ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్టలో అధికారులు విఫలం

ABN , First Publish Date - 2020-12-20T04:18:42+05:30 IST

ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమ య్యారని జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు.

ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్టలో అధికారులు విఫలం
మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి

-జడ్పీ స్థాయీ సంఘం సమావేశంలో చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు19: ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమ య్యారని జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన స్థాయీ సంఘాల సమావేశాన్ని  నిర్వహిం చారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్యావైద్యం, మహిళా సంక్షేమం, సాంఘీక సంక్షేమం, పనులు, ప్రణాళికపై సమీక్షించారు. అనంతరం చైర్‌పర్సన్‌ మాట్లా డుతూ మండల సర్వసభ్య సమావేశాలకు అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని, గైర్హాజరు అయ్యే వారికి నోటీసులు జారీ చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే మండల సమావేశాలకు కింది స్థాయి సిబ్బందిని, అసంపూర్తి సమాచారాన్ని పంపుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. సమావేశాలకు రాని సదరు అధికారిని సరెండర్‌ చేయాలన్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా తో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందన్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టాలన్నారు. జిల్లాలో ఫోర్‌లైన్‌ రోడ్డు నిర్మాణం జరుగుతుందని అధికారులకు తెలిసినా మిషన్‌ భగీరథ పైపులైన్‌ రోడ్డు పక్కనే నిర్మించారన్నారు. ప్రస్తుతం బెల్లంపల్లి నుంచి ఆసిఫాబాద్‌ వరకు పైపులైన్‌ తవ్వాల్సి రావడంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందన్నారు.

కెరమెరి, జైనూరు మండలాల్లో పీఏసీఎస్‌ల నుంచి రైతులకు రుణాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు సూచించారు. జిల్లాలో రైతులకు జింకు, సూపర్‌పాస్పెట్‌ ఎరువులు అవసరం మేరకు సక్రమంగా పంపిణీ చేయాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు పేర్కొన్నారు. ఆయా శాఖల అధికారులు నివేదికలు చదివి వినపిస్తున్న సమయంలో పలువురు సభ్యులు సమస్యలపై ప్రశ్నించారు. శ్మశాన వాటిక తదితర పనుల బిల్లుల మంజూరులో ఎందుకు ఆలస్యం జరుగు తుందని పంచాయతీరాజ్‌ డీఈ రామ్మోహన్‌రావు ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రశ్నించారు. శిశు సంక్షేమ శాఖలో పిల్లలకు, గర్భిణులకు పాలు, గుడ్లు సక్రమంగా అందడం లేదని జడ్పీటీసీ అనూష ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో సాయగౌడ్‌, స్థాయీ సంఘాల సభ్యులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-20T04:18:42+05:30 IST