అక్కరకు రాని సాగునీటి పథకాలు

ABN , First Publish Date - 2020-12-19T06:32:08+05:30 IST

వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన జిల్లాలో సాగునీటి వసతి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. సారవంతమైన నల్లరేగడి నేలలు ఉన్నా.. సాగునీటి పథకాలు అక్కరకు రాకుండానే పోతున్నాయి. దీంతో వర్షాధార పంటలనే ఎక్కువగా సాగుచేస్తున్నారు.

అక్కరకు రాని సాగునీటి పథకాలు
నిరుపయోగంగా కనిపిస్తున్న వెంకటాపూర్‌ ఎత్తిపోతల పథకం

జిల్లాలో 12 ఎత్తిపోతల పథకాలున్నా ప్రయోజనం సున్నా

ప్రాజెక్టుల కింద 47వేల హెక్టార్లకు మాత్రమే సాగు నీరు

పథకాల నిర్వహణలో అడుగడుగునా నిర్లక్ష్యమే

పాలకులు దృష్టిసారిస్తే వేల ఎకరాలు సస్యశ్యామలం

ఆదిలాబాద్‌, డిసెంబరు18 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన జిల్లాలో సాగునీటి వసతి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. సారవంతమైన నల్లరేగడి నేలలు ఉన్నా.. సాగునీటి పథకాలు అక్కరకు రాకుండానే పోతున్నాయి. దీంతో వర్షాధార పంటలనే ఎక్కువగా సాగుచేస్తున్నారు. నీళ్లు, నిధుల కోసమే ఆవిర్భవించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనైనా జిల్లా సాగునీటి రంగం పరిస్థితి మారడం లేదు. ఒకటి రెండు చిన్ననీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో సాగునీరు అందడంలేదు. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 5 వేల హెక్టార్ల సాగు భూమి అందుబాటులో ఉండగా లక్షా 98 వేల హెక్టార్లకు పైగా సాగవుతోంది. ఇందులో కేవలం 47 వేల హెక్టార్లకు మాత్రమే సాగునీటి వసతి ఉంది. మిగతా లక్షా 58వేల హెక్టార్లలో వర్షాధారంపైననే ఆధారపడి సాగుచేయాల్సిన పరిస్థితి ఉంది. సాగుకు యోగ్యమైన మొత్తం భూమిలో 20 శాతం మాత్రమే రెండు పంటలు పండుతుండగా 80 శాతం భూమిలో వర్షాధార పంటలనే సాగు చేయాల్సి వస్తోంది. నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో బీడు భూములకు సాగునీరు అందించి సస్యశ్యా మలం చేయాలన్నా సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 12 ఎత్తిపోతల పథకాలను నిర్మించింది. అవి యేళ్ల తరబడి నిరుపయోగంగానే కనిపిస్తున్నాయి. జిల్లా సాధారణ వర్షపాతం 1193 మిల్లీమీటర్లు కాగా, ఈ సారి లోటు వర్షపాతమే నమోదైంది. నాలుగేళ్ల క్రితమే పెన్‌గంగా నదిపై కోర్టా-చనకా బ్యారేజిని నిర్మిస్తున్నా ఇప్పటి వరకు చుక్కనీరు ఆయకట్టుకు అందించిన దాఖలాలు కనిపించడం లేవు. దీంతో సాగునీటి వనరులు అందుబాటులో ఉన్న సద్వినియోగం కాక పోవడంతో అన్నదాతలకు ఎదురు చూపులు తప్పడం లేదు.

అలంకార ప్రాయంగానే..

కోట్ల రూపాయలు వెచ్చించి ఎత్తిపోతల పథకాలను నిర్మించినా అవి అలంకార ప్రాయంగానే కనిపిస్తున్నాయి. అందుబాటులో సాగునీరున్నా పథకాలు అక్కరకు రాకుండా పోతున్నాయి. జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్నా పెన్‌గంగానది, కడెం నదులలో పుష్కలంగా నీళ్లున్నా ఎత్తిపోసే పరిస్థితి లేక సాగునీరు వృథాగా దిగువకు వెళ్లిపోతోంది. జిల్లాలో మొత్తం 12 ఎత్తిపోతల పథకాలు ఉండగా ఒకటి మాత్రమే అడపాదడపాగా పనిచేస్తుంది. తాంసి మండలంలో అర్లి(టి), తలమడుగు మండలం కప్పర్‌దేవి, నేరడిగొండ మండలం వెంకటాపూర్‌, బుద్ధికొండ, జైనథ్‌ మండలం సాంగ్వి, బేల మండలంలో కంగర్‌పూర్‌, మంగురూల్‌, ఆదిలాబాద్‌ మండలంలో చించుఘట్‌, బజార్‌హత్నూర్‌ మండలంలో దేగాం, బోథ్‌ మండలంలో పొచ్చర, కుచులాపూర్‌ పథకాలు యేళ్లతరబడి పనిచేయడంలేదు. సోనాల ఎత్తి పోతల పథకం మాత్రం అంతంత మాత్రంగానే పనిచేస్తోంది. కొన్ని పథకాలు లీకేజీలతో మూలన పడగా మరికొన్నిం టికి విద్యుత్‌ సౌకర్యం లేక నిరుపయోగంగా మారాయి. గతంలోనే జిల్లాలోని పథకాల మరమ్మతుల కోసం రూ.5 కోట్ల 17 లక్షల నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా పూర్తి స్థాయిలో నిధులు మంజూరు కావడంలేదని అధికారులు పేర్కొంటున్నారు. 

పథకాల నిర్వహణపై అవగాహన కరువు..

మొదటి నుంచి ఎత్తిపోతల పథకాలను నిర్వహణ సమస్య రైతులను వెంబడిస్తూనే ఉంది. ఎన్ని కోట్లు ఖర్చు చేసి మరమ్మతులు చేపట్టినా మూడునాళ్లముచ్చటగానే మారిపోతోంది. పదేళ్ల క్రితం పథకాల నిర్వహణ బాధ్యతను అధికారులే చేపట్టేవారు. వాటికయ్యే మరమ్మతు ఖర్చులను సైతం ప్రభుత్వమే భరించేది. కానీ  కొంత కాలంగా నిర్వహణ బాధ్యతను రైతులకు అప్పజెప్పడంతోనే అసలు సమస్య మొదలైంది. రైతులకు అవగాహన లేకపోవడం, మరమ్మతులకయ్యే డబ్బులు చేతిలో లేకపోవడంతో అప్పటి నుంచి పథకాలు మరుగునపడిపోతున్నాయి. నిర్వహణ బాధ్యతను ఎవరూ పట్టించుకోకపోవడంతో కొన్నిచోట్ల విద్యుత్‌ మోటర్లు, ట్రాన్స్‌ఫార్మ ర్‌లను అపహరించుకపోయారు. అలాగే పైపులైన్‌లు సైతం ధ్వంసమైపోయి కనిపించకుండా పోయాయి. రైతులు, అధికారులకు పట్టింపు కరువవడంతో సాగునీటి పథకాలన్ని వృథాగా మారాయి. ఇకనైనా జిల్లా నేతలు అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టిని సారిస్తే అధనంగా వేల హెక్టార్లకు సాగునీరు అందనుంది. 

కోట్లు ఖర్చు చేసినా గుంట భూమి తడవడంలేదు..

- సిడాం దత్తు (సాంగ్వి(కె) గ్రామం, జైనథ్‌ మండలం)

ప్రభుత్వం సాగునీటి పథకాలపై కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నా గుంటభూమి కూడా తడవడంలేదు. సాంగ్వి(కె) గ్రామంలో రూ.7 కోట్ల వ్యయంతో పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పని చేయకపోవడంతో నిరుపయోగంగానే మారింది. సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదు. యేళ్ల తరుబడి పథకం పనులు కొనసాగుతుండడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడంలేదు. 

అధికారుల నిర్లక్ష్యంతోనే మరుగునపడ్డాయి..

- బద్దం రాజారెడ్డి (పొచ్చెర గ్రామం, బోథ్‌ మండలం)

అధికారుల నిర్లక్ష్యం వల్లనే మరుగున పడిపోయిందని పొచ్చర గ్రామ రైతు బద్దం రాజారెడ్డి పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ దొంగలెత్తుకు పోవడంతో అప్పటి నుంచి కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ బిగించకపోగా మరుగునపడిపోయిందన్నారు. 200 ఎకరాలకు సాగు నీరందించాల్సిన ఈ పథకం అధికారుల నిర్లక్ష్యం వల్లనే సాగు నీరు అందడం లేదన్నారు.

Updated Date - 2020-12-19T06:32:08+05:30 IST