చిగురిస్తున్న ఆశలు
ABN , First Publish Date - 2020-05-18T10:32:29+05:30 IST
ఆరేంజ్ జోన్‌లో ఉన్న జిల్లాలో 23 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాకపోవడంతో గ్రీన్ జోన్‌లోకి మారనుంది.

గ్రీన్ జోన్ దిశగా జిల్లా పయనం
23 రోజులుగా నమోదు కాని కేసులు
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అధికార యంత్రాంగం చర్యలు
జైనూరులో కొనసాగుతున్న కట్టడి
74 బృందాలతో ఇంటింటి సర్వే
జిల్లాకు కొవిడ్-19 ల్యాబ్ మంజూరు
ఆసిఫాబాద్, మే17: ఆరేంజ్ జోన్‌లో ఉన్న జిల్లాలో 23 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాకపోవడంతో గ్రీన్ జోన్‌లోకి మారనుంది. జిల్లాలోని ఏడుగురు కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాను ఆరేంజ్ జోన్ నుంచి గ్రీన్ జోన్‌లోకి మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో జిల్లాలో అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ మినహా ఇతర వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి.
పూర్తిగా కోలుకున్న కరోనా బాధితులు
జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన జైనూరు, సిర్పూర్(యూ) మండలాల్లో ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు బాధితులను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్సనందించగా ఏడుగురు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో జిల్లాలో 23 రోజుల నుంచి ఏ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కుంరం బాలు నేతృత్వంలో ఏజెన్సీ మండలాల్లో 74 బృందాలతో ఇంటింటి సర్వే చేపడుతున్నారు. వైరస్‌ను అరికట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. రెబ్బెన, వాంకిడి, రాశిమెట్ట క్వారంటైన్ కేంద్రాల్లో ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. గుంటూరు నుంచి వచ్చిన వలస కూలీలు 11 మంది మాత్రమే ఆసిఫాబాద్ కార్వంటైన్‌లో ఉన్నారు.
సరిహద్దుల్లో కట్టుదిట్టం
జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. జైనూరు మండలంలో నిరం తరం వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపడుతూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జైనూరు మండలం జంగాం, వాంకిడి మండలం గోయగాం వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కాగజ్‌నగర్ మండలం వంజీరి వద్ద ప్రత్యేక చెక్ పోస్టును ఏర్పాటు చేసి వచ్చి వాహనదారులకు స్ర్కీనింగ్ టెస్టులు నిర్వహించి అనుమానితులను ఆసిఫాబాద్ క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.
త్వరలో అందుబాటులోకి ల్యాబ్ సేవలు
జిల్లా కేంద్రంలో కొవిడ్-19 ల్యాబ్ మంజూరైనట్లు డీఎంహెచ్‌ఓ కుంరం బాలు పేర్కొన్నారు. ఇందుకోసం ఒక వైద్యాధికారి, ముగ్గురు ల్యాబ్ అసిస్టెంట్లు కరోనా పరీక్షలకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో జిల్లాలో కరోనా ల్యాబ్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతాలకు వెళ్లడం అవసరం లేకుండా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను జిల్లా కేంద్రంలోనే చేపట్టేందుకు ఈ ల్యాబ్ ఉప యోగపడుతుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విధిగా మాస్కులు ధరించి భౌతిక దైరం పాటించాలని సూచించారు.