ఇంకెన్నాళ్లీ కష్టాలు
ABN , First Publish Date - 2020-10-04T09:50:14+05:30 IST
ఆసిఫాబాద్ మండలంలోని అనేక గ్రామాల్లో నేటికీ వాగులపై వంతెనలు, రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వాగులపై వంతెనలు లేక ఇక్కట్లు
అత్యవసర సమయాల్లో ప్రాణాలు కోల్పోతున్న బాధితులు
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
ఆసిఫాబాద్ రూరల్, అక్టోబరు3: ఆసిఫాబాద్ మండలంలోని అనేక గ్రామాల్లో నేటికీ వాగులపై వంతెనలు, రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అప్పపల్లి, రౌటసంకెపల్లి, టెమ్రన్ మోవాడ్ తదితర గ్రామాలకు రోడ్లు, వంతెనలు లేవు. అత్యవసర సమయాల్లో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా శుక్రవారం రౌటసంకెపల్లి గ్రామానికి చెందిన రాణి అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా గ్రామం నుంచి ప్రధాన రహదారి వరకు 108 అంబులెన్స్ రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆమెను ఎడ్లబండిపై ప్రధాన రహ దారి వరకు తీసుకు రాగా పురిటినొప్పులు అధికమై మృతశిశువుకు జన్మనిచ్చింది. గత ఏడాది సైతం రౌటసంకెపల్లి గ్రామానికి చెందిన మహిళకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి మారుమూల గ్రామాలకు వంతెనలు, రోడ్లు నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
అడ్డంకిగా మారిన అటవీ అనుమతులు
బెజ్జూరు: బెజ్జూరు మండలం సోమిని, కుశ్నపల్లి గ్రామాల మధ్య ఒర్రెపై, సులుగుపల్లి సమీపంలోని తీగల ఒర్రెపై, చిన్న సిద్దాపూర్ ఒర్రెపై వంతెనలు లేక వర్షాకాలంలో ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ముఖ్యంగా కుశ్నపల్లి, సోమిని గ్రామాల మధ్య హైలెవల్ వంతెనలు, రోడ్డు నిర్మాణాల కోసం నిధులు మంజూరైనప్పటికీ అటవీ అనుమతులు అడ్డంగా మారాయి. చిన్న సిద్దాపూర్ వాగుపై గతేడాది వంతెన నిర్మాణానికి మూడు కోట్లు మంజూరైనప్పటికీ పనులు ఆలస్యమవుతున్నాయి. గతేడాది వర్షాకాలంలో వాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు చెందిన గర్భిణులు ప్రసవం కోసం ఆసుపత్రులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వంతెనలను నిర్మించాలి -బోగ జీవన్, సోమిని
గ్రామాల్లో వంతెనల నిర్మాణం త్వరగా చేపట్టాలి. వర్షాకాలంలో వాగులు దాటలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా గర్భిణులు ప్రసవం కోసం వాగులు దాటలేక ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. అధికారులు సత్వరమే స్పందించి వాగులపై వంతెనలు నిర్మించాలి.
ఎడ్లబండ్లే దిక్కు
తిర్యాణి: తిర్యాణి మండలంలోని మంగి, గుండాల, కౌటగాం, కేరేగూడ, మొర్రిగూడ, లోయ, కోయతలండి, అమీన్‌గూడ, డోంగర్‌గాం లాంటి అతి మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ వాగులపై వంతెనలు లేవు. దీంతో వర్షాకాలం అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక పలువురు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలున్నాయి. గత సంవత్సరం కౌటగాం గ్రామానికి చెందిన గిరిజనుడు అనారోగ్యంతో చికిత్స కోసం వాగు దాటుతూ బురదరోడ్డులో ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అత్యవసర సమయాల్లో 108అంబులెన్స్ కూడా ఈ గ్రామాలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొ న్నాయి. దీంతో ఎడ్లబండ్లపై ప్రయాణం గర్భిణులు, రోగుల ప్రాణాల మీదకు వస్తోందని పలువురు ఆదివాసీ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో వాగు దాటలేక అమీన్‌గూడ గ్రామస్థులు ఓటు వేయలేని పరిస్థితి నెలకొంది. అలాగే ఎన్నికల విధులకు వెళ్లిన ఓ అధికారి మాణిక్యాపూర్ లోలెవల్ వంతెన వద్ద కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. వర్షాకాలంలోనైతే గిరిజనులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రేషన్ సరుకుల కోసం కిలో మీటర్ల దూరంలో కాలినడకన వెళ్లి సరుకులను తెచ్చుకుంటున్నారు.
108 అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి
కెరమెరి: మండలంలోని అనార్‌పల్లి, లక్మాపూర్, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలైన పరందోళి, అంతా పూర్, నాగల్‌గొంది, కర్పెతగూడ గ్రామాలకు వెళ్లేందుకు వాగులపై వంతెనలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నాగులుగొంది, కర్పెత గూడ, లక్మాపూర్ తదితర గ్రామాలకు వర్షాకాలంలో 108అంబులెన్స్‌లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.