అలర్ట్
ABN , First Publish Date - 2020-05-19T10:17:47+05:30 IST
ముంబాయి నుంచి వలస కూలీలు జిల్లాకు వస్తు న్నారు. అక్కడి నుంచి వచ్చిన వారితో కరోనా పాజి టివ్ కేసులు పెరుగుతున్నాయి.

జిల్లాలో 17కు చేరిన పాజిటివ్ కేసులు
సోమవారం ఒక రోజే 7గురికి నిర్ధారణ
అందరూ ముంబాయి వలస కూలీలే
పలు ప్రాంతాల నుంచి వస్తున్న కూలీలు
కరోనా మహమ్మారితో మండలాల్లో ఆందోళన
హోం క్వారంటైన్లో 2502 మంది...
(ఆంధ్రజ్యోతి, మంచిర్యాల) : ముంబాయి నుంచి వలస కూలీలు జిల్లాకు వస్తు న్నారు. అక్కడి నుంచి వచ్చిన వారితో కరోనా పాజి టివ్ కేసులు పెరుగుతున్నాయి. జిల్లాలో సోమవారం ఏడుగురు ముంబాయి వలస కూలీలకు పాజిటివ్ వచ్చింది. దీంతో పల్లె ప్రజలు కలవరపడుతున్నారు. హోంక్వారంటైన్ 2,502కు పెరిగింది. ఐసోలేషన్‌లో 14 మంది ఉన్నారు. జిల్లాలో యాక్టివ్ కేసు ఒక్కటి కూడా లేదు. జిల్లా నుంచి 108 నమూనాలు పంపిస్తే 90 నెగెటివ్ వచ్చాయి. ఒకటి జిల్లాలో స్థానిక పాజిటివ్ కాగా, 17 కూడా ముంబై నుంచి వచ్చిన పాజిటివ్ కేసులే కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఏప్రిల్ 14న చెన్నూర్ మండలంలోని ముత్తరావుపల్లి లో మహిళకు మరణించిన అనంతరం పాజిటివ్ అని తేలింది. అయితే ఇంత వరకు ఆ మహిళకు కరోనా ఎలా సోకిందనే విషయం తేలలేదు.
ముంబై నుంచి వచ్చిన వారి సమాచార సేకరణ కోసం గ్రామాలను అధికారులు జల్లెడపడుతున్నారు. జన్నారం, దండేపల్లి, హాజీపూర్, లక్షెట్టిపేట, బెల్లంపల్లి మండలాలకు ముంబాయి నుంచి సుమారు 1500 మంది వలస కార్మికులు వచ్చారు. వారితోపాటు బంధువులతో కలిపి 2,502 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారు. బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సం క్షేమ బాలుర హాస్టల్ క్వారంటైన్లో 9 మంది, సింగరేణి ఆసుపత్రిలో గల ఐసోలేషన్‌లో 18 మంది ఉన్నారు. జిల్లాలోని 17 పాజిటివ్ కేసులు జిల్లా పరిధిలోకి తీసుకోలేదు. అవన్నీ ముంబాయి నుంచి వచ్చిన వలస కేసుల కిందనే నమోదు చేశారు. ప్రస్తుతం జిల్లా ఆరెంజ్ జోన్లో కొనసాగుతోంది. దీనిని గ్రీన్‌జోన్‌గా ప్రకటించే అవకాశం ఉంది. ఆదివారం వరకు 10 పాజిటివ్ కేసులుండగా ప్రస్తుతం అవి 17కు చేరాయి.
మండలాల్లో ఆందోళన...
వలస కూలీల ద్వారా కరోనా మహమ్మారి వ్యాపిస్తుండటంతో కాసిపేట, బెల్లంపల్లి, దండేపల్లి, జన్నారం, లక్షెట్టిపేట మండలాల్లోని గ్రామాలలో ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు, వైద్యులు ప్రజలను చైతన్యం చేయడంతోపాటు వలస కూలీలను స్టాంప్ వేసి హోం క్వారంటైన్ చేస్తున్నారు. వారికి అవసరమైన నిత్యావసరాలు, ఇతర సౌకర్యాలను కొందరు దాతలు, ప్రభుత్వాధికారులు ఏర్పాటు చేస్తున్నారు. పై మండలాలలోని గ్రామాలలో ఇంటింటికి సర్వే చేస్తున్నారు.
ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ఇతరులను ప్రవేశించకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దండేపల్లిలో ఐదు వలస కూలీలకు చెందిన పాజిటివ్ కేసులు ఉండగా మొత్తం ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలలోనూ జిల్లా కేంద్రంలోనూ ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. కొన్ని గ్రామాలలో గ్రామ శివారులోని దారులను మూసివేసి బయటకు వెళ్ళకుండా, ఎవరినీ లోనికి రానీయకుండా చర్యలు తీసుకుంటున్నారు.