మరింత ఫాస్టుగా..
ABN , First Publish Date - 2020-12-31T04:25:18+05:30 IST
జాతీయ రహదారులపై ప్రయాణం మరింత ఫాస్ట్‌గా సాగనుంది. జనవరి 1 నుంచి నేషనల్ హైవే అథారిటీ (ఎన్‌హెచ్‌ఐ) టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు పూర్తిగా స్వస్తి పలుకుతూ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని నేరడి గొండ మండలంలో రోల్‌మామడ, జైనథ్ మండలంలో పిప్పర్‌వాడ టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని తప్పని సరిగా అమలు చేయనున్నారు.

టోల్‌ప్లాజాల వద్ద ‘నో ఫాస్టాగ్.. నో ఎంట్రీ’
రేపటి నుంచి పక్కాగా అమలుకు చర్యలు
ఫాస్టాగ్ లేని వాహనాలకు రెట్టింపు చార్జీలు
సాంకేతిక సమస్యలపైనే అనుమానాలు
ఆదిలాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారులపై ప్రయాణం మరింత ఫాస్ట్‌గా సాగనుంది. జనవరి 1 నుంచి నేషనల్ హైవే అథారిటీ (ఎన్‌హెచ్‌ఐ) టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు పూర్తిగా స్వస్తి పలుకుతూ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని నేరడి గొండ మండలంలో రోల్‌మామడ, జైనథ్ మండలంలో పిప్పర్‌వాడ టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని తప్పని సరిగా అమలు చేయనున్నారు. గత కొన్నాళ్ల నుంచే టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానంపై ప్రచారం చేస్తూ వాహన దారులకు ఫాస్టాగ్ స్టిక్కర్‌లను అందజేస్తున్నారు. జిల్లా మీదుగా వెళ్లే 44వ జాతీయ రహదారిపై ఉన్న రెండు టోల్‌ప్లాజాల గుండా నిత్యం సుమారుగా 10వేల వరకు వాహనాలు వెళ్తుంటాయి. ఇందులో ఇప్పటి వరకు 70శాతం వాహనదారులు ఫాస్టాగ్ విధానాన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఇప్పటికే జిల్లాలో ఫాస్టాగ్ విధానం అమలవుతున్నా పూర్తిస్థాయిలో లేక పోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. నగదు చెల్లింపులతో గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక పై ఫాస్టాగ్ విధానం అమల్లోకి వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంతో పాటు సమయం ఆదాకానుంది. నగదు చెల్లింపుల సమయంలో టోల్‌ప్లాజా సిబ్బందితో వాహనదారులకు చిన్నపాటి ఘర్షణలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పుడు అలాంటి సమస్యలు ఉండవని నేషనల్ హైవే అధికారులు పేర్కొంటున్నారు. నూతన వాహనం కొనుగోలు చేసిన సమయంలోనే ఫాస్టాగ్‌ను తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధన ఉంది. అయినా కొందరు వాహనదారులు పట్టించుకోక పోవడంతోనే పూర్తి స్థాయి అమలుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇకపై ఫాస్టాగ్ విధానంతో సిబ్బంది ప్రమేయం లేకుండానే టోల్ గేట్‌ను దాటి వెళ్లే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఫాస్టాగ్ ఉంటేనే ప్రయాణం..
జనవరి 1 నుంచి జిల్లాలోని టోల్‌ప్లాజాల వద్ద పూర్తి స్థాయిలో ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో ఫాస్టాగ్ ఉంటేనే ప్రయాణం చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రయాణికులు ఫాస్టాగ్ ఉన్న వాహనాలలోనే ప్రయాణం చేస్తే ఇబ్బం దులు ఉండవంటున్నారు. ఏ వాహనం పేరిటా ఫాస్టాగ్ తీసుకుంటే అదే వాహనానికి వాడాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ స్టిక్కర్‌ను వాహనాల ముందు భాగంలో అతికించడంతో స్కానర్లు స్కాన్ చేసి వాహనం ముందుకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయి. ఆ వెంటనే అనుసంఽ దానం చేసిన బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపులు జరిగి పోతాయి. ఫాస్టాగ్ తీసుకునే సమయంలో వాహనదారులు తమ బ్యాంకు ఖాతతో పాటు కేవైసీ తెలుపాల్సి ఉంటుంది. ఆ వివరాలన్నింటిని ఆన్‌లైన్ చేయడంతో ఫాస్టాగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లోనే..
ఫాస్టాగ్ తీసుకోవడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా రెట్టింపు చార్జీలు తప్పవంటున్నారు. చెల్లింపులంతా ఆన్‌లైన్‌లోనే జరుగాల్సి ఉంటుంది. ఒకటి రెండు సార్లు ఈ విధానం ద్వారా అనుమతించిన ఆ తర్వాత నిబంధనలు కఠినతరం చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు స్థానిక ప్రజా ప్రతినిధులు, పలువురు ప్రముఖుల వాహనాలకు టోల్ చార్జీల నుంచి మినహాయింపు ఉండేది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదంటున్నారు. వాహనదారులందరు తప్పని సరిగా ఫాస్టాగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మినహాయింపు జాబితాలో ఉన్న వాహనాలకు టోల్ చార్జీలు చెల్లించే అవసరం ఉండదంటున్నారు. ఫాస్టాగ్ ఏర్పాటు చేసుకొని వాహనాలపై రెట్టింపు చార్జీలు వేస్తూ ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం నగదు చెల్లింపులకు అవకాశం ఉండదంటున్నారు. ప్రస్తుతం వన్ వే రూ.80 ఉంటే జనవరి 1 నుంచి ఫాస్టాగ్ లేని వాహనాలకు రెట్టింపు చార్జీగా రూ.160 చెల్లించాల్సి వస్తుంది. దేశ వ్యాప్తంగా టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేయడంతో ఇతర రాష్ర్టాలకు వెళ్లిన ఇబ్బందులు ఉండవని నేషనల్ హైవే అథారిటీ అధికారులు చెబుతున్నారు.
పూర్తి స్థాయి అమలుపై అనుమానాలు..
ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్టాగ్ విధానంతోనే పలుమార్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇకపై పూర్తి స్థాయిలో ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేస్తే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన స్కానర్లు పని చేయక పోవడంతో వాహనదారులు ఇబ్బందుల పాలు కావాల్సి వస్తోంది. ఫాస్టాగ్ కలిగిన వాహనం టోల్ గేట్‌లోకి వెళ్లిన సరిగా స్కాన్ చేయక పోవడంతో వాహనాన్ని వెనక్కి ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితులే భవిష్యత్‌లో ఏర్పడితే ఇబ్బందేనన్న అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతికత సమస్యలతో వాహన దారులకు ఇబ్బందులు తలెత్తితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఫాస్టాగ్ విధానాన్ని పక్కాగా అమలు చేస్తేనే వాహనదారులకు ఇబ్బందులు ఉండవంటున్నారు.
ప్రతీ వాహనానికి ఫాస్టాగ్ ఉండాల్సిందే..
- తరుణ్‌కుమార్ (నేషనల్ హైవే పీడీ, ఆదిలాబాద్)
వాహనదారుడికి ఆధార్‌కార్డు ఉన్నట్లుగానే ప్రతీ వాహనానికి ఫాస్టాగ్ ఉండాల్సిందే. జనవరి 1 నుంచి అన్ని టోల్ ప్లాజాల్లో పూర్తి స్థాయిలో ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేస్తున్నాం. నగదు చెల్లింపులకు అవకాశం ఉండదు. టోల్‌ప్లాజాల వద్ద ఉచితంగా అందజేస్తున్న ఫాస్టాగ్ స్టిక్కర్ తీసుకొని కనీసం రూ.200 బ్యాలెన్స్ ఉండే విధంగా చూసుకోవాలి. శుక్రవారం నుంచి క్యాష్‌లైన్‌లను పూర్తిగా మూసి వేయడం జరుగుతుంది. ఫాస్టాగ్ కలిగిన వాహనాలు ఏ టోల్‌ప్లాజాలోనైనా ఉపయోగించుకునే వీలుంటుంది.