శిఖంభూమిపై ఆఫీసర్‌ కన్ను

ABN , First Publish Date - 2020-12-30T06:20:56+05:30 IST

ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన సదరు తహసీల్దార్‌ స్థాయి అధికారి భూమిని ఆక్రమించిన వ్యవహారం దుమారం రేపుతోంది.

శిఖంభూమిపై ఆఫీసర్‌ కన్ను
ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు

ఎల్లపెల్లి శివారులో రెండు ఎకరాల భూమి కబ్జా 

భూమి విలువ రూ. 3 కోట్లు 

మంత్రి అల్లోల ఆదేశాలతో ఆక్రమణపై కదిలిన యంత్రాంగం 

పట్టా భూమి పేరిట ఆక్రమణ 

భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ తొలగింపు 

ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు

నిర్మల్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన సదరు తహసీల్దార్‌ స్థాయి అధికారి భూమిని ఆక్రమించిన వ్యవహారం దుమారం రేపుతోంది. పొరుగు జిల్లాకు చెందిన ఓ తహసీల్దార్‌ నిర్మల్‌ మండలం ఎల్లపెల్లి గ్రామ శివారులో గల చెరువుశిఖం భూమిని ఆక్రమించిన ఉదంతంపై స్వయంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చర్యలకు ఆదేశించడం కలకలం రేపుతోంది. నిర్మల్‌కు చెందిన ఈ అధికారి పొరుగు జిల్లాలో తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఎల్లపెల్లి శివారులోని తన పట్టాభూమి సర్వేనంబర్‌  191/అ1, 191అ ఆనుకొని ఉన్న ఈ శిఖంభూమిని పథకం ప్రకారం కబ్జాచేసినట్లు ఫిర్యాదులున్నాయి. దాదాపు రెండు ఎకరాల శిఖం భూమి పక్కనే సదరు అధికారికి రెండుసర్వే నంబర్‌ల పేరిట 49 గుంటల భూమి సొంతంగా ఉంది. ఈ భూమికి ఆనుకొనే శిఖం భూమి ఉండడంతో సదరు అధికారి కన్ను ఈ భూమిపై మళ్లింది. నిర్మల్‌ మండల సర్వేయర్‌ సహకారంతో ఆయన ఈ భూమిని తన సొంతంగా పేర్కొంటూ ఆ భూమి చుట్టూ పెన్షింగ్‌ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మార్కెట్‌ విలువ ప్రకారం ఈ భూమి ధర రూ. 3 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇంతటి విలువైన భూమిని సొంతం చేసుకునేందుకు సదరు ఎంఆర్‌ఓ పకడ్భందీ ఎత్తుగడకు రూపకల్పన చేశారు. అలాగే ఈ భూమి చుట్టూ పకడ్భందీగా పెన్షింగ్‌ ఏర్పాటు చేసి ఇతరులకు విక్రయించే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు ప్రచారం. స్థానికులు కొంతమంది శిఖంభూమి ఆక్రమణపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శిఖం భూమి ఆక్రమణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్మల్‌ తహసీల్దార్‌ను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు హుటాహుటిన రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు మంగళవారం శిఖంభూమిలో వేసిన పెన్షింగ్‌ను తొలగించి ఆ భూమిని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.  గత కొద్దిరోజుల నుంచి ఇక్కడి మండల సర్వేయర్‌పై కూడా భూ ఆక్రమణలకు సంబంధించి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల కారణంగా మండల సర్వేయర్‌ను కొద్దిరోజుల క్రితం తాత్కాలికంగా విధుల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా భూ ఆక్రమణకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పొరుగు జిల్లా తహసీల్దార్‌పై కూడా గతంలో అనేక ఫిర్యాదులు ఉన్నట్లు పే ర్కొంటున్నారు. మొ త్తానికి మంత్రి ఆగ్ర హంతో శిఖం భూమి ఆక్రమణకు అడ్డుకట్ట పడడమే కాకుండా తిరిగి ఆ భూమి సర్కారు పరమైందంటున్నారు. 

మంత్రి అల్లోల హెచ్చరికతో కదిలిన యంత్రాంగం

శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సొంత గ్రామానికి ఆనుకొని ఉన్న ఎల్లపెల్లి శివారులో గల రెండు ఎకరాల శిఖంభూమిని పొరుగు జిల్లాలో పనిచేస్తున్న ఓ ఎంఆర్‌ఓ స్థాయి అధికారి ఆక్రమించినట్లు మంత్రికి ఫిర్యాదు అందింది. దీంతో మంత్రి దీనిపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలంటూ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలకు అనుగుణంగా నిర్మల్‌ మండల తహసీల్దార్‌ సుభాష్‌చందర్‌ హుటాహుటిన మంగళవారం ఆక్రమిత భూమిని తనిఖీ చేశారు. శిఖంభూమి దాదాపు రెండు ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించిన తహసీల్దార్‌ ఆ భూమిలో ఏర్పాటు చేసిన పెన్సింగ్‌ను రెవెన్యూసిబ్బందితో అప్పటికప్పుడే తొలగించారు. గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వ, శిఖంభూముల ఆక్రమణలపై మంత్రి సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి భూముల ఆక్రమణపై కఠినంగా వ్యవహరించాలంటూ అధికారులను ఆదేశించారు. ఆక్రమణ విషయంలో నిర్లక్ష్యం చేస్తే అధికారులదే భాధ్యత అంటూ కూడా మంత్రి హెచ్చరించారు. మంత్రి హెచ్చరికల నేపథ్యంలో దాదాపు రెండు ఎకరాల ఆక్రమణకు గురైన శిఖం భూమికి రక్షణ ఏర్పడింది.  

భూమి విలువ రూ.3 కోట్లు

కాగా సర్వేనంబర్‌  191/అ1, 191అ కు పక్కనే ఉన్న రెండు ఎకరాల శిఖంభూమి విలువ ప్రస్తుతం మార్కెట్‌ ధర ప్రకారం రూ. 3 కోట్ల వరకు ఉంటుందంటున్నారు. పొరుగు జిల్లా తహసీల్దార్‌ ఇక్కడి 



భూమికి ఉన్న డిమాండ్‌, ధరను పరిగణలోకి తీసుకొని ఆక్రమణకు ప్రణాళిక రచించాడంటున్నారు. తన సొంత భూమి పక్కనే శిఖంభూమి ఉన్నందున ఆక్రమిస్తే ఎవరికి అనుమానం రాదన్న ఉద్దేశంతో ఈ ఎత్తుగడను రూపొందించాడు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో భూముల ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. కనీసం ఎక్కడ కూడా రూ.కోటికి తగ్గకుండా భూము ల ధరలు ఉన్నాయంటే ఇక్కడ డిమాండ్‌ ఏ మేరకు ఉందో అర్థమవుతోంది. ఇలా భూముల ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో రాజకీయ నాయకులు, కొంతమంది అధికారుల కళ్లు సర్కారు భూమి చుట్టూ తిరుగుతున్నాయంటున్నారు. దీనికి అనుగుణంగానే ఎల్లపెల్లి శివారులోని శిఖం భూమికి ఓ అధికారి కబ్జా పెట్టినట్లు ఆరోపణలున్నాయి.

కాపాడాల్సిన వారే కాజేస్తున్నారు

ప్రభుత్వ భూములను కంటికి రెప్పలా కాపాడాల్సిన సంబందిత అధికారులే కాజేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఓ తహసీల్దార్‌ స్థాయి అధికారి, అలాగే ఓ మండల సర్వేయర్‌ ఏకంగా శిఖం భూమిని లక్ష్యంగా చేసుకొని ఆక్రమణకు పాల్పడడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. గత కొద్దిరోజుల నుంచి ఒకరిద్దరు అధికారుల నిర్వాహకం కారణంగా రెవెన్యూశాఖ ప్రతిష్టపై మచ్చ పడుతోంది.  ప్రభుత్వం సర్కారు భూముల ఆక్రమణపై ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ కంచెచేను మేస్తున్న చందంగా సంబంధిత అధికారులే ఇలాంటి అవకతవకలకు పాల్పడుతుండడం చర్చకు తావిస్తోంది. ఈ శిఖంభూమిని ఆక్రమించిన సదరు అధికారిపైనే కాకుండా మండల సర్వేయర్‌పై కూడా ఇప్పటికే అనేక ఆరోపణలున్నాయంటున్నారు. సర్కారు భూములపై ఇటీవల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష జరిపి ఆక్రమణలకు పాల్పడుతున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ స్వయంగా జిల్లా కలెక్టర్‌కు సూచించారు. అయినప్పటికి వీరి తీరులో మార్పు కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. అయితే ఎల్లపెల్లి శివారులో గల రెండు ఎకరాల శిఖంభూమి ఆక్రమణపై మంత్రి సీరియస్‌ వార్నింగ్‌ ఇవ్వడంతో అధికారులు కదిలిరాక తప్పలేదంటున్నారు. 

Updated Date - 2020-12-30T06:20:56+05:30 IST