పనులు సరే...నిధులేవి..!

ABN , First Publish Date - 2020-12-12T04:15:34+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పథ కం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. పనులను త్వరితగతిన చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభు త్వం ఆ మేరకు నిధులు విడుదల చేయకపోవడంతో సర్పంచులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

పనులు సరే...నిధులేవి..!
కాసిపేట మండలంలో పూర్తయిన వైకుంఠధామం

పల్లె ప్రగతి పనుల బిల్లులు మంజూరులో తీవ్ర జాప్యం

90 శాతం పనులు పూర్తి చేసినా బ్యాంకులో జమకాని నిధులు

పనులు పూర్తి చేయాలంటూ సర్పంచులపై అధికారుల ఒత్తిడి

జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయల పెండింగ్‌

బిల్లుల కోసం అదనపు కలెక్టర్‌కు మహిళా సర్పంచ్‌ లేఖ

మంచిర్యాల, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పథ కం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. పనులను త్వరితగతిన చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభు త్వం ఆ మేరకు నిధులు విడుదల చేయకపోవడంతో సర్పంచులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పథ కంలో భాగంగా గ్రామాల్లో వైకుంఠధామం, కంపోస్ట్‌ షెడ్‌ (డంపింగ్‌ యార్డు), పల్లె ప్రకృతి వనాల నిర్మా ణం చేపట్టాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు  ఆయా గ్రామాల సర్పంచులకు బాధ్యతలు అప్పగిం చింది. ఆయా పనులు చేపట్టేందుకు అవసరమైన స్థలాల ఎంపికతోపాటు నిర్మాణ పనులు కూడా సర్పంచులు చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. స్థలాలను సేకరించడం వరకు బాగానే ఉన్నా నిర్మాణ పనుల కారణంగానే సర్పంచులు భారంగా భావిస్తు న్నారు. నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అప్పులు తెచ్చి మరీ పనులు చేపట్టవలసి వస్తోందని వాపోతున్నారు. పనులు పూర్తి చేసిన తరువాత కూడా బిల్లులు చెల్లిం చకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయి మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ విషయమై కొందరు సర్పంచులు జిల్లా ఉన్నతాధికారులను నిలదీసే పరి స్థితి రావడం గమనార్హం. 


షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్న అధికారులు

పనులు పూర్తిచేయని సర్పంచులకు జిల్లా ఉన్నతా ధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తూ వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారు. జిల్లా స్థాయి సమీక్షా సమావేశాల్లో పనులు పూర్తి చేయని సర్పంచులను అధికారులు నిలదీస్తూ, నోటీసులు జారీ చేయడం ద్వారా ఒత్తిడి పెంచుతున్నారు. అయితే పనులు పూర్త యిన వరకైనా బిల్లులు చెల్లించనిదే పెట్టుబడులు ఎక్కడి నుంచి పెట్టాలని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల పనులు పూర్తయినా కూడా బిల్లులు చెల్లించడం లేదని వాపోతున్నారు. పనులు చేపట్టాలని ఓ వైపు ఉన్నతాధికారులు, బిల్లులు చెల్లిం చాలని సర్పంచుల ఒత్తిళ్ల కారణంగా పంచాయతీరాజ్‌ ఉద్యోగులు కూడా మనోవేదనకు గురవుతున్నట్లు సమాచారం. 


జిల్లాలో పనుల పురోగతి...

జిల్లాలో 311 గ్రామ పంచాయతీలకుగాను 52 గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించేందుకు అధికారు లు ప్రణాళికలు తయారుచేశారు. ఒక్కో వైకుంఠధా మం నిర్మాణానికి సుమారు రూ. 11 లక్షల పై చిలుకు అంచనాతో పనులు చేపట్టారు. హాజీపూర్‌ మండలం లో 4 వైకుంఠధామాల నిర్మాణం చేపట్టగా రూ. 46.34 లక్షలు మంజూరు చేశారు. జైపూర్‌లో 3 పనులకు సంబంధించి రూ.35.83 లక్షలు, జన్నారంలో 4 పనుల కు రూ.45.64 లక్షలు, కోటపల్లిలో 3 పనులకుగాను రూ.36.17 లక్షలు, వేమనపల్లిలో 3 పనులకుగాను రూ.35.01 లక్షలు, దండేపల్లిలో 4 పనులకు రూ.43.67 లక్షలు, చెన్నూరులో 4 పనులకు రూ.44.68 లక్షలు, ల క్షెట్టిపేటలో 2 పనులకు రూ.21.15 లక్షలు, మందమర్రి లో 4 పనులకు రూ.46.41 లక్షలు, బెల్లంపల్లిలో 7 ప నులకు రూ.83.31 లక్షలు, నెన్నెలలో 4 పనులకు రూ.49.2 లక్షలు, తాండూరులో 5 పనులకు రూ. 61.2 లక్షలు, కాసిపేటలో 4 పనులకు రూ.45.79 లక్షలు, బీమారం మండలంలో ఒక వైకుంఠధామం నిర్మాణా నికి రూ.12.3 లక్షలు కేటాయించారు. వీటిలో ఇప్పటి వరకు రూ.1కోటి 81 లక్షల 57వేల విలువగల పనులు పూర్తికాగా, రూ.1 కోటి 27లక్షల 21వేల విలువగల మరో 33 పనులు కొనసాగుతున్నాయి. కంపోస్ట్‌ షెడ్‌లకు సంబంధించి మొత్తం 311 పనులు చేపట్ట నుండగా రూ.7 కోట్ల 87 లక్షల 57వేల అంచనా వ్య యం రూపొందించారు. వీటిలో ఇప్పటి వరకు రూ.6 కోట్ల 14 లక్షల 22వేల విలువగల 264 పనులు పూర్తికాగా మరో రూ.39.36 లక్షల విలువగల 47 పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తయి నెల లు గడుస్తున్నా ఇంత వరకు బిల్లులు చెల్లించలేదని సర్పంచులు తెలిపారు. 


బిల్లుల కోసం సర్పంచు లేఖ...

అభివృద్ధి పనులకు సంబంధించి తనకు మొత్తం రూ.27 లక్షల రూపాయలు రావాల్సి ఉందని, వెంటనే బిల్లులు చెల్లించాలని చెన్నూరు మండలం సోమనప ల్లి సర్పంచు బీముని శారద లెటర్‌ హెడ్‌పై జిల్లా అదనపు కలెక్టర్‌ పేరిట ఈ నెల 3న లేఖ రాశారు.  ఇప్పటి వరకు 90 శాతం పనులు పూర్తి చేశానని, తనకు రావాల్సిన మొత్తం సొమ్మును చెల్లించిన తరు వాత మిగతా 10 శాతం పనులు పూర్తి చేస్తానని  లేఖలో పేర్కొన్నారు. మిగతా పనులు పూర్తి చేయని పక్షంలో తనపై చట్టపమైన చర్యలు తీసుకోవడంతో పాటు తనను పదవి నుంచి తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. తనకు బిల్లులు చెల్లించడం ద్వారా సహా య సహకారాలు అందించి, గ్రామ పంచాయతీ అభి వృద్ది జరిగేలా అవకాశం ఇవ్వాలని విన్నివించారు. దీన్ని బట్టి బిల్లుల కోసం సర్పంచులు ఎంత మదనప డుతున్నారో అర్ధమవుతోంది.


బిల్లులు చెల్లిస్తలేరు....

వేముల కృష్ణ, సర్పంచు, పెద్దనపల్లి 

కంపోస్ట్‌ షెడ్డు నిర్మాణం పూర్తిచేసి నాలుగు నెలలు కావస్తోంది. పనుల కింద రావలసిన రూ.2 లక్షల 50వేలు ఇంత వరకు చెల్లించలేదు. అలాగే రూ.12 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన వైకంఠధామం పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయి. పనుల పురోగతిని బట్టి దశల వారీగా డబ్బులు రావలసి ఉం డగా, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లిం చలేదు. సంబంధిత అధికారులను నిలదీస్తే రూ.2 లక్షలు బ్యాంకులో జమ చేశామని అంటున్నారు. అయితే అకౌంట్‌లు జమ అయినట్లు బ్యాంకు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఇప్పటికైనా బిల్లులు చెల్లించాలి. 


జూలై నుంచి పెండింగ్‌లో ఉన్నాయి....

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి

జిల్లాలో మంజూరైన పనులకు సంబంధించి జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖల ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యం లో వైకుంఠధామాలు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాం. వీటిలో అధిక శాతం పనులు ఆరు నెలల కిందటనే పూర్తికాగా జూలై నుంచి బిల్లులు పెండిం గులో ఉన్నాయి. వైకుంఠధామాలకు సంబంధించి రూ.3 కోట్లు బకాయి ఉండగా, ఇంకుడు గుంతలకు సంబంధించి సుమారు రూ.7 నుంచి 8 కోట్ల మేర నిధులు విడుదల కావాల్సి ఉంది. అలాగే కంపోస్ట్‌ షెడ్డులకు సంబంధించి రూ.7 కోట్ల 37వేలు బకాయిలో ఉన్నట్లు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-12-12T04:15:34+05:30 IST