ప్రభుత్వ భూముల కబ్జా

ABN , First Publish Date - 2020-11-06T06:32:21+05:30 IST

ప్రభుత్వ భూములను కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జా చేస్తు న్నారు. కాగజ్‌నగర్‌ మండలం ఈసుగాం, నాగంపేట పంచాయతీల పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని కొందరు అక్రమార్కులు కబ్జా

ప్రభుత్వ భూముల కబ్జా

కాగజ్‌నగర్‌ మండలంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు 

పట్టించుకోని అధికారులు

సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికుల డిమాండ్‌


కాగజ్‌నగర్‌, నవంబరు5: ప్రభుత్వ భూములను కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జా చేస్తు న్నారు. కాగజ్‌నగర్‌ మండలం ఈసుగాం, నాగంపేట పంచాయతీల పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని కొందరు అక్రమార్కులు కబ్జా చేసుకొని ప్లాట్లు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. కాగజ్‌నగర్‌-పెంచికల్‌పేట ప్రధాన రహదారి పక్కనే ఈ భూమి ఉండడంతో అధిక ధర పలుకుతోంది. దీంతో కొందరు దళారుల దృష్టి ఈభూములపై పడింది.  నాగంపేట శివారులో ప్రభుత్వ భూములను అక్రమాలు చేస్తుండటం విశేషం. గిరిజనుల సాగు కోసం ఇచ్చిన భూములను కూడా విక్రయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో  ఊహించుకోవచ్చు. కాగజ్‌నగర్‌ మండలం జంబుగ శివారులోని సర్వేనం.24లో గిరిజనులకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. ఈస్థలాన్ని కూడా అమ్మకాలు జరిపారు. ఇందులో ఏకంగా షెడ్డు నిర్మాణం చేపట్టడం విశేషం. వీటితో పాటు గువ్వల గూడలో కూడా ఇదే తరహాలో ప్రభుత్వ స్థలాన్ని అమ్మేశారు. ఈ విషయంలో కూడా అధికారులు ప్రేక్షకపాత్ర వహించటం గమనార్హం.  


‘ఇందిరమ్మ’ స్థలాలు అన్యాక్రాంతం

2004లో కాగజ్‌నగర్‌ మండలం చారిగాం శివారులో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల కోసం ఏడు దఫాలుగా ప్రత్యేక ప్యాకేజీల కింద స్థలాన్ని అధికారులు ఎంపిక చేశారు. చారిగాంలోని 75 ఎకరాల స్థలాన్ని  ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి  కొనుగోలు చేశారు. ఇందుకు తొలి విడతలో 531 మందికి, రెండో విడతలో 130, మూడో విడతలో 643 మందికి సర్వే నెంబరు 119, 120, 125, 126 కేటాయించి ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ భూములను కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో కాగజ్‌నగర్‌ రెవెన్యూ అధికారులు ఆక్రమణలు తొలగించేందుకు శ్రీకారం చుట్టారు. ఉన్నతాధి కారులు సమగ్ర విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. అలాగే కాగజ్‌నగర్‌ పట్టణం లోని పలు ఏరియాల్లో ప్రధాన కాల్వలను యథేచ్ఛగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు.


ఈ విషయంలో పలువురు కౌన్సిలర్లు జిల్లా అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు ఎలాంటి  చర్యలు తీసుకోలేదు. తాజాగా కాగజ్‌నగర్‌ బస్టాండు సమీపంలో నిర్మిస్తున్న మడిగెల్లో కూడా అదనంగా నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. జిల్లా ఉన్నత స్థాయి అధికారులు కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.  


అధికారుల నిఘా కరువైంది-రేగుల రాజు, కాగజ్‌నగర్‌

కాగజ్‌నగర్‌ పట్టణం, మండలంలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. స్థానిక అధికా రులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోంది. ఈ విషయంపై జిల్లా స్థాయి అధికారులు కూలం కుషంగా విచారణ చేపడితే అక్రమార్కుల బండారం బట్టబయలవుతుంది. 


సమగ్ర విచారణ జరపాలి-అంబాల ఓదెలు, కాగజ్‌నగర్‌

ప్రభుత్వ స్థలాలను కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. కబ్జాల గురించి పట్టించుకోవాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వదిలేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలి.

Updated Date - 2020-11-06T06:32:21+05:30 IST