కోతుల కంట్రోల్‌

ABN , First Publish Date - 2020-12-20T06:26:56+05:30 IST

గత కొన్నేళ్ల నుంచి సాధారణ జనాన్ని అతలాకుతలం చేస్తూ ఆ జనంతో సహవాసం చేస్తున్న కోతుల దూకుడుకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడబోతోంది.

కోతుల కంట్రోల్‌
ట్రయల్స్‌లో భాగంగా కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేస్తున్న వైద్యులు

సంతానాన్ని అరికట్టేందుకు మంకీ రెస్క్యూ సెంటర్‌

నిర్మల్‌లో నేడు ఫైలెట్‌ ప్రాజెక్ట్‌ షురూ

రాష్ట్రంలోనే మొదటిది.. దేశంలో రెండోది 

రూ. 2.25కోట్లతో నిర్మాణం 

నేడు ప్రారంభించనున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

జింకల పార్కు ఏర్పాటుకు శ్రీకారం 

మూషిక జింకల పెంపునకు చర్యలు 


నిర్మల్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : గత కొన్నేళ్ల నుంచి సాధారణ జనాన్ని అతలాకుతలం చేస్తూ ఆ జనంతో సహవాసం చేస్తున్న కోతుల దూకుడుకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడబోతోంది. కొంతకాలం నుంచి అడవులను వదిలేసి కోతు లు ఊళ్ళల్లోకి చోరబడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్న సంగతి తెలిసిందే. కోతుల సంతానం గణనీయంగా పెరిగిపోవడంతో కొద్ది రోజుల్లోనే వాటిసంఖ్య నాలుగింతలైపోయింది. ఈ సమస్య పరిష్కారానికి అధికారులు అన్నిరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ ఒక్క ప్రయత్నం ఫలించలేదు. ఎట్ట కేలకు అటవీశాఖ కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ సంరక్షణ కేంద్రంలో కోతుల సంతానాన్ని అరికట్టేందుకు ప్రత్యేక ఆపరేషన్‌లు చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని గండిరామన్న హరితవనంలో ఈ కోతుల సంరక్షణ పునరావాస కేంద్రం నిర్మాణానికి బీజం వేశారు. 2017లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈ మంకీ రెస్క్యూ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. రూ.2.25 కోట్లతో గండిరామన్న హరితవనంలో రెస్క్యూసెంటర్‌ను నిర్మించారు. ఇందులో ప్రత్యేకంగా కుటుంబ నియంత్రణకు సంబందించిన ఆపరేషన్‌ అలాగే ప్రయోగశాలను కూడా నిర్మించారు. దేశంలోనే రెండో మంకీ రెస్క్యూ సెంటర్‌గా ఇది గుర్తింపు పొందుతోంది. రాష్ట్రంలో మొట్ట మొదటి ఫైలెట్‌ప్రాజెక్ట్‌గా ఈ మంకీ రెస్క్యూసెంటర్‌ నిలుస్తోంది. ఇక్కడ కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయడమే కాకుండా కొంతకాలం పాటు సంరక్షించేందుకు ప్రత్యేక పశువైద్యాధికారిని నియమించారు. అలాగే అవ సరమైన సిబ్బందిని కూడా నియమించి ఇక ఆపరేషన్‌ మంకీని అమలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కోతులను అక్కడి గ్రామపంచాయతీ సర్పంచ్‌తో పాటు పాలకవర్గం పట్టుకోవాల్సి ఉంటుంది. అలా పట్టుకున్న కోతులను గ్రామ పంచాయతీ అటవీశాఖకు అప్పగించాలి. అటవీశాఖ కోతులను నిర్మల్‌లోని మంకీ రెస్క్యూసెంటర్‌కు తీసుకువస్తుంది. తరువాత ఓ పదిరోజుల పాటు కోతులను రెస్క్యూసెంటర్‌లోనే ఉంచి అనంతరం కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు నిర్వహిస్తారు. ఆపరేషన్‌ తరువాత వారం రోజుల పాటు ఇక్కడే ఉంచి పరిస్థితి కుదుటపడగానే ఆ కోతులను తిరిగి అడవుల్లో వదిలేస్తారు. కాగా ఆదివారం కోతుల సంరక్షణ పునరావాస కేంద్రాన్ని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో పాటు ఇక్కడి పార్కులో ప్రత్యేక జింకల పార్కును కూడా ఏర్పాటు చేయబోతున్నారు. పార్కులు, అడవుల్లో తగ్గిపోతున్న మూషిక రకం జింకలను ఇక్కడ పెంచనున్నారు. దీని కోసం గాను హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా రెండు జింకలను ఇక్కడికి రప్పిస్తున్నారు. జింకల పెంపు కోసం కూడా ప్రత్యేకషెడ్డును నిర్మించారు. జింకలను మొదట బ్రీడింగ్‌ చేసి వాటి సంతానాన్ని పెంచనున్నారు. ఇలా మూషిక జింకల సంతానాన్ని ఎక్కువ సంఖ్య లో పెంచి ఆ తరువాత దశల వారీగా వాటిని అడవుల్లో వదలాలని నిర్ణయించారు. మౌస్‌డీర్‌ పేరిట పిలిచే ఈ మూషిక జింకలు 14 సంవత్సరాలు జీవిస్తాయి. లాకోన్స్‌ సంస్థ సహకారంతో నిర్మల్‌లో మూషిక జింకల పార్కును నిర్వహించబోతున్నారు. ఈ పార్కు ఏర్పాటుకు అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సంబందిత అటవీ శాఖ నుంచి అన్ని రకాల క్లియరెన్స్‌లను మంజూరు చేయించారు. 

ఎట్టకేలకు కోతుల దూకుడుకు అడ్డుకట్ట

గత కొంతకాలం నుంచి జిల్లా జనాన్ని వానరుల దండు అతలాకుతలం చేస్తోంది. గుంపులు గుంపులుగా కోతులు పట్టణ ప్రాంతాలనే కాకుండా గ్రామాల్లో సైతం సంచరిస్తూ జనాన్ని పీడిస్తున్నాయి. దీంతో పాటు పంట చేలపై కూడా దాడులు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గల్లీల్లో కోతుల గుంపుల కారణంగా ప్రజలు నడచేందుకు సైతం జంకుతున్నారు. ఇళ్లపై పడి భీభత్సం సృష్టిస్తున్నాయి. అటు గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులకే కాకుండా అటవీ శాఖకు కోతుల వ్యవహారం ఓ పెద్ద సవాలుగా మారిపోయింది. కోతుల విషయంలో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ప్రత్యేక నిబంధనల కారణంగా పరిష్కరించలేని పరిస్థితి తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కోతుల పునరావాస కేంద్ర ఏర్పాటు అంశాన్ని తెరపైకి తెచ్చారు. సర్కారుతో చర్చించి నిర్మల్‌లోని గండిరామన్న హరితవనంలో మంకీ రెస్క్యూ సెంటర్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందింపజేశారు. 

గ్రామ పంచాయతీలదే బాధ్యత

అయితే అటవీశాఖ అనుమతితో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు తమ పరిధిలో కోతులను పట్టుకోవాల్సి ఉంటుంది. దీని కోసం కొద్దిరోజుల పాటు ప్రత్యేకంగా కోతులు పట్టే వారిని రప్పించి వాటిని పట్టుకొని అటవీశాఖకు అప్ప గించాలి. ఆ తరువాత అటవీశాఖ పట్టుకున్న కోతులను మంకీ రెస్క్యూ సెంటర్‌ కు తరలిస్తాయి. ఇదిలా ఉండగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కోతులను పట్టుకునే విషయంలో తమ భాగస్వామ్యం పంచుకోబోతున్నందున అటవీ శాఖపై భారం తగ్గుతుంది. అలాగే కోతులను పట్టుకునేందుకు అయ్యే ఖర్చును కూడా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు భరించాల్సి ఉంటుంది. 

రాష్ట్రంలోనే మొదటిది

కాగా రాష్ట్రంలో మొట్ట మొద టి మంకీ ఆపరేషన్‌ సెంటర్‌ను నిర్మల్‌లో ఏర్పాటు చేయబోతుండడం విశేషం. దేశంలోనే రెండోవది కావడం గమనార్హం. ఇప్పటి వరకు కేవలం హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోనే ఒకే ఒక మంకీ రెస్క్యూ సెంటర్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం నిర్మల్‌లో ఏర్పాటు చేయబోతున్న రెస్క్యూ సెంటర్‌ దేశంలోనే రెండో రెస్క్యూ సెంటర్‌గా నిలవనుంది. మొదట ఫైలేట్‌ ప్రాజెక్ట్‌గా దీనిని చేపడుతున్నారు. ప్రభుత్వం ఈ రెస్క్యూ సెంటర్‌ కోసం రూ.2.25 కోట్లను ఖర్చు చేయడమే కాకుండా ప్రత్యేక పశువైద్యాధికారిని అలాగే ఇతర సిబ్బందిని కూడా నియమించింది. పశువైఽధ్యాదికారి, సిబ్బందికి కుటుంబ నియంత్రణతో పాటు కోతుల పునరావాస చర్యలపై హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రత్యేక శిక్షణను ఇప్పించారు. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా కోతుల కుటుంబ జనాభాను అరికట్టేందుకు అవసరమయ్యే ప్రయోగాలు చేసేందుకు గాను ప్రత్యేక ప్రయోగశాలను కూడా నిర్మించారు. 

జింకల పార్కుకు శ్రీకారం

అలాగే ఇక్కడి హరితవనంలో మూషిక జింకల పార్కును ఏర్పాటుచేయబోతున్నారు. దీని కోసం గాను మౌస్‌డీర్‌ జాతికి చెందిన రెండు మూషిక జింకలను హైదరాబాద్‌ నుంచి రప్పిస్తున్నారు. ఈ రెండు జింకల ద్వారా బ్రిడింగ్‌ జరిపి సంతానాన్ని విస్తరించనున్నారు. దీని కోసం గాను ఇక్కడ ప్రత్యేకంగా షెడ్డును నిర్మించారు. సందర్శకులను ఈ జింకలను చూసేందుకు అనుమతించరు. జింకల సంతానం పెరిగిన తరువాత వాటిని దశల వారిగా అడవుల్లోకి వదలనున్నారు. 

నేడు మంత్రి అల్లోల చేతుల మీదుగా ప్రారంభం

నిర్మల్‌లో ఏర్పాటు చేయబోతున్న మంకీ రెస్క్యూ సెంటర్‌ను ఆదివారం అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించనున్నారు. పనిలో పనిగా జింకల పార్కు ఏర్పాటుకు సంబందించి కూడా మంత్రి అల్లోల అధికారిక ప్రకటన వెలువరించనున్నారు. 2017లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి మంకీ రెస్క్యూ సెంటర్‌కు శంకుస్థాపన  చేసిన సంగతి తెలిసిందే. దీని కోసం గాను మంత్రి అటవీశాఖ ద్వారా రూ. 2.25 కోట్లను మంజూరు చేయించారు. అలాగే పశువైద్యాధికారిని కూడా నియమింపజేశారు. కోతుల పునరావాస కేంద్రం ప్రా రంభానికి అటవీశాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. 

Updated Date - 2020-12-20T06:26:56+05:30 IST