కొనసాగుతున్న లాక్డౌన్
ABN , First Publish Date - 2020-04-05T11:25:52+05:30 IST
కరోనా వైరస్వ్యాప్తి ప్రభావం పెరుగుతుండడంతో జిల్లా యంత్రాంగం తన పకడ్బందీ చర్యలను

పొంతన కుదరని లెక్కలు
క్వారంటైన్లపై ప్రత్యేక దృష్టి
పలుచోట్ల ఇంటింటి సర్వేకు ఆటంకాలు
నేడు రాత్రి 9గంటలకు దీపాలు వెలిగించేందుకు ఏర్పాట్లు
నిర్మల్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్వ్యాప్తి ప్రభావం పెరుగుతుండడంతో జిల్లా యంత్రాంగం తన పకడ్బందీ చర్యలను కొనసాగిస్తోంది. జహూర్నగర్కు చెందిన ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ లక్షణాలతో మరణించిన నేపథ్యంలో శుక్రవారం నుంచి సోమవారం వరకు నాలుగు రోజుల పాటు అధికారులు నిర్మల్ లో లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. శనివారం లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగింది. ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో పోలీసులు నిర్మల్ పట్టణాన్ని దిగ్బంధించి రోడ్లను కట్టడి చేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూరగాయలు, నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు జనసంచారాన్ని మినహాయించినప్పటికీ వాహనాల రాకపోకలను మాత్రం నియంత్రించారు. మరో రెండు రోజుల పాటు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయబోతున్నారు.
కాగా కరోనా ప్రభావిత లక్షణాలు ఎక్కువగా ఉన్నందున జిల్లాలో మరోసారి వైద్య,ఆరోగ్యశాఖ ఇంటింటిసర్వే కార్యక్రమం చేపట్టింది. శనివారం పలుచోట్ల ఈ సర్వేకు ఓ వర్గానికి చెందిన వారు అడ్డు తగిలారు. కబుతర్కమాన్కు చెందిన ఓ అధికార టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ స్వయంగా సర్వేకు అడ్డుపెట్టడం వివాదానికి కారణమైంది. ఆయన ఆశా కార్యకర్తలు, ఏఎన్యంలను సర్వే చేయవద్దంటూ బెదిరింపులకు పాల్పడడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అలాగే ఆశా కార్యకర్తలు, ఏఎన్‌యంలు తమ విధులకు ఆటంకం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తమ విధులకు ఆటం కం కలిగించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
కాగా జిల్లా వైద్యాధికారి ఫిర్యాదు మేరకు అధికారులు కౌన్సిలర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా కరోనా ప్రభావంతో జరిగిన ఓ మరణంపై గాని అలాగే డిల్లీ జమాత్‌కు వెళ్ళి వచ్చిన వారందరిని క్వారంటైన్, ఐసోలేషన్ సెంటర్లకు తరలించిన వారి లెక్కల విషయంలో గాని అధికారులు అందిస్తున్న లెక్కల మధ్య పొంతన కుదరడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఇక్కడి ప్రభావ తీవ్రతను స్పష్టంగా చెప్పడం లేదని రాష్ట్రంలోని మిగతా జిల్లాల వివరాలు బహిరంగ పరుస్తున్నప్పటికీ నిర్మల్ జిల్లాకు సంబంధించిన వివరాలు మాత్రం తెలియడం లేదని పలువురు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ పాల్టెక్నిక్ కళాశాల, సోఫీనగర్ రెసిడెన్షియల్ పాఠశాల అలాగే అక్కడి కేజీబీవీ పాఠశాలల్లో అధికారులు క్వారంటైన్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఈ క్వారంటైన్లలో దాదాపు 60 మందికి పైగా అబ్జర్వేషన్లో ఉన్నారు. అలాగే కొంతమందిని భైంసాలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కాగా కరోనా లక్షణాలు ఉన్న వారి రక్తం షాంపిల్స్ సేకరించి హైదరాబాద్‌కు టెస్ట్‌ల కోసం పంపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 88 మంది రక్తం షాంపిల్స్ సేకరించిన అధికారులు ఆ షాంపిల్స్ రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం లాక్డౌన్ కొనసాగుతోంది. పట్టణ ప్రాంతాల్లోనే కొంతమేరకు జనం లాక్డౌన్ నిబంధనను ఉల్లంగిస్తున్నప్పటికీ గ్రామీ ణ ప్రాంతాల్లో మాత్రం కట్టుదిట్టంగానే ఈ లాక్డౌన్ కొనసాగుతోంది. అక్కడి గ్రామ ప్రజలు, వీడీసీలు, యువజన సంఘాలు ఈ లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నాయి.
పొంతన లేని లెక్కలు..
జిల్లా వ్యాప్తంగా విదేశాలకు వెళ్లి వచ్చిన వారి విషయంలో గాని, వీరందరిని క్వారంటైన్లలో అబ్జర్వేషన్ కోసం ఉంచిన విషయంలో గాని అధికారులు అందిస్తున్న లెక్కల మధ్య పొంతన కుదరడం లేదు. అలాగే ఇటీవల ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాతేకు హాజరైన జిల్లా వాసుల లెక్కల్లో కూడా సారూప్యత కనిపించడం లేదు. మొదట ఓ లెక్క ఆతరువాత మరో లెక్క చూపుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. ప్రస్తుతం క్వారంటైన్లలోనూ, ఐసోలేషన్ వార్డుల్లోనూ అబ్జర్వేషన్లో ఉన్న వారి లెక్కల విషయంలో కూడా పొంతన లేదంటున్నారు. నిర్మల్ ఐసోలేషన్ వార్డు నుంచి కొంత మందిని భైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడి ఐసోలేషన్ సెంటర్లో ఉంచడంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కట్టుదిట్టంగా కొనసాగుతున్న లాక్డౌన్
జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ కట్టుదిట్టంగా కొనసాగుతోంది. నిర్మల్, భైంసాలను ప్రభుత్వం కరోనా హాట్‌స్పాట్ కేంద్రాలుగా ప్రకటించడం, అలాగే కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందడం లాంటి అంశాల కారణంగా శుక్ర వారం నుంచి సోమ వారం వరకు నాలుగు రోజుల పాటు ప్రత్యేక లాక్‌డౌన్‌ను ప్రకటించారు. శుక్ర, శనివారాల్లో మొన్నటికి భిన్నంగా లాక్డౌన్ కొనసాగింది. మరో రెండు రోజుల పాటు కూడా ఇదే తీరుగా లాక్‌డౌన్‌ను అమలు చేయబోతున్నారు. లాక్డౌన్ కాౄరణంగా రోడ్లపై కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. అక్కడక్కడ కొన్ని అత్యవసర పనుల కోసం జనం బయటకు వస్తున్నప్పటికీ ఎక్కువగా ప్రజలు తమ ఇండ్లలోనే గడుపుతున్నారు.
కలెక్టరేట్ ముందు నిరసనలు.. కౌన్సిలర్ అరెస్ట్
కాగా కరోనా ప్రభావం ఉన్న ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది చేపడుతున్న ఇంటింటి సర్వేకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. శనివారం స్థానిక కబుతర్ కమాన్ ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలు, ఏఎన్యంలను టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. ఆధార్‌కార్డు చూపాలని ఆశా కార్యకర్తలు కోరడంతో దీనిపై సదరు కౌన్సిలర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివాదానికి ఆజ్యం పోశాడు. కాగా కౌన్సిలర్ బెదిరింపులపైనే కాకుండా విధులకు ఆటంకం కలిగించడంపై ఆశా, ఏఎన్‌యం కార్యకర్తలు అంతా కలెక్టరేట్ ముందు భైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు కౌన్సిలర్‌ను అరెస్టు చేశారు.
నేటి దీపాల వెలుగులపై విస్తృత ప్రచారం
కాగా కరోనావైరస్వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఆది వారం దేశవ్యాప్తంగా ప్రజలంతా రాత్రి 9గంటలకు తమ ఇండ్ల లోని లైట్లను ఆర్పివేసి దీపాలు లేదా క్యాండిల్స్, సెల్‌ఫోన్ ప్లాష్‌లైట్, టార్చిలైట్లను వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ప్రతీ ఒక్కరు దీపాలను వెలిగించాలని కోరడంతో రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సైతం జిల్లాలోని ప్రతి ఒక్కరు దీపాలను వెలిగించాలంటూ శనివారం ఓ పత్రిక ప్రకటనలో కోరారు. స్వచ్చందం సంస్థలు, యువజనసంఘాలు, స్థానికులు దీపాలను వెలిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.