గ్రేటర్‌ తీర్పు కొత్తమార్పు

ABN , First Publish Date - 2020-12-05T06:26:06+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 49 స్థానాలను సాధించుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నెలకొంటోంది.

గ్రేటర్‌ తీర్పు కొత్తమార్పు

జిల్లాలో మారబోతున్న  రాజకీయ సమీకరణలు 

ఖాళీకానున్న కాంగ్రెస్‌ 

సీనియర్‌ నేతలంతా కమలం వైపు చూపు 

టీఆర్‌ఎస్‌ అసంతృప్తి వాదులది  అదే దారి  

నిర్మల్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి)  : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 49 స్థానాలను సాధించుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నెలకొంటోంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల వివరాలను టీవీల ద్వారా వీక్షి స్తున్న స్థానికులు తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు. ముఖ్యంగా జిల్లాలోని బీజేపీ శ్రేణులు ఈ ఎన్నికల ఫలితాల కారణంగా సంబురాలు జరుపుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి పోటీనిచ్చి బీజేపీ ఆ పార్టీతో సమంగా కార్పొరేటర్‌ పదవులను దక్కించుకోవడం చర్చకు తావిస్తోంది. మొదటి నుంచి బీజేపీ దూకుడుగా ప్రచారం నిర్వహించడమే కాకుండా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకొని ఉదృతంగా ప్రచారం నిర్వహించింది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం ఊపుతో కాషాయదళం జీహెచ్‌ఎంసీ ఎన్నికలను టార్గెట్‌గా చేసుకొని ఎలాగైనా మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు అన్ని అస్ర్తాలను ప్రయోగించింది. సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకొని ఎలాగైనా టీఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టాలని బీజేపీ రచించిన వ్యూహం దాదాపుగా ఫలించిందంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితంలో జిల్లా రాజకీయ సమీకరణలు సైతం మారిపోయిన సంగతి తెలిసిందే. నిర్మల్‌ జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు చెందిన అగ్రనాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం మొదలైంది. వీరికి తోడుగా టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తి నాయకులు సైతం కమల దళంలో చేరాలని భావిస్తున్నట్లు ప్రచారం మొదలైంది. అయితే నిర్మల్‌ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం ఇక్కడి రాజకీయ వర్గాల్లో దుమారం సృష్టించింది. అయితే ఊహాగానాలకు అనుగుణంగానే మహేశ్వర్‌ రెడ్డి తన అనుచరులతో కొద్ది రోజుల నుంచి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. మహేశ్వర్‌రెడ్డితో పాటు ఖానాపూర్‌ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ రాథోడ్‌రమేష్‌, ముథోల్‌ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌ ఆయన సోదరుడు మోహన్‌రావు పటేల్‌లు కూడా బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే జీహెచ్‌యంసీ ఎన్నికల ఫలితాల తరువాతనే తమ రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించుకోవాలని ఈ నేతలంతా నిర్ణయించుకున్నారంటున్నారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల పలితాల్లో బీజేపీ టీఆర్‌ఎస్‌కు తీసిపోని విధంగా గణనీయ సంఖ్యలో కార్పొరేటర్‌ పదవులను దక్కించుకోవడం కొత్త రాజకీయ సమీకరణలకు వేదికగా మారబోతుందంటున్నారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వ్యవహారం సైతం కాంగ్రెస్‌లో కలవరం సృష్టించనుండగా ఆ పార్టీ నేతలను షాక్‌కు గురి చేసిందన్న వాఖ్యానాలు వినిపిస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు రాజకీయ కేంద్రమైన నిర్మల్‌ జిల్లాలో సరికొత్త సమీకరణలకు తెరలేపబోతుందన్న వాదనలు మొదలయ్యాయి. 

మారనున్న సమీకరణం....

ఇదిలా ఉండగా దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ దూకుడుగా ప్రచారం చేస్తూ ఘనవిజయం సాధించిన వ్యవహారం జిల్లా రాజకీయ సమీకరణలను తలకిందులు చేయబోతుందంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సీనియర్‌ నేతలంతా గత కొంతకాలం నుంచి ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ పార్టీలో నేతలు, కార్యకర్తలకు సరియైున గుర్తింపు లభించకపోతుండడం వారి అసహనానికి కారణమవుతోందన్న అభిప్రాయాలున్నాయి. అయితే టీఆర్‌ఎస్‌లో కూడా చాలా మంది అసంతృప్తి నాయకులు కమల దళం వైపు కన్నేసినట్లు పేర్కొంటున్నారు. ఇలా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లలో క్షేత్రస్తాయి కేడర్‌ తీవ్రమైన అసంతృప్తిలో రగిలిపోతూ ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు ఆసక్తి కనబరుస్తుండడం రాజకీయ సమీకరణలు మారేందుకు దోహదపడవచ్చంటున్నారు. ఇదే జరిగితే మూకుమ్మడిగా కాంగ్రెస్‌ నేతలంతా బీజేపీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2020-12-05T06:26:06+05:30 IST