అఫైర్ పెట్టుకున్న వివాహిత వేరే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతోందన్న అనుమానంతో...

ABN , First Publish Date - 2020-03-15T15:38:34+05:30 IST

వివాహిత యువతి అనుమానాస్పద మృతి కేసును సత్తుపల్లి పోలీసులు ఛేదించారు. ఆమెది హత్యగా తేలటంతో...

అఫైర్ పెట్టుకున్న వివాహిత వేరే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతోందన్న అనుమానంతో...

చున్నీతో ఉరేశాడు

వివాహిత అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు 

వేరే వ్యక్తితో మాట్లాడుతోందనే అనుమానంతో ప్రియుడి ఘాతుకం

సహకరించిన ఆటో డ్రైవర్‌ .. వివరాలు వెల్లడించిన కల్లూరు ఏసీపీ


సత్తుపల్లి(ఖమ్మం జిల్లా): వివాహిత అనుమానాస్పద మృతి కేసును సత్తుపల్లి పోలీసులు ఛేదించారు. ఆమెది హత్యగా తేలటంతో ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి కల్లూరు ఏసీపీ ఎన్‌.వెంకటేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 10వ తేదీన సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన పంతంగి వాణి సత్తుపల్లి మునిసిపాలిటీ పరిధిలోని అయ్యగారిపేటలోని ఒక పామాయిల్‌ తోటలో శవమై కనిపించింది. అప్పట్లో అనుమానాస్పద కేసుగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమెది హత్యగా తేలటంతో హత్యకు బాధ్యులైన కోటా సందీప్‌, షఫీని అరెస్టు చేశారు.


ఏసీపీ కథనం ప్రకారం ఏడాది క్రితం వివాహిత వాణికి సత్తుపల్లికి చెందిన సందీప్‌తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారింది. వీరిద్దరిని గతంలో పెద్ద మనుషులు కూడా మందలించారు. అయినా ప్రవర్తనలో మార్పు రాలేదు. వాణి చనిపోయిన రోజు సాయంత్రం 7.30గంటలకు ఆమె పని చేస్తున్న షాపులో విధులు ముగించుకొని బయటకు వచ్చింది. సందీప్‌ ఆమెను ఎస్‌కే.షఫీ అనే వ్యక్తి ఆటోలో ఎక్కించుకొని వెళ్లాడు.


ఆయ్యగారిపేటలోని పామాయిల్‌ తోటలోకి వెళ్లగానే వేరే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతున్నావనే అనుమానంతో సందీప్‌.. వాణితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరగటంతో వాణి మెడకు చున్నీ బిగించి సందీప్‌ ఆమెను హత్య చేశాడు. హత్య సమయంలో షఫీ వాణి కాళ్లు పట్టుకొని సహకరించాడు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సందీప్‌, షఫీని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో సీఐ రమాకాంత్‌, ఎస్సై నరేష్‌, ఏఎస్సైలు బాలస్వామి, జయబాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-15T15:38:34+05:30 IST