బీజేపీలో ‘గ్రేటర్‌’ జోష్‌

ABN , First Publish Date - 2020-12-06T04:42:59+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో విజయంతో బీజేపీ నాయకుల్లో జోష్‌ కనిపిస్తోంది.

బీజేపీలో ‘గ్రేటర్‌’ జోష్‌
లోగో

- జిల్లా రాజకీయాల్లో మారనున్న సమీకరణలు

- వరస విజయాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

- ఇతర పార్టీల్లోనూ అంతర్మథనం

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో విజయంతో బీజేపీ నాయకుల్లో  జోష్‌ కనిపిస్తోంది. మొన్న దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల్లో, ఇప్పుడు గ్రేటర్‌ హైదరాబాద్‌లో విజయంతో జిల్లాలో నాయకులు, కార్యకర్తలు జోష్‌తో ఉన్నారు. గతంలో  ఉనికే లేని స్థాయి నుంచి అధికారం కోసం పోటీ పడే స్థాయికి చేరుకుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోనూ రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయే  అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి 2018 రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు రెండు చోట్లా డిపాజిట్లు కోల్పోయి పార్టీ నామ మాత్రంగా మిగిలింది. అయితే అనూహ్యంగా 2019 లో జరిగిన పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగిన సోయం బాబురావ్‌ ఎంపీగా విజయం సాధించి అందరి అంచనాలను తలకిందులు చేశారు. దీంతో జిల్లాలో  బీజేపీ ఉనికిపై నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఏకపక్ష విజయం సాధించడంతో బీజేపీ పాత్ర ప్రశ్నార్థకంగా మిగిలింది. ఈ క్ర మంలో టీఆర్‌ఎస్‌ నాయకత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన దుబ్బాక  అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించడంతో ఆయా పార్టీల నాయకుల్లో ఒక్కసారిగా చలనం వచ్చింది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల తీరుపై అసంతృప్తితో ఉన్న నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు తమ క్యాడర్‌తో  చర్చలు ప్రారంభించారు. అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉం డడంతో పాటు కేవలం ఒకటి, రెండు చోట్ల ఫలితాలను ప్రామాణికంగా తీసుకొని నిర్ణయం తీసుకుంటే ఏంటన్న విషయం పై పునరాలోచనలో పడిపోయారు. కాగా కొంతమంది నేతలు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల సరళిని బట్టి నిర్ణయం తీసుకోవాలని వేచి ఉన్నారు. తాజాగా బీజేపీ ఈ ఎన్నికల్లో సత్తా చాటడంతో ఇక నేడో రేపో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే అసిఫాబాద్‌ నియోజక వర్గంలోని ఏజెన్సీ మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు బీజేపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. వీరిలో కొందరు మొదటినుంచి కాంగ్రెస్‌ పార్టీకి వీర విధేయులుగా వ్యవ హరించినవారే ఉన్నారు.  అటు సిర్పూర్‌ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లలో ఉన్న కొంతమందితో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కూడా బీజేపీలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఇక్కడ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారో చూశాకే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో..

శాసన సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్లు గడువు ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీల సమీకరణలు మారుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో  బీజీపీ తరుపున బరిలోకి దిగాలన్న యోచనలో ఉన్న పలువురు ఆశావహులు పావులు కదుపుతున్నారు. జిల్లాలో ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాలు ఉన్నాయి.  ఆసిఫాబాద్‌ గిరిజనులకు రిజర్వ్‌ కాగా సిర్పూర్‌ జనరల్‌ కేటగిరికి కొనసాగుతోంది. నియోజక వర్గాల పునర్విభజన జరగకుండానే ఎన్నికలు 2022లోనే జరుగుతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆశావహులు పార్టీల ఫిరాయింపుదారులు కూడా అగ్ర నాయకులతో టచ్‌లో ఉంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకోగా ఆయన ఆసిఫాబాద్‌ నుంచి బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. అలాగే ఎంపీ సోయం బాబురావ్‌కు సమీప బంధువైన తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ జన సమితి అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయిన కొట్నాక విజయ్‌ కూడా బీజేపీ చేరి టికెట్‌ కోసం పట్టు బడుతున్నారని చెబుతున్నారు. 

Updated Date - 2020-12-06T04:42:59+05:30 IST