పట్టణ సుందరీకరణకు ప్రణాళిక
ABN , First Publish Date - 2020-06-16T10:46:27+05:30 IST
మంచిర్యాల మున్సి పాలిటీ అభివృద్ధికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు

పార్కుల అభివృద్ధికి చర్యలు
ట్రాఫిక్ నియంత్రణకు ఐలండ్ ల ఏర్పాటు
పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్
విడుదలైన నిధులు
మంచిర్యాల టౌన్, జూన్ 15: మంచిర్యాల మున్సి పాలిటీ అభివృద్ధికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ నాటి నుంచి ఇక్కడి యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అభివృద్ధికి దృష్టి సారిస్తున్నారు. వర్తక, వాణిజ్య కేంద్రంగా మం చిర్యాలకు గుర్తింపు ఉంది. కలెక్టర్ భారతీ హోళికేరి ప్రత్యేక చొరవ తీసుకొని అభివృద్ధికి పెద్దపీట వేస్తుండటంతో పట్టణ రూపురేఖలు మారనున్నాయి. ఇందులో భాగంగా పార్కుల అభివృద్ధి, ట్రాఫిక్ ఐలాండ్‌ల ఏర్పాటు, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం చేపట్టనున్నారు.
సుందరీకరణకు ప్రత్యేక చర్యలు..
మున్సిపాలిటీ పరిధిలోకి ప్రవేశించే రహదారులైన ఏసీసీ, తోళ్లవాగు, వేంపల్లి వద్ద స్వాగత తోరణాలు నిర్మించనున్నారు. ఒక్కొక్క స్వాగత తోరణానికి రూ. 15 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. అలాగే రూ. 30 లక్షలతో పట్టణంలో మూడు చోట్ల బస్ బేలు ఏర్పాటు చేయనున్నారు. రహదారుల మధ్య డివైడర్లలో పచ్చదనం పెం పొందించేందుకు రూ.50 లక్షలతో పనులు చేపట్టనున్నారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జికి కలరింగ్ చేయడంతోపాటు మెయిన్ రోడ్డులో విద్యుద్దీకరణ ఏర్పాటు చేస్తారు.
పారిశుధ్య పనుల్లో భాగంగా మున్సిపాలిటీ డంప్‌యార్డుకు బయో ఫెన్సింగ్ ఏర్పాట్లతో పాటు చెత్త సేకరణకు ప్రత్యే క వాహనాలు, వాటి మరమ్మతులు, మెటీరియల్ రికవరీకి ఒకేచోట ఏర్పాట్లు చేయడం ద్వారా ఎక్కడ పడితే అక్కడ పనులు చేయకుండా చర్యలు చేపట్టనున్నారు. చెత్త తరలించేందుకు ప్రత్యేకంగా ఒక లారీ, 5 ట్రాక్టర్లు, 100 త్రీవీలర్ ట్రాలీ రిక్షాలతోపాటు ప్రతి 400 ఇండ్లకు ఒక చెత్త తరలించే ఆటో కొనుగోలు చేయనున్నారు. ఈ నెల 20 నుంచి చేపట్టనున్న హరితహారంలో భాగంగా రూ. 3 కోట్లు వెచ్చించి మున్సిపాలిటీలో లక్షా 87 వేల 600 మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
పార్కులు, రోడ్ల అభివృద్ధికి..
మున్సిపాలిటీ పరిధిలో ఎంపిక చేసిన చెరువు పార్కులు, రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు. రాముని చెరువు పార్కు అభివృద్ధికి రూ. 3 కోట్ల 50 లక్షలు, పోచమ్మ చెరువుకు రూ. 50 లక్షలు కేటాయించారు. పార్కుల్లో ప్రజలకు అవసరమైన బల్లలు, ఇతర సౌకర్యాలు కల్పించి ఆహ్లాదకర వాతావరణం ఉండే విధంగా తీర్చిదిద్దనున్నారు. రాముని చెరువులో బోటింగ్ ఏర్పాటు చేయనున్నారు. రూ. కోటి 50 లక్షలతో జంతు వధశాల నిర్మాణం, రూ. 3 కోట్లతో మురుగునీటి శుద్ది కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ట్రాఫిక్ నియంత్రణకు..
పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా బెల్లంపల్లి చౌరస్తా నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు బైపాస్ రోడ్డులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం రూ. 50 లక్షలు కేటాయించారు. మేదరివాడ వద్ద ట్రాఫిక్ ఐలండ్ ఏర్పాటుకు రూ. 45 లక్షలు కేటాయించారు. బెల్లంపల్లి చౌరస్తాలో రూ. 1 కోటి 50 లక్షలతో క్లాక్ టవర్ నిర్మాణంతోపాటు జంక్షన్ ఏర్పాటు చేయనున్నారు. పట్టణంలో ప్రధాన రోడ్లపై రద్దీని నియంత్రించేందుకు చున్నంబట్టి వాడ రూ. 2 కోట్లతో 100 ఫీట్ల బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయనున్నారు.
పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి..
మున్సిపాలిటీ పరిధిలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో జనాభా ప్రాతిపదికన మొత్తం 49 పబ్లిక్ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 38 టాయిలెట్ల నిర్మాణం పూర్తయింది. ఇందులో పురుషులకు 22, మహిళకు 16 పూర్తి చేయగా మరో 10 టాయిలెట్ల నిర్మాణం త్వరలో చేపట్టనున్నారు. ఇందు కోసం స్థలాలు ఎంపిక చేసే పనిలో మున్సిపల్ యంత్రాంగం నిమగ్నమైంది. వినియోగంలో లేని పబ్లిక్ టాయిలెట్లకు మరమ్మతు చేపట్టడం ద్వారా ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టనున్నారు.