మున్సిపాలిటీలో ఆస్తి పన్ను రాయితీ

ABN , First Publish Date - 2020-11-27T04:42:08+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పుణ్యమా అని రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం ఆస్తి పన్నులో రాయితీ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకో వడంతో కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో ఐదు వేల మందికి ప్రయోజనం కలగనుంది.

మున్సిపాలిటీలో ఆస్తి పన్ను రాయితీ
కాగజ్‌నగర్‌లో ఆస్తి పన్ను వసూలు చేస్తున్న సిబ్బంది

-కాగజ్‌నగర్‌లో 5వేల మందికి ఊరట

-ప్రభుత్వంపై సుమారు రూ.30 లక్షల అదనపు భారం

-ఇప్పటికే కట్టిన వారికి ప్రత్యామ్నాయ చర్యలు

-వచ్చే ఏడాది బిల్లులో మాఫీ చేసేందుకు ఏర్పాట్లు

కాగజ్‌నగర్‌, నవంబరు26: జీహెచ్‌ఎంసీ ఎన్నికల పుణ్యమా అని రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం ఆస్తి  పన్నులో రాయితీ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకో వడంతో కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో ఐదు వేల మందికి ప్రయోజనం కలగనుంది. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో 14,888 ఇళ్లు ఉండగా, ఇందులో రూ.1.40 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్‌ ఉంది. ఇందులో ఇప్పటికే 70లక్షల రూపాయలు వసూల య్యాయి.  కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను రాయితీతో ప్రభుత్వంపై సుమారు రూ.30లక్షల భారం పడనుంది. అయితే ప్రభుత్వం ఆస్తి పన్ను రాయితీకి కొన్ని షరతులు విధించింది. 


ఇవీ నిబంధనలు

రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నులో సగ భాగం కట్టేందుకు జీవోనం.611 తేదీ:14/11/2020 ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌ పేరిట విడుదల చేసింది. ఈ జీవో ఆధారంగా ఆస్తి పన్ను రూ.10వేలకు మించరాదు. ఆస్తి పన్ను బకాయిలు ఉండకూడదు. ప్రస్తుతం ఆస్తి పన్ను కడితే వచ్చే సంవత్సరంలో సవరింపు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో 2020-21 డిమాండు నోటీసులను మున్సిపల్‌ అధికారులు ఇంటింటికీ పంపిణీ చేశారు. ఐదు నెలల నుంచి వసూలు ప్రక్రియ కూడా పూర్తి చేశారు. రూ.1.40కోట్ల మేర ఆస్తి పన్ను రావాల్సి ఉండగా ఇందులో రూ.70లక్షలు వసూలు చేశారు. 

ఆస్తి పన్ను సగం రాయితీ ప్రకటించడంతో పూర్తిగా చెల్లింపులు చేసిన కొంతమంది మున్సిపల్‌ కార్యాల యానికి వచ్చి ఈ విషయమై అధికారులను వాకబు చేస్తున్నారు. అయితే వచ్చే సంవత్సరంలో కట్టే పన్నులో రాయితీని లెక్కచేసి సవరిస్తామని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఊరట చెందారు. ఇంకా ఆస్తి పన్ను కట్టని వారు సగం పన్ను మాత్రమే చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రక్రియతో నిరు పేదలతో పాటు పట్టణంలో చాలా మందికి ప్రయోజనం కలగనుంది. అలాగే గతంలోనే దీర్ఘకాలికంగా ఆస్తి పన్ను చెల్లింపులు చేయని వారికి కూడా వడ్డీ విషయంలో రాయితీ కల్పించటంతో వారికి కూడా ఉపయోగడే విధంగా ప్రభుత్వం ప్రత్యేక జీవో కూడా విడుదల చేసింది. ప్రభుత్వం ఆస్తి పన్ను విషయంలో ప్రత్యేక నిఘా పెట్టింది. నిత్యం అన్ని మున్సిపాలిటీల ఆస్తి పన్ను స్థితిగతులపై మున్సిపల్‌ సైట్‌లో పొందుపరిచే విధంగా చర్యలు తీసుకుంది.  

పన్ను రాయితీ హర్షణీయం 

-కుమార్‌, కాగజ్‌నగర్‌ 

లాక్‌డౌన్‌తో పన్నులు చెల్లించడం కష్టతరంగా మారింది. ప్రస్తుతం ఆస్తి పన్నుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. పన్నులో సగ భాగం తగ్గింపు చేయడంతో ఆర్థిక భారం తగ్గినట్లయింది. గతంతో పోలిస్తే ఈసారి కాస్త ఊరట కలిగినట్లయింది.  

ఆర్థికంగా కొంత ఉపశమనం

-జాకీర్‌ షరీఫ్‌, కాగజ్‌నగర్‌

ఆస్తి పన్ను పూర్తిగా చెల్లింపులు చేశా. అయితే వచ్చే సంవత్సరం బిల్లులో సర్దుబాటు చేస్తామని అధికారులు చెప్పారు. లాక్‌డౌన్‌ తర్వాత ఆర్థిక పరిస్థితులు  ఊహించని విధంగా తలకిందు లయ్యాయి. జీతాలు సక్రమంగా రావడం లేదు. పన్నుల చెల్లింపు కష్టతరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 

అర్హులందరికీ పన్ను రాయితీ 

-శ్రీనివాస్‌, కమిషనర్‌, కాగజ్‌నగర్‌

ప్రభుత్వం విడుదల చేసిన జీవోను పన్ను కట్టే వారికి వివరిస్తున్నాం. అయితే కొంత మంది ఆస్తి పన్నులు కట్టేశారు. వారి విషయంలో మాత్రం సర్దు బాటు చేస్తాం. ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనల ప్రకారం పన్ను రాయితీ వర్తిస్తుంది. పట్టణంలో 14,888 ఇళ్లకు ఆస్తి పన్ను వసూలు చేస్తున్నాం. ఇందులో 5వేల ఇళ్లకు ఆస్తి పన్ను తగ్గింపు వర్తి స్తుంది.  


Updated Date - 2020-11-27T04:42:08+05:30 IST