సాగునీరు అందేదెలా?

ABN , First Publish Date - 2020-07-20T10:34:34+05:30 IST

జిల్లాలో సాగుకు రైతాంగం అనాదిగా వర్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది

సాగునీరు అందేదెలా?

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ప్రాజెక్టులు

జిల్లాలో నీటి వనరులున్నా ఉపయోగపడని వైనం

రైతులకు తప్పని తిప్పలు


ఆసిఫాబాద్‌, జూలై19: జిల్లాలో సాగుకు  రైతాంగం అనాదిగా వర్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏళ్లుగా ప్రధాన ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండడంతో సరైన సాగునీటి వసతి లేక వేలాది ఎకరాల భూములు బీడుగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో గత్యంతరం లేక ఆరుతడి పంటల సాగుతో సరిపెట్టాల్సి వస్తోంది. అన్నదాతలు పూర్తిగా వర్షాధార పంటలపై ఆధార పడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తయి సక్రమంగా నీరందిస్తే తప్ప సాగు పండుగలా మారే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ప్రధానంగా కుమరం భీం ప్రాజెక్టు, జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో కాలేదు. అదే విధంగా వట్టివాగు, చెలిమెల వాగు ప్రాజెక్టు కాలువలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. 


పూర్తి కాని కుమరం భీం  ప్రాజెక్టు

జిల్లాలో కుమరం భీం ప్రాజెక్టు ఏళ్లుగా రైతులకు పూర్తి స్థాయిలో సాగు నీరందించడం లేదు. పది టీఎంసీల సామర్థ్యంతో సుమారు రూ.600 కోట్లకు పైగా అంచనాలతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు లక్ష్యంలో సగం కూడా నీరందించడం లేదు. కుడి ప్రధాన కాలువ ద్వారా ఆసిఫాబాద్‌ మండల పరిధిలో ఆరు వేల ఎకరాలు, ప్రధాన ఎడమ కాలువ ద్వారా ఆసిఫాబాద్‌తో పాటు కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి) మండలాల్లోని 45,500 ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రాజెక్టును రూపొందించారు. ప్రాజెక్టు ప్రధాన నిర్మాణం పూర్తై ఏళ్లు గడుస్తున్నా కాలువల పనులు పూర్తి కాలేదు. 


అధ్వానంగా వట్టివాగు ప్రాజెక్టు కాలువలు

ఆసిఫాబాద్‌ మండలం వట్టివాగు నీటిని స్థానిక పొలాలకు అందించాలనే ఉద్దేశ్యంతో 1998లో 24,500 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కుడి కాలువ ద్వారా 21,800 ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 2700 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా నిర్దేశించారు. కాలువలు ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఆధునికీకరణకు నోచుకోవడం లేదు. దీనికి తోడు ఇప్పటికే కాలువలు మొత్తం దెబ్బతిన్నాయి. లైనింగ్‌ కోల్పోయి చెట్లు ఏపుగా పెరిగి అధ్వానంగా మారాయి. చాలా చోట్ల కాలువలు నామరూపాలు లేకుండా పోయాయి. దీంతో ఆసిఫాబాద్‌, రెబ్బెన మండలాల పరిధిలోని ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే  పరిస్థితి లేదు. అధికారులు ఆధునికీకరణ పనుల కోసం ప్రతిపాదనలను పంపినప్పటికీ వాటికి నిధులు విడుదల కాలేదు. 


జగన్నాథ్‌‘పూర్‌’..

కాగజ్‌నగర్‌ మండలంలోని పెద్దవాగుపై నిర్మించిన జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాగజ్‌నగర్‌, దహెగాం మండలాల పరిధి 15,000 ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టినప్పటికీ నత్తనడకన కొనసాగుతున్నాయి. భూ సేకరణ, తదితర సమస్యలతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో  ఆయకట్టు  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం  పూర్తయితే తమ భూములు సస్యశ్యామలం అవుతాయని ఆశించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. 

Updated Date - 2020-07-20T10:34:34+05:30 IST