రైతుబంధుకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2020-12-27T05:54:24+05:30 IST

యాసంగీ రైతుబంధు పథకం అమలుకు వ్యవసాయశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

రైతుబంధుకు రంగం సిద్ధం

పంటసహాయం పంపిణీకి సర్వంసిద్ధం 

రేపటి నుంచి రైతులబ్యాంకు ఖాతాల్లోకి 

మొదట ఎకరంలోపు రైతులకు ప్రాధాన్యం

జిల్లాలో 1.66 లక్షల మంది అన్నదాతకు 225 కోట్ల లబ్ధి 

జనవరి 7 లోగా కొత్త వారికి దరఖాస్తులకు అవకాశం 

నిర్మల్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : యాసంగీ రైతుబంధు పథకం అమలుకు వ్యవసాయశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా రైతుబంధు నగదు రైతుల ఖాతాల్లో జమకాబోతోంది. జిల్లావ్యాప్తంగా మొత్తం రూ.1.66 లక్షల మంది రైతులకు రైతుబంధు ద్వారా పంటపెట్టుబడి సహాయం అందబోతోంది. గత ఖరీఫ్‌కు భిన్నంగా ఈ సారి ఎకరంలోపు రైతులకు నగదు సహాయాన్ని అందించబోతున్నారు.ఆ తరువాత దశల వారీగా మిగతా రైతులకు పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ సారి వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతుబంధుకు అర్హతను నిర్ధారించారు. మొత్తం 225 కోట్ల రూపాయలను జిల్లాలోని 1.66 లక్షల మంది రైతులకు పంపిణీ చేయనున్నారు. మొత్తం 4.40 లక్షల ఎకరాల్లో ఈసారి యాసంగి పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయాధికారులు నిర్ధారించారు. ఎకరానికి 5వేల చొప్పున రైతుబంధు కింద అందించనున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో రెండు ఎకరాల్లోపు రైతులు మొత్తం 75వేల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొత్తగా పట్టాదార్‌పాస్‌ పుస్తకాల కోసం 4165 మంది దరఖాస్తులు చేసుకోగా వారిలో 3600 మంది అర్హులుగా వ్యవసాయశాఖ గుర్తించింది. దీంతో పాటు 500 మంది రైతులు తమ బ్యాంకుఖాతాల వివరాలను వ్యవసాయశాఖకు ఇప్పటి వరకు అందించలేదు. వీరం దరూ వెంటనే తమ బ్యాంకు ఖాతాలను వ్యవసాయశాఖకు అం దించాలని అధికారులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా జనవరి 7 వరకు రైతుబంధు రాని వారంతా మరోసారి దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఇప్పటికే ప్రతీ క్లస్టర్‌ వారిగా రైతులను గుర్తించిన అధికారులు వారికి ఎంత మేరకు సహాయం అందుతుందోనన్న వివరాలతో కూడిన జాబితాలను అన్‌లైన్‌లో నమోదు చేశారు. దీని ప్రకారమే ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులను జమ చేయనున్నారు. రైతుబంధుకు సంబంధించిన డబ్బులన్నీ ఆదివారం లోగా ట్రేజరీలో జమ కానున్నట్లు ఆ తరువాత సోమవారం నుంచి బ్యాంకుఖాతాల్లోకి చేరుకోనున్నట్లు సంబందిత అధికారులు వివరిస్తున్నారు. 


మొదట అర, ఎకరంలోపు వారికే ప్రాధాన్యం

గత ఖరీఫ్‌కు భిన్నంగా ఈ సారి రైతుబంధు పథకం కింద నగదును అందించబోతున్నారు. మొదట అరఎకరం, ఎకరంలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకే నగదు సహాయాన్ని అందించబోతున్నారు. ఎకరానికి రూ.5వేల చొప్పున నగదు సహాయాన్ని పంపిణీ చేసే క్రమంలో అరఎకరం, ఎకరం వారికి మొదట ఆ డబ్బులను జమ చేయాలని నిర్ణయించారు. అనంతరం మిగతా రైతులందరినీ పరిగణనలోకి తీసుకోబోతున్నారు. జిల్లాలో రెండు ఎకరాల్లోపు రైతులు 75 వేల వరకు ఉండగా రెండు ఎకరాలకు పైగా ఉన్న వారు రెండు ఎకరాలు దాటిన వారు 91వేల మంది ఉన్న ట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీరంతా 4.40 లక్షల ఎకరాల్లో యాసంగి పంటలను సాగుచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వరిఽధాన్యం పంటలతో పాటు కందులు, పెసర, మినుములు, నువ్వు, పసుపు, కూరగాయల పంటలను రబీలో రైతులు సాగు చేస్తున్నారు. క్లస్టర్‌ల వారీగా లెక్క గట్టిన అధికారులు అరఎకరం, ఎకరం కలిగి ఉన్న రైతులకు మొదటవారి బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేయబోతున్నారు. 

జనవరి 7 వరకు దరఖాస్తులకు అవకాశం

ఇదిలా ఉండగా రైతుబంధు పథకం కోసం ఎంపిక కాని రైతులంతా జనవరి 7లోగా మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మొత్తం 1.66 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించినప్పటికీ డిజిటల్‌పాస్‌ పుస్తకాలు రాని వారు 4165 మంది ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. వీరిలో కూడా 3600 మందిని రైతుబంధుకు అర్హులుగా పేర్కొంటున్నారు. మరో 500 మంది బ్యాంకుఖాతాల వివరాలను అధికారులకు అందించలేదు. ఇలా పలు సాంకేతిక కారణాలతో రైతుబందుకు అర్హత సాధించని రైతులు జనవరి 07వ తేదీలోగా వ్యవసాయశాఖ అధికారులకు దరఖాస్తులు చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నారు. సోమవారం నుంచి రైతులఖాతాల్లోకి నగదు జమ అవుతున్నప్పటికీ జనవరి 7లోగా దరఖాస్తులు చేసుకున్న వారికి కూడా నగదు సహయాన్ని అందించాలని సర్కారు నిర్ణయించింది. 

పకడ్బందీగా ఏర్పాట్లు

రైతుబంధు సహాయం అందజేసే విషయంలో జిల్లా కలెక్టర్‌ వ్యవసాయశాఖకు పకడ్భందీ ఆదేశాలు జారీ చేశారు. నగదు సహాయం రైతులఖాతాల్లో నేరుగా జమయ్యేలా చూడాలని రైతుల అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిశీలించి తగినచర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌ ఆదేశించారు. ఇప్పటికే వ్యవసాయ, రెవెన్యూ, ఉద్యానవనశాఖ  బ్యాంకు అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సోమవారం నుంచి బ్యాంకుఖాతాల్లోకి నగదు జమకాబోతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండా లంటూ కలెక్టర్‌ సూచించారు. దీంతో వ్యవసాయశాఖ అధికారులు సోమవారం నుంచి రైతుబంధు వ్యవహారంలో తలమునకలు కాబోతున్నారు. బ్యాంకు అధికారులు సైతం ఈ విషయంలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా, ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత యంత్రాంగం చర్యలు చేపట్టనుంది. గత ఖరీఫ్‌ మాదిరిగా కాకుండా మొదట అరఎకరం, ఎకరం వ్యవసాయభూమి ఉన్న వారికి మాత్రమే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండగా మిగతా రైతులు అపొహలకు గురి కావద్దని వారికి కూడా దశలవారీగా డబ్బులు జమ అవుతాయంటూ అధికారులు వెల్లడిస్తున్నారు. ఏవైనా అపో హలు, అవాంతరాలు ఎదురైతే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని వారు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-27T05:54:24+05:30 IST