హత్య కేసును ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2020-12-31T04:37:55+05:30 IST

ఈనెల 19న హట్టి ఘాట్‌ రోడ్డు లోయలో జరిగిన టేకం శ్రీనివాస్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు.

హత్య కేసును ఛేదించిన పోలీసులు
వివరాలు వెల్లడిస్తున్న సీఐ సుధాకర్‌

కెరమెరి, డిసెంబరు30: ఈనెల 19న హట్టి ఘాట్‌ రోడ్డు లోయలో జరిగిన టేకం శ్రీనివాస్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం నిందితుడు భూత పోచయ్య లొంగిపోవడంతో హత్య కేసు వివరాలను సీఐ సుధాకర్‌ మీడియాకు వెల్లడించారు. బాబేఝరి నాయకపుగూడ గ్రామానికి చెందిన టేకం శ్రీనివాస్‌ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఈనెల 19న అదే గ్రామానికి చెందిన భూత పోచ య్యతో కలిసి కెరమెరికి వచ్చి మద్యం సేవించారు. తిరుగు ప్రయా ణంలో భూత పోచయ్య తాను ఆటో నడుపుతానని ఇవ్వాలని శ్రీనివాస్‌ను కోరాడు. అందుకు శ్రీనివాస్‌ ఒప్పుకోక పోవడంతో హట్టి ఘాట్‌ రోడ్డులో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. మద్యం మత్తులో ఉన్న పోచయ్య క్షణికావేశానికి లోనై శ్రీనివాస్‌ తలపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న రుమాలుతో చేతులు కట్టేసి లోయలో కనిపించకుండా శ్రీనివాస్‌ మృతదేహాన్ని పడేసి తిరిగి వెళ్లాడు. దీంతో  పోచయ్యను శ్రీనివాస్‌ గురించి మృతుడి బావమరిది  ప్రశ్నించగా హట్టి ఘాట్‌ రోడ్డులో ఉన్నాడని చెప్పాడు. అదేరోజు రాత్రి ద్విచక్ర వాహనంపై వచ్చి హట్టి వద్ద చూడగా శ్రీనివాస్‌ కనిపించక పోవడంతో 20వ తేదీన పోచయ్యను నిలదీశాడు. దీంతో సంఘటన స్థలానికి వచ్చి మృతదేహం వద్దకు కుటుంబ సభ్యులను తీసుకెళ్లిన అక్కడి నుంచి పోచయ్య పారిపోయాడు. పోలీసుల విచారణలో  శ్రీనివాస్‌ను తానే హత్య చేసినట్లు చెప్పడంతో నిందిడుతు పోచయ్యను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ వెంట ఎస్సై ఎల్పుల రమేష్‌ ఉన్నారు. 

Updated Date - 2020-12-31T04:37:55+05:30 IST