వీడిన హత్యకేసు మిస్టరీ

ABN , First Publish Date - 2020-11-26T04:12:09+05:30 IST

తిర్యాణి మండలం తాటిమాదర గ్రామానికి చెందిన ఆత్రం లచ్చు మూడు రోజుల క్రితం హత్యకు గురికాగా పోలీసులు మిస్టరీని చేధించారు.

వీడిన హత్యకేసు మిస్టరీ
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు

-నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

తిర్యాణి, నవంబరు 25: తిర్యాణి మండలం తాటిమాదర గ్రామానికి చెందిన ఆత్రం లచ్చు మూడు రోజుల క్రితం హత్యకు గురికాగా పోలీసులు మిస్టరీని చేధించారు. ఈ మేరకు బుధవారం డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు నిందితులను పట్టుకుని వివరాలు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం భూవివాదం, మంత్రాల నెపంతో ఆత్రం లచ్చును అతని సమీప బంధువులైన ఆత్రం సుంగు, పుర్క మాణిక్‌రావులు హత్య చేశారు. ఆత్రం సుంగు తండ్రి అయిన ఆత్రం అర్జు గత నెల 30న అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా లచ్చు మంత్రాలు చేయడంతోనే తన తండ్రి చనిపో యాడని లచ్చుపై ఆత్రం సుంగు కక్ష పెంచుకున్నాడు. ఇదిలా ఉండగా ఆత్రం లచ్చుకు, పుర్క మాణిక్‌రావుకు మధ్య కూడా భూ తగాదాలు ఉన్నాయి. దీంతో ఇద్దరూ కలిసి లచ్చును హతమార్చాలని పథకం పన్నారు.   ఈనెల 22న రాత్రి లచ్చు పుర్కగూడ అటవీ సమీపంలో ఉన్న తన పంట చేనులోకి కాపలాకు వెళ్లగా సుంగు, మాణిక్‌రావులు పురుగుల మందును లచ్చు ముఖంపై చల్లి పెద్ద బండలతో మోది మెడపై గొడ్డలితో దాడి చేసి చంపినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితులపై 302 సెక్షన్‌ కింది హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రెబ్బెన సీఐ సతీష్‌కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ బాలాజీ, పోలీసులు ఉన్నారు. 

Updated Date - 2020-11-26T04:12:09+05:30 IST