధర పలికే ఈ భూములను కబ్జాల నుంచి కాపాడి ఆ భూములను రక్షించేందుకే కాకుండా సద్వినియోగం చేసేందుకు కూడా కలెక్టర్‌ చేస్తున్న ప్రయత్నాలు సర్వత్రా మన్ననలు అందుకుంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోనే దాదాపు 97 వేల ఎకరాల భూములను అప్పట్లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ కోసం సేకరించారు. అయితే ప్రాజెక్ట్‌ గరిష్ట నీటిమట్టం 91టీఎంసీలను పరిగణలోకి తీసుకుని ఈ భూములను సేకరించిన అధికారులు మరో మూడు టీయంసిల నీటికి సరిపడూ భూమిని కూడా అదనంగా సేకరించిపెట్టారు. ఈ మూడు టీఎంసీల అదనపు భూమిలోకి అనూహ్య కారణాల వల్ల గోదావరినది వరదవస్తే ఆ వరదకు సంబంధించిన ముంపు ఈ భూమికి వర్తిస్తుంది.


అయితే ఇప్పటి వరకు ఈ మూడు టీఎంసీల కోసం సేకరించిన 7వేల ఎకరాల్లో ఇప్పటికి వరదనీరు ఏనాడు కూడా రాలేదు. నిజామాబాద్‌ జిల్లాలో 3 వేలు, నిర్మల్‌ జిల్లాలో 4వేల ఎకరాలకు అద నపు ముంపు కోసం సేకరించగా ఈ భూములన్నీ దాదాపు లోపభూయిష్ట రికార్డుల కారణంగా ఆక్రమణలకు గురయ్యాయి. అయితే అధికారులు ఆక్రమణలపై సర్వే జరిపి దాదాపు 2వేల ఎకరాలను వెలికి తీశారు. ప్రస్తుతం ఈ భూములన్నింటికీ ట్రెంచ్‌ల పేరిట రక్షణకవచం ఏర్పాటు చేసే దిశలో కలెక్టర్‌ నిమగ్నమవ్వడం ప్రాధాన్యతను సంతరించుౄకుంటోంది. 


రూ. 5కోట్లతో ప్రతిపాదనలు

కాగా ఆక్రమణదారుల నుంచి సేకరించిన దాదాపు 2వేల ఎకరాల భూమిని తిరిగి కబ్జాకు గురి కాకుండా కాపాడడమే కలెక్టర్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం గాను రికార్డులన్నింటినీ కలెక్టర్‌ సరిదిద్దిపించారు. అలాగే 2వేల ఎకరాల భూమి చుట్టూ ట్రెంచ్‌లు ఏర్పాటు చేసి ఆ భూమిని పకడ్బందీగా రక్షించాలని భావిస్తున్నారు. దీనికోసం గాను దాదాపు రూ. 5కోట్లతో కలెక్టర్‌ ప్రతిపాదనలు రూపొందింపజేశారు. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరుకు గ్రీన్‌సిగ్నల్‌ అందగానే పనులను మొదలుపెట్టనున్నారు. ఇదే జరిగితే ఎస్సారెస్పీ భూముల పరిరక్షణ ప్రక్రియలో కీలకఘట్టంగా మారనుంది. మొదట్లో కలెక్టర్‌ భూముల ఆక్రమణపై సీరియస్‌గా విచారణ జరిపించి తరవాత ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం రికార్డులను సరిచేయడం లాంటి అంశా లపై దృష్టిపెట్టారు. ఆ ప్రక్రియ పూర్తి కాగానే ఆయన స్వాధీనం చేసుకున్న భూములను కాపాడాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే భూములను రక్షించేందుకు ఆయన రెవెన్యూ, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌శాఖ అధికారులతో పలుసార్లు సమీక్షలు జరిపి ట్రెంచ్‌ల ఏర్పాటు దిశగా నిర్ణం తీసుకున్నారు. 


జిల్లాలో 2వేల ఎకరాల భూముల గుర్తింపు

జిల్లాలో ప్రస్తుతం దాదాపు 2వేల ఎకరాల ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ భూమి ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించారు. దాదాపు 15 రోజుల పాటు మొత్తం అదనపు బ్యాక్‌వాటర్‌ కోసం సేకరించిన భూమినంతటినీ సర్వేచేశారు. మొత్తం అదనపు బ్యాక్‌వాటర్‌ కోసం 7 వేల ఎకరాల భూమిని నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల నుంచి సేకరించారు. మన జిల్లాకు చెందిన 4వేల ఎకరాల భూమి నుంచి దాదాపు 2వేల ఎకరాల భూమి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇతరుల ఆక్రమణల్లో కొనసాగుతోంది. ఆక్రమణదారులు రెవెన్యూ రికార్డుల లోసుగులను తమకు అనుకూలంగా మలుచుకొని తప్పుడు రికార్డులతో ఆ భూముల్లో పాగా వేశారు.


దీంతో ఆ భూములను వారంతా కొన్ని సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు. చేపల చెరువులు, వ్యవసాయం లాంటి కార్యకలాపాలు సాగిస్తున్నారు. అధికారులు తమకు అందిన ఫిర్యాదులపై స్పం దించ ఈ భూకుంభకోణంపై విచారణ జరిపారు. మొత్తం 4వేల ఎకరాల నుంచి 2వేల ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించారు. రికార్డులను పరిశీలించి అందులోని తప్పిదాలను సవరించారు. అలాగే ఈ భూమిలన్నింటిని స్వాఽధీనం చేసుకొని కొత్త రికార్డులు రూపొందించారు. ప్రస్తుతం 2వేల ఎకరాల భూమి సర్కారు ఆధీనంలోకి తిరిగి చేరింది. 


700 ఎకరాల్లో సెజ్‌కు ప్రయత్నాలు

ఇదిలా ఉండగా ఆక్రమణదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్న 2వేల ఎకరాల ఆక్రమిత భూమి నుంచి దాదాపు 700 ఎకరాల్లో సెజ్‌ ఏర్పాటు చేసేందుకు కలెక్టర్‌ రంగంసిద్ధం చేశారు. మూడు ప్రత్యేకఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ఆయన ఈ సెజ్‌ ఏర్పాటు యోచనను చేపట్టారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల పేరిట సెజ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉండడంతో ఆయన ఈ ప్రణాళికను రూపొందించారు. అయితే జిల్లాలో విస్తారంగా సాగయ్యే పంటల ఆధారంగా కూడా అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పత్తి, మొక్కజొన్న, వరి, సోయాబీన్‌, వరి లాంటి పంటలు జిల్లాలో విస్తారంగా సాగవుతున్నందున ఆ పంటలను లక్ష్యంగా చేసుకొని బాసర సెజ్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చన్న సంకేతాలను కలెక్టర్‌ సర్కారుకు నివేదించారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కూడా జిల్లా కలెక్టర్‌ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మరో రెండు, మూడు నెలల్లో సెజ్‌ ఏర్పాటుకు ఆమోదముద్ర లభింస్తుంది.

Updated Date - 2020-09-05T07:01:40+05:30 IST