అయ్యో.. సారూ!
ABN , First Publish Date - 2020-09-20T07:58:43+05:30 IST
కరోనా ప్రభావంతో ఈ యేడు విద్యా సంవత్సరం మూడు మాసాలు ఆలస్యంగా ప్రారంభమైన ఇంకా విద్యావలంటీర్లు విధులకు దూరంగానే ఉంటున్నారు...

ప్రారంభమైన విద్యా సంవత్సరం
విధులకు దూరమైన విద్యా వలంటీర్లు
రెన్యూవల్ కోసం తప్పని ఎదురుచూపులు
కుటుంబ పోషణ కోస తప్పని కూలీ పనులు
అగమ్యఘోచరంగా మారిన వీవీల పరిస్థితి
గతేడాది విధులు నిర్వర్తించిన 417 మంది విద్యా వలంటీర్లు
ఆదిలాబాద్, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావంతో ఈ యేడు విద్యా సంవత్సరం మూడు మాసాలు ఆలస్యంగా ప్రారంభమైన ఇంకా విద్యావలంటీర్లు విధులకు దూరంగానే ఉంటున్నారు. పాఠశాల లు ప్రారంభమై 20రోజులు గడుస్తున్నా.. వీవీల కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం వెల్లడించడమే లేదు. అయితే ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యావలంటీర్లు విధులు లేక కుటుం బ పోషణ కోసం ఇతరాత్ర పనులు చేస్తూ పడరాని పాట్లు పడుతున్నారు. గత ఆరుమాసాలుగా వేతనాలు అందక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తితో పాఠశాలలు మూతబడిన మార్చి 22నుంచి వీవీలు ఇంటికే పరిమితమయ్యారు. పని చేస్తేనే పొట్టగడవని వీవీల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారింది. ఇప్పటికే కొందరు వ్యవసాయం, ఇతర వృత్తుల్లో పనులు చేస్తుండగా.. ఎలాంటి ఇతర పనుల పరిజ్ఞానం లేని వీవీలు ఖాళీగానే కనిపిస్తున్నా రు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆగస్టు 27నుంచి విధుల్లోకి చేరినా.. వీవీలను దూరంపెట్టడంపై ఆందోళనకు గురవుతున్నారు. గతేడు జిల్లాలో 417 మంది విద్యావలంటీ ర్లు విధులు నిర్వహించా రు. రెగ్యూలర్ పోస్టులు భర్తీ కావడంతో ఈ యేడు దాదాపుగా సగాని కి పైగా వీవీలను తొలగిం చే అవకాశం కనిపిస్తుం ది. అయితే, దీనికి సంబం ధించి ఇప్పటి వరకు ప్రభు త్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వక పోవడం తో అసలు విద్యావలంటరీ వ్యవస్థ ఉంటుందా? ఊడుతుందా? అనే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.
ఆన్లైన్ నేపథ్యంలో తగ్గిన ప్రాధాన్యత
కరోనా వైరస్ వ్యాప్తితో నేరుగా పాఠాలు బోధించే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 1నుంచి ఆన్లైన్ తరగతులను ప్రారంభించింది. దీంతో వీవీల ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకే పనిలేకుండా పోవడంతో వీవీల గురించి పట్టించుకునే పరిస్థితే కనిపించడం లేదు. జిల్లాలో వందకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు వీవీలతోనే కొనసాగుతున్నాయి. ఆన్లైన్ తరగతులు ప్రారంభవవడం తో సమీప పాఠశాలల నుంచే మరో ఉపాధ్యాయున్ని సర్దుబాటు చేసి తరగతులను నిర్వహిస్తున్నారు. దీంతో వీవీల అవసరం ఏర్పడక పోవడంతోనే ప్రభుత్వం అంతగా స్పందించడం లేదని తెలుస్తుంది.
వీవీల రెన్యూవల్ అనుమానమే..
ఈయేడు విద్యావలంటీర్లను రెన్యూవల్ చేయడం అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ప్రతియేటా వీరిని జూన్‌లో విధుల్లోకి తీసుకొ ని ఏప్రిల్ వరకు కొనసాగిస్తారు. కాని ఈసారి కరోనా వైరస్ ప్రభావం తో సెప్టెంబరు 1నుంచి పాఠశాలలను ప్రారంభించారు. అయినా నేరు గా కాకుండా ఆన్లైన్ తరగతులను ప్రారంభించడంతో ఉపాధ్యాయుల అవసరం అంతగా ఉండడం లేదు. దీంతో ప్రభుత్వమే నేరుగా టీ శాట్, దూరదర్శన్ల ద్వారా పాఠశాలను బోధిస్తుంది. వారిని పర్యవేక్షణ చేయడమే ప్రభుత్వ ఉపాధ్యాయుల పనిగా మారింది. అలా గే దాదాపుగా జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కావడంతో వీవీల అవసరం అంతగా ఉండకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విధులు లేకపోవడంతో కూలీ పనులకు..
లాక్డౌన్ సమయంలో ఉపాధి పనులతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన విద్యా వలంటీర్లు పాఠశాలలు ప్రారంభమెనా విధులు లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో తాము కూలీ పనులు చేయక తప్పడం లేదంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వీవీలు సొంత వ్యవసాయ పనులు, ఇతర కూలీ పనులు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లోని విద్యావలంటీర్లు వ్యాపార రంగంలో పనిచేస్తూ కాలం గడుపుతున్నారు. ఇన్నాళ్లు పాఠశాలల్లో అందరితో సార్ అని పిలిపించుకున్న వీవీలు.. ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో పని చేస్తున్నారు. కొందరైతే ఆటో డ్రైవర్లుగా పని చేస్తూ వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ప్రస్థుతం ఎవరిని కదిలించిన గతిలేని పరిస్థితుల్లోనే కూలీ పనులు చేయాల్సి వస్తోందని ఆవేదన వెల్లబోసుకుంటున్నారు.
కొనసాగింపుపై ప్రభుత్వ ఆదేశాలు అందాల్సి ఉంది..
- రవీందర్‌రెడ్డి, డీఈవో, ఆదిలాబాద్
వీవీల కొనసాగింపుపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాల్సి ఉంది. లాక్డౌన్ వరకు జిల్లాలో పని చేస్తున్న 417 మంది విద్యా వలంటీర్లకు వేతనాలు చెల్లించడం జరిగింది. ప్రభుత్వం ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నా.. వీవీల రెన్యూవల్‌పై ఇంకా ఆదేశాలు అందలేదు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే విద్యా వలంటీర్ల విధులు ఉంటాయి. గత యేడాది కంటే ఈ యేడు వీవీల పోస్టులు భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది.
ఇబ్బందుల పాలవుతున్నాం.. ప్రభుత్వమే ఆదుకోవాలి..
- విజయసారథి,వీవీ, భీంపూర్ మండలం
విధులు లేక ఇబ్బందుల పాలవుతున్న వీవీలను ప్రభుత్వమే ఆదుకోవాలి. గతంలో తక్కువ వేతనానికైనా సేవాభావంతో విధులు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం వీవీలను ఈ యేడు రెన్యూవల్ చేసి పని కల్పించాలి. పూర్తిగా బోధనపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించాలి. లేదా ప్రత్యామ్నయంగా మరో ఉపాధిని కల్పించాలి.