కింగ్ మేకర్లు.. ప్రభుత్వ కార్యాలయాల్లో వారిదే హవా..!
ABN , First Publish Date - 2020-03-16T08:37:42+05:30 IST
జిల్లాలోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హవా నడుస్తోంది. చిన్న చిన్న పనుల నుంచి అతి ముఖ్యమైన పనుల వరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే చేసి పెడుతున్నట్లు సమాచారం.
అన్నింట్లో తామే అంటున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
కీలక రికార్డులూ వారి ఆధీనంలోనే
గతంలో దొంగ పట్టాలు జారీ చేసిన ఘటనలు
గత అనుభవంతో కళ్లు తెరవని అధికారులు
మంచిర్యాల టౌన్, మార్చి 15: జిల్లాలోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హవా నడుస్తోంది. చిన్న చిన్న పనుల నుంచి అతి ముఖ్యమైన పనుల వరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే చేసి పెడుతున్నట్లు సమాచారం. తహసీల్దార్ ఆఫీసు మొదలుకొని కలెక్టరేట్ వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ స్థాయికి మించి పనుల్లో కలగ జేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన కార్యాలయాల్లో 400 నుంచి 500 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో అధిక శాతం రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖ, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, తదితర శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మిగతా కార్యాలయాల్లో సైతం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా, వీరి సంఖ్య నామ మాత్రంగానే ఉంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మ్యాన్ పవర్ తక్కువగా ఉండటంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఆధారపడక తప్పడం లేదు. కొన్ని శాఖల్లో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలను సైతం తిరిగి ఔట్ సోర్సింగ్ విధానంలో వినియోగించుకుంటున్నారు.
కీలక రికార్డులూ వారి చేతుల్లోనే...?
కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని కీలక రికార్డులతోపాటు ముఖ్య అధికారి డోంగల్ (డిజిటల్ సంతకం) ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను మచ్చిక చేసుకుంటున్న కొందరు అక్రమ మార్గంలో వారి పనులు చక్కబెట్టుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కారణంగా నకిలీ ఆన్‌లైన్ పట్టాలు వ్యవహారం బయటపడింది. గర్మిళ్ల శివారులో గల సర్వే నెంబర్ 324లోని మూడెకరాల ప్రభుత్వ భూమిని తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అక్రమంగా బాలయ్య అనే వ్యక్తి పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేసి పహాణీ జారీ చేశాడు. సర్వే నెంబర్ 345లో రెండెకరాలను మల్లేశం పేరిట, 6. 20 ఎకరాలను లింగయ్య పేరిట, మరో మూడెకరాలను సారయ్య పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేశాడు. ఇందుకోసం అప్పటి తహసీల్దార్ సదానందం డొంగల్‌ను దుర్వినియోగం చేశాడు. సమాచారం అందుకున్న అప్పటి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ 2017 జూలై 6న రికార్డులు పరిశీలించి నకిలీ పట్టాలు జారీ అయినట్లు నిర్ధారించారు.
ఆర్డర్లపై ఇనీషియల్ వారిదే...
అధికారులు జారీ చేసే వివిధ ఆర్డర్లపై ఇనీషియల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే చేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులు ధ్రువీకరిస్తేనే సంబంధిత అధికారులు వాటిపై సంతకాలు చేసి, ఆర్డర్లు, వివిధ రకాల సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇనీషియల్ ఆధారంగానే ఆర్డర్లు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఆయా కార్యాలయాల నుంచి ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు జారీ అయ్యే ముఖ్యమైన ఆర్డర్లపై ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఇనీషియల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏదైనా పొరపాటు జరిగి తప్పుడు ఆర్డర్లు జారీ అయిన పక్షంలో బాధ్యులు ఎవరనే ప్రశ్నలు తలెత్తున్నాయి.
అభాసుపాలవుతున్న వ్యవస్థ...
కొందరు ఉద్యోగుల కారణంగా మొత్తం ఔట్ సోర్సింగ్ వ్యవస్థనే అభాసు పాలవుతోంది. నెలకు రూ. 10 నుంచి 15 వేలు పొందే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కుటుంబ పోషణ భారమే. అయితే అక్రమ సంపాదనే ధ్యేయంగా ఉద్యోగంలో చేరుతున్న కొందరు గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాలు చక్క బెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో కొందరు అక్రమ సంపాదనకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి వల్ల రెవెన్యూ వ్యవస్థ అభాసుపాలు అవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖలో అవినీతి హెచ్చు మీరిందని, ఏకంగా ఆ వ్యవస్థనే రద్దు చేస్తానని పలుమార్లు స్పష్టం చేశారు. అయినా ముఖ్యమైన విభాగాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగిస్తున్న అధికారుల తీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
భూ సేకరణకు వాళ్లే....
భూ సేకరణ సైతం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే చేస్తున్నట్లు సమాచారం. భూ సేకరణకు సంబంధించి అవార్డుల పంపిణీ, చెక్కుల వివరాలు ఫైళ్లు తయారు చేసేది కూడా వాళ్లే. భూ సేకరణ విషయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తయారు చేసే రిపోర్టు ఆధారంగానే అధికారులు ముందుకు సాగుతున్నట్లు తెలిసింది. అలాగే మంచిర్యాల - ఆసిఫాబాద్ నాలుగు లేన్ల రహదారి కోసం అవసరమైన భూ సేకరణ రిటైర్డ్ అధికారులే చేస్తున్నట్లు సమాచారం.
కీలక ఫైళ్లకు రెక్కలు....
ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు భూ సేకరణకు సంబంధించిన కొన్ని కీలక ఫైళ్లు కనపడకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న నాలుగు ఫైళ్లు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు నాలుగు నెలల క్రితం ఫైళ్లు కార్యాలయం నుంచి బయటికి వెళ్లిన విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో తెల్లవారే లోపే ఫైళ్లు తిరిగి యథాస్థానంలోకి వచ్చినట్లు తెలిసింది.